సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలన్న కృతనిశ్చయంతో ఉన్న కాంగ్రెస్ హైకమాండ్ తన ఆపరేషన్‌ను ప్రారంభించింది. ‘మిషన్ తెలంగాణ’పేరుతో నేటి కౌంటింగ్ ప్రక్రియ మొదలై ముగిసే దాకా అనుసరించాల్సిన వ్యూహాలకు పదునుపెట్టింది. ఈ బాధ్యతను కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ‘ట్రబుల్ షూటర్’ డి.కె. శివకుమార్‌కు అప్పగించింది. ఆయనకు తోడుగా పలువురు కర్ణాటక మంత్రులు, కొందరు ఏఐసీసీ కీలక నేతలు ఆపరేషన్‌లో పాలుపంచుకోనున్నారు. కర్ణాటక మంత్రులు జార్జి, బోసురాజు శనివారం మధ్యాహ్నానికే హైదరాబాద్ చేరుకోగా డి.కె.శివకుమార్ రాత్రికి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఆపరేషన్ కోసం రెండు ప్లాన్‌లను ఏఐసీసీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
కీలక నేతలతో రాహుల్ మీటింగ్
ఎన్నికల కౌంటింగ్ ఆదివారం ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం సాయంత్రం ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఈ భేటీలో టీపీసీసీ ముఖ్య నేతలు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు కర్ణాటక మంత్రులు జార్జి, బోసురాజు, పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, పరిశీలకులు పాల్గొన్నారు. ఫలితాలు వచ్చాక అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పార్టీ అభ్యర్థులను ముందే హైదరాబాద్‌కు పిలిపించాలన్న కొందరి సూచనలను రాహుల్ తిరస్కరించినట్లు తెలిసింది.
కౌంటింగ్ కేంద్రాల్లో అభ్యర్థులు లేకుంటే నష్టం జరుగుతుందని, ప్రజల్లోకి కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయ ని ఆయన చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు అభ్యర్థులను అక్కడే ఉంచాలని, ఫలితాలను బట్టి అభ్యర్థుల తరలింపుపై నిర్ణయం తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది. ఏఐసీసీ పంపుతున్న కీలక నేతలు రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులను పర్యవేక్షించాలని, ఏఐసీసీ పరిశీలకులతోపాటు జిల్లాల్లోని ముఖ్య నాయకులు అక్కడి పరిస్థితులను సమన్వయం చేసుకోవాలని... జిల్లాలవారీగా బాధ్యులను నియమించుకొని కౌంటింగ్ సమయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ద్విముఖ వ్యూహంతో ముందుకు..
ఈసారి అధికారం దక్కించుకునేందుకు రెండు వ్యూహాలను కాంగ్రెస్ సిద్ధం చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ వస్తే ప్లాన్–ఏ, కొన్ని స్థానాలు తక్కువ పడే సందర్భంలో ప్లాన్–బీని అమలు చేయాలని నిర్ణయించింది. సంపూర్ణ మెజారిటీ సాధిస్తే అభ్యర్థులందరినీ హైదరాబాద్ పిలిపించి డి.కె.శివకుమార్ సమక్షంలో తొలుత సమావేశం ఏర్పాటు చేయనుంది. అనంతరం ఆయనతోపాటు టీపీసీసీ ముఖ్యులంతా కలసి ఢిల్లీ వెళ్లి హైకమాండ్‌తో సీఎల్పీ సమావేశం తేదీని నిర్ణయించాలని, ఆ తర్వాత సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను హైకమాండ్‌కు అప్పగించాలని పార్టీ యోచిస్తోంది.
ఒకవేళ హంగ్ పరిస్థితులు ఏర్పడి మెజారిటీకి కొన్ని స్థానాలు తక్కువగా వస్తే ప్లాన్–బీని అమలు చేయాలని, అప్పుడు వీలైనంత త్వరగా అభ్యర్థులందరినీ హైదరాబాద్‌కు పిలిపించి టీపీసీసీ ముఖ్య నేతలతో సహా అందరినీ బెంగళూరుకు తరలించాలని భావిస్తోంది. హంగ్ వస్తే ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంప్రదింపులు జరిపేందుకు గెలిచిన ఎమ్మెల్యేలందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించాలనేది ఏఐసీసీ ఆలోచనగా కనిపిస్తోంది.
ఈ పరిస్థితుల్లోనే గెలుపు ధ్రువీకరణ పత్రాలను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ల ద్వారా తీసుకొనే ఏర్పాటు చేసుకోవాలని యోచిస్తోంది. ఈ విషయమై టీపీసీసీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’తో మాట్లాడుతూ క్యాంపు రాజకీయాలకు వెళ్లాల్సిన అవసరం తమకు ఈసారి ఉండదనే ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ ముగిశాక అనుసరించాల్సిన వ్యూహాలను సమన్వయం చేసేందుకే ముఖ్య నాయకులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారని, అది ఏఐసీసీ వ్యూహంలో భాగమేనని చెప్పారు.
ఎంఐఎం అవసరం ఏర్పడితే?
ఫలితాల్లో తమకు మ్యాజిక్ ఫిగర్ వస్తుందని ధీమాతో ఉన్న కాంగ్రెస్.. ప్రత్యామ్నాయ అవసరాలపైనా సమాలోచనలు చేస్తోంది. ఒకవేళ అతిపెద్ద పారీ్టగా అవతరించి ఎంఐఎంతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు వస్తే ఏం చేయాలన్న దానిపైనా పార్టీలో చర్చ జరుగుతోంది. ఎన్నికల సందర్భంగా బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటేనని ప్రజలకు చెప్పిన నేపథ్యంలో ఎంఐఎం మద్దతు తీసుకోవాలా వద్దా అనే దానిపైనా ముఖ్యనేతలు కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఐఎం మద్దతిచ్చేందుకు ముందుకొస్తే బయటి నుంచి ఆ పార్టీ మద్దతు తీసుకోవడంలో అభ్యంతరం ఏమీ ఉండబోదని, తెలంగాణలో రాజకీయ సుస్థిరత కోసం ఈ నిర్ణయం తీసుకున్నా ప్రజలు అర్థం చేసుకుంటారనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జరిగినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్.. ‘మిషన్ తెలంగాణ’
Published Sun, Dec 3 2023 5:00 AM | Last Updated on Sun, Dec 3 2023 5:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment