
న్యూఢిల్లీ, సాక్షి: భారత్‌పై అమెరికా విధించిన పరస్పర సుంకాలు 26 శాతం నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ ప్రభావంతో.. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ్టి కేబినెట్ భేటీని కీలకంగా భావిస్తోంది. అలాగే తాజా పరిణామాల నేపథ్యంలో సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కేంద్ర కేబినెట్ సమావేశంలో.. అమెరికా , భారతీయ ఉత్పత్తులపై విధించిన సుంకాల పై కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అమెరికా ప్రభుత్వం కొన్ని భారతీయ ఉత్పత్తులపై సుంకాలను పెంచడం పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. మరీ ముఖ్యంగా ఉక్కు, అల్యూమినియం, ఫార్మా ఉత్పత్తులు, ఆటోపార్ట్స్‌పై సుంకాల ప్రభావం పడనుంది. ఈ క్రమంలో.. ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. అలాగే..
అమెరికా చర్యలు అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు విరుద్ధమని భావిస్తున్న కేంద్రం.. WTO వద్ద సమస్యను లేవనెత్తే దిశగా ఆలోచనపై చర్చించే అవకాశం ఉంది. అలాగే.. ప్రతిస్పందనగా భారత్ తరఫున కొంతమేర కౌంటర్ టారిఫ్‌లు విధించాల్సిన అవసరం ఉందా? అనే దానిపై విస్తృతంగా చర్చించనుందని సమాచారం. అయితే, అవి పరస్పర ప్రతీకారంగా ఉండకూడదని కేంద్రం భావిస్తోంది. అలాంటి ఒప్పందాల దిశగా సిద్ధమవుతోందని భోగట్టా. అలాగే.. అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై సమీక్ష జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇక అమెరికా సుంకాల వల్ల ప్రభావితమవుతున్న భారతీయ ఎగుమతిదారులకు మద్దతు కల్పించేలా ఆదాయ పరంగా వెసులుబాట్లు ఇవ్వాలనే ప్రతిపాదన కేబినెట్ ముందుకు రానుంది. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో అమెరికా ప్రభుత్వంతో ఉన్న చర్చలను వేగవంతం చేసే అంశంపై చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు.. తమ దేశంపై ట్రంప్ 104 శాతం సుంకాల విధింపును అన్యాయంగా పేర్కొంటున్న చైనా.. అగ్రరాజ్య ప్రాధాన్యతను తగ్గించేందుకు కలిసి పనిచేద్దామంటూ భారత్‌కు ప్రతిపాదన చేసింది. అయితే కేబినెట్ భేటీలో చైనా ప్రతిపాదన అంశం చర్చకు వచ్చే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి.
ట్రంప్ విధించిన టారిఫ్‌లలో ఇప్పటికే 10 శాతం అమల్లోకి రాగా.. తాజాగా మరో 16 శాతం నేటినుంచి అమలవుతోంది. తనకు భారత ప్రధాని మోదీ గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైనవిధంగా వ్యవహరించడం లేదని టారిఫ్‌ల విధింపు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. 52 శాతం సుంకాలను విధిస్తోందన్నారు. తాము అందులో సగమే విధిస్తున్నామని ఆయన చెప్పారు.