ఇది కాంగ్రెస్‌ పార్టీకి అంత మంచిది కాదు! | Dileep Reddy analysis AICC national convention in Ahmedabad | Sakshi
Sakshi News home page

కాలంతో కాలు కదిపితేనే.. కాంగ్రెస్‌కు మళ్లీ పాత రోజులు

Published Sat, Apr 12 2025 12:52 PM | Last Updated on Sat, Apr 12 2025 1:01 PM

Dileep Reddy analysis AICC national convention in Ahmedabad

విశ్లేషణ

కాంగ్రెస్‌ పునర్వైభవం, కాంగ్రెస్‌ కన్నా దేశానికి ఎక్కువ అవసరమనే ప్రజల ఆకాంక్షని పార్టీ నాయకత్వం గ్రహించినట్టుంది. కానీ, అదెలా జరగాలనే విషయంలో దానికొక స్పష్టత లేదని ఏఐసీసీ 86వ జాతీయ సమావేశాన్ని చూస్తే అర్థమవుతుంది. పాత విషయాల వల్లెవేతే తప్ప... జాతికి నూతన ఆశలు కల్పించే, మిత్రపక్షాలకు కొత్త నమ్మిక ఏర్పరిచే, పార్టీ శ్రేణులకు తాజా ప్రేరణనిచ్చే అంశా లేవీ తీర్మానాల్లోకి రాలేదు.  

కాలం చెల్లిన అంశాలను వల్లెవేయడం కాకుండా కాలంతో కాలు కదిపితేనే కాంగ్రెస్‌కు మళ్లీ పాత రోజులు వస్తాయని పార్టీ నాయకులు, కార్యకర్తలు బలంగా నమ్ము తున్నారు. ఆ దిశలో నాయకత్వమే చొరవ చూపటం లేదు. జాతిపిత గాంధీజీ ఆశ్రమం నెలకొల్పిన సబర్మతి నదీ తీరంలో జరిగిన రెండు రోజుల కాంగ్రెస్‌ జాతీయ సదస్సు (Congress National Convention) ‘మరో భేటీ’ లాగ, సాదాసీదాగానే ముగిసింది. కాంగ్రెస్‌ మహామహుల పుట్టిల్లయి ఉండీ, మూడు దశాబ్దాలుగా అధికారానికి పార్టీ దూరమైన గుజరాత్‌ (Gujarat) నేల నుంచి గట్టి సందేశం ఇచ్చి ఉండాల్సిందనే భావన కాంగ్రెస్‌ శ్రేణుల్లో ఉంది. సదస్సు చప్పగా సాగిందని పార్టీ ముఖ్యనేతలే అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారు.

కాంగ్రెస్‌ లేని భారత్‌ (కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌) నెలకొల్పాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం ముమ్మరంగా ప్రచారం చేస్తూ, పార్టీ ప్రభుత్వాలను కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితం చేసిన తరుణంలో... ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌ మిశ్రమ ఫలితాలు సాధించిన 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత హరియాణా, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పార్టీ నాయకత్వాన్ని కుంగదీసింది. 

ముఖ్యంగా హరియాణా, మహారాష్ట్రల్లో గెలిచే పరిస్థితులుండీ బీజేపీ నేతృత్వపు ఎన్డీయే కూటమి చేతిలో ఓటమి తప్పలేదు. జమ్మూ–కశ్మీర్, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో విపక్ష ‘ఇండియా కూటమి’ నెగ్గినా అక్కడ కాంగ్రెస్‌ ప్రభావ రహితమైన మైనర్‌ పార్ట్‌నర్‌గానే ఉంది. కొన్ని చోట్ల జాతీయ పార్టీని, కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తుల్ని, మరికొన్ని చోట్ల జతకట్టిన మతతత్వ శక్తుల్నీ... ఇలా ఆ యా రాష్ట్రాల్లో భిన్నమైన ప్రత్యర్థుల్ని ఎదుర్కొనే పరిస్థితి కాంగ్రెస్‌కుంది. అందుకే, ప్రస్తుత భేటీ కాంగ్రెస్‌కు ముఖ్యమైనదిగా పార్టీ శ్రేణులు పరిగణించాయి.

యువతరాన్ని ఆకట్టుకోవాల్సిందే!
ఉక్కుమనిషి సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌ను ఎవరు సొంతం చేసుకుంటున్నారు అన్నది ఇవాళ్టి యువతకు పట్టే అంశం కానేకాదు. పటేల్, నెహ్రూల మధ్య, లేని అంతరాల్ని ఎగదోస్తూ ప్రత్యర్థులు రాజేసే రాజకీయ కుంపటి చుట్టూ కాంగ్రెస్‌ తిరగాల్సిన అవసరమే లేదన్నది సగటు కాంగ్రెస్‌ కార్యకర్త మనోభావన! భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి చేస్తోందనే కాంగ్రెస్‌ ఘాటైన విమర్శకు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనే ‘పొలిటికల్‌ డివిడెండ్స్‌’ లభించాయి. ‘ఇండియా కూటమి’కి 150 స్థానాలు మించి రావని దేశంలోని 16 ప్రముఖ సర్వే సంస్థలు వేసిన అంచనాల్ని తలకిందులు చేస్తూ, 235 స్థానాలు గెలుచుకోవడం ఈ ప్రచార ప్రభావమే! 400 స్థానాలు ఆశించిన బీజేపీ సొంతంగా 240, కూటమికి 293 స్థానాలతోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. మళ్లీ అదే నినాదాన్ని ఎంత బిగ్గరగా వినిపించినా.... తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేయలేదు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, అభివృద్ధి లేమి వంటి సమస్యలు ప్రజల నిత్య ఆలోచనల్లో ఉన్నాయి. ఆయా అంశాల్లో ప్రభుత్వం ఎంతగా విఫలమైందో ఎండగట్టే విపక్ష ఎత్తుగడలు యువతను ఆకట్టుకోవడానికి పనికొస్తాయి.

‘కులగణన’ ఒక స్థాయి వరకు సానుకూల ఫలితాలిచ్చినా, తదుపరి ప్రతికూలించే ప్రమాదముందనే అభిప్రాయాన్ని పార్టీలోని ఒక వర్గం వ్యక్తం చేస్తోంది. దేశంలో బలమైన ప్రతిపక్షం ఉండాలనే ప్రజాభిప్రాయం స్వాగతించదగిందనీ, లేకుంటే ప్రాంతీయ శక్తుల ప్రాబల్యం పెరుగుతుందనే భావనను కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) వ్యక్తం చేసిన విషయం తెలిసిందే! పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) భేటీ కూడా జరిగిన జాతీయ సదస్సు ఈ విషయంలో ప్రజల దృష్టిని ఆకర్షించలేకపోయిందనే భావన శ్రేణుల్లో ఉంది.

ఆశ, ఆకాంక్ష అయితేనే...
పార్టీ కీలక తీర్మానానికి మద్దతు పలుకుతూ, సదస్సులో ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor) ఒక మాటన్నారు: ‘కాంగ్రెస్‌ అంటే పగ. ప్రతీకారం కాకుండా ప్రజలకు ఒక ఆశ, ఆకాంక్ష అవ్వాలి. కాంగ్రెస్‌ అంటే కేవలం గత వైభవమే కాకుండా, సానుకూల దృక్పథం కలిగిన ఒక ఆశావహ భవిష్యత్‌ కావాలి. వ్యతిరేకిస్తూ చేసే విమర్శ మాత్రమే కాకుండా సద్యోచన, నిర్మాణాత్మక సహకారం అందించే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ ఉండాలి.’

సదస్సు రెండో రోజు సాంఘిక శాస్త్ర పాఠంలా సాగిన రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ప్రసంగంలో ప్రధానంగా కాంగ్రెస్‌ కృషిని, త్యాగాలను ప్రశంసించడంతో పాటు బీజేపీ, ఆరెస్సెస్‌ది విపరీత భావజాలమంటూ విమర్శలు గుప్పించారు. ‘రాహుల్‌ ఇలా మాట్లాడాలి. కానీ, మాట్లాడరు’ అంటూ సంపాదకుడు హరీశ్‌ ఖరే ఒక రోజు ముందుగా ‘ద వైర్‌’ వేదికగా వెలువరించిన ప్రసంగ(వ్యాస)ంలోని ముఖ్యాంశాలను రాహుల్‌ నిజంగానే ప్రస్తావించలేదు. ‘..మతఛాందసం, వేర్పాటువాదం, నియంతృత్వాలకు వ్యతిరేకంగా నా శక్తి మొత్తాన్ని వెచ్చించి కడదాకా పోరాడుతానని విస్పష్టంగా ప్రకటిస్తున్నాను..’ అనే మాటలతో మొదలై, ‘.. గాంధీ, నెహ్రూ కుటుంబానికి చెందిన వాడినైనందున, మా తండ్రి, నాయనమ్మ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసినందున... సహజంగానే నేను ప్రధానమంత్రి పదవికి అర్హుడనైతానని మీలో కొందరు భావిస్తుండవచ్చు. కానీ, నాకా ఆలోచన లేదు. నేను గానీ, మా కుటుంబంలో మరెవరైనా గానీ, ఆ పదవిని ఆశించడం లేదు’ అనే మాటలతో హరీశ్‌ వ్యాసం సాగుతుంది. ఆయన రాసినట్టుగానే ఇవేవీ రాహుల్‌ మాట్లాడలేదు.

ఈ పద్ధతి సరికాదు!
పార్టీని దేశవ్యాప్తంగా బలోపేతం చేస్తామంటూనే, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పార్టీ బలహీనపడే పరిస్థితులను అధినాయకత్వం ఉపేక్షించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోవడం లేదు. కొన్నిసార్లు పరోక్షంగా అధిష్ఠానమే ప్రోత్సహిస్తోంది. ఇందుకు తెలంగాణ, కర్ణాటకలో ప్రత్యక్ష ఉదంతాలున్నాయి. తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న పార్టీ ప్రధాన కార్యదర్శి మీనాక్షీ నటరాజన్‌ నేరుగా సచివాలయానికి వెళ్లి, మంత్రివర్గ ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయి, హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (Hyderabad Central University) భూవివాదాంశాన్ని సమీక్షించడం పలువురిని విస్మయానికి గురిచేసింది. పార్టీ కార్యాలయమైన గాంధీభవన్‌లో కాకుండా నేరుగా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థి ప్రతినిధులు, పౌర సంఘాల వారితో ఆమె ముచ్చటించారు. మళ్లీ వచ్చి, ఆ అంశాలను మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించారు. 

మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ, ఆయా ప్రతినిధులు, వర్గాల వారితో అది చర్చిస్తుందన్న ముఖ్యమంత్రి మాటలు అమలు కాకముందే, ఆమె ఈ ‘హడావిడి’ చర్యలకు పూనుకున్నారు. ఆమె ఏ హోదాతో సచివాలయంలో ఉపసంఘంతో, అధికారులతో భేటీ అయ్యారనే ప్రశ్న సహజంగానే తలెత్తింది. ఇది సదరు మంత్రివర్గాన్ని, ముఖ్యమంత్రిని, కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన పరిస్థితి. ప్రత్యర్థి పార్టీల విమర్శలకూ, సొంత పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికీ కారణమైంది. అంతకు ముందు ఇన్‌చార్జ్‌గా ఉన్న దీపాదాస్‌ మున్షీపై ఒక రకం ఆరోపణలుంటే, గాంధేయవాది, ప్రజాస్వామ్య ప్రేమికురాలు, నిరాడంబరనేత అని పేరున్న మీనాక్షి చొరవను, ఒక అతి చేష్టగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

చ‌ద‌వండి:  క‌న్నీరు కార్చ‌డ‌మే దేశ‌ద్రోహ‌మా?

ఢిల్లీలో బీసీ ధర్నా రోజు, అప్పటివరకు స్పందించకుండా ఉండి, ముఖ్యమంత్రి హైదరాబాద్‌ వచ్చిన తర్వాత రాహుల్, సోనియాలు బీసీ నాయకుల్ని కలవటం కూడా తప్పుడు సంకేతాలనిచ్చిందనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది. ఇది పార్టీకి అంత మంచిది కాదు.

- దిలీప్‌ రెడ్డి 
సీనియర్‌ జర్నలిస్ట్, పీపుల్స్‌ పల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement