వక్ఫ్‌ బిల్లుపై వ్యతిరేకత ఎందుకంటే... | Sakshi Guest Column On Waqf Bill | Sakshi
Sakshi News home page

వక్ఫ్‌ బిల్లుపై వ్యతిరేకత ఎందుకంటే...

Published Wed, Apr 2 2025 5:02 AM | Last Updated on Wed, Apr 2 2025 5:02 AM

Sakshi Guest Column On Waqf Bill

అభిప్రాయం

కేంద్ర ప్రభుత్వం బుధ వారం (నేడు) పార్లమెంట్‌లో ‘వక్ఫ్‌ సవరణ బిల్లు’ను ప్రవేశపెడుతోంది. ఈ చర్చను ముస్లింల సంక్షేమ కార్యకలాపాలకు ఇచ్చిన ఆస్తులను కబళించే ప్రణాళికలో భాగంగా ముస్లిం సమాజం భావిస్తోంది. అలాగే ఇది లౌకికస్ఫూర్తి, మత స్వేచ్ఛ, సమానత్వం అనే రాజ్యాంగ విలువలను తుంగలోకి తొక్కుతోంది. అందుకే ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ దీన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమ వుతోంది. ముస్లిం సమాజం ఈ బిల్లును వ్యతిరేకించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. 

వక్ఫ్‌కి ఆదాయం ఎలా తేవాలి? ఆదాయాన్ని ఎలా వినియోగించాలి అనేదానిపై సర్వహక్కులు వక్ఫ్‌ బోర్డ్‌కి ఉంటాయి. కానీ ఈ సవరణ బిల్లులోని సెక్షన్‌ 32, సబ్‌ సెక్షన్‌ 2 క్లాజ్‌ (ఇ)ను సవరించడం ద్వారా ఈ ఆదాయ సముపార్జన, వినియోగాలపై వక్ఫ్‌ బోర్డుకున్న అధికారాలు పరిమితం చేయ బడ్డాయి. ఇప్పటికే వక్ఫ్‌ భూముల్లో 50% అన్యాక్రాంతమయ్యాయి. ‘ఢిల్లీ డెవలెప్‌మెంట్‌ అథారిటీ’ అనే ప్రభుత్వ సంస్థ ఢిల్లీలోని 30% వక్ప్‌ భూములను ఆక్రమించుకుంది. 

ఇప్పుడు ప్రతిపాదిత బిల్లు గనక చట్టం అయితే ఉన్న భూములను కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. సరైన పత్రాలు లేని భూములు వక్ఫ్‌ అధీనంలో ఉంటే అది (వక్ఫ్‌ బై యూజర్‌ ) వక్ఫ్‌ ప్రాపర్టీగానే భావించబడుతుంది. ఇçప్పుడు దీన్ని తొలగించనున్నారు. అదే జరిగితే డాక్యుమెంట్స్‌ లేని వక్ఫ్‌ ఆస్తులు ఆరునెలల్లోగా రిజిస్టర్‌ కాక పోతే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. 

మత నియమాల ప్రకారం ఒకసారి సంక్షేమ కార్యక్రమాలకు దానం చేసిన ఆస్తిని ఇతర కార్య కలాపాలకు వాడకూడదు. ఈ బిల్లుతో దాన్ని తుంగలో తొక్కి పెద్ద స్థాయిలో వక్ఫ్‌ భూములను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వం ఆక్రమించుకోవచ్చు. లేదా కార్పొరేట్లకు కట్టబెడుతుంది.

అలాగే, సెక్షన్‌ 104 ఓనర్‌ షిప్‌కి సంబంధించినది. చట్టం ప్రకారం ముస్లిమేతరులు కూడా వక్ఫ్‌ చేయవచ్చు. కానీ కొత్త సవరణ ప్రకారం ముస్లింలే డొనేట్‌ చేయాలి. దానధర్మాల కోసం ఇచ్చేదానిలో మతాలను చొప్పించడం సరికాదు. మరోవైపు ముస్లింలు మాత్రం ఇతర మత సంస్థలకు డొనేట్‌ చేయడాన్ని నిషేధించలేదు. ఇది ద్వంద్వ వైఖరి మాత్రమే కాక వక్ఫ్‌ను బలహీనపరిచే చర్య కూడా!

చాలా రాష్ట్రాల్లో  హిందువేతరులు కూడా హిందూ దేవాలయాలకు  దానం చేయవచ్చు అనే నిబంధన ఉంది. ఇదే నిబంధన వక్ఫ్‌ విషయంలోఎందుకు పాటించడం లేదు అనేది కీలకప్రశ్న. గతంలో వక్ఫ్‌ కౌన్సిల్‌లో ముస్లింలు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు తలపెట్టిన సవరణ ద్వారా కౌన్సిల్‌లో ముస్లింల సంఖ్యను సగానికి  తగ్గించి, మిగిలిన సగాన్ని ముస్లిమేతరులతో భర్తీ చేస్తుంది. 

మరి ఎండోమెంట్‌ బోర్డుల లాంటి వాటిలో ముస్లింలకు స్థానం ఎందుకు కల్పించరు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం జవాబిస్తారు? సెక్షన్‌ 9 ప్రకారం వక్ఫ్‌ కౌన్సిల్‌ లోనూ, సెక్షన్‌ 14 ప్రకారం వక్ఫ్‌ బోర్డులోనూ ఇద్దరేసి ముస్లిమేతరులు సభ్యులుగా ఉంటారు. ఇది ముస్లింల రాజ్యాంగ హక్కులకు విఘాతమే!

గతంలో వక్ఫ్‌ సీఈఓ ముస్లిం అయి ఉండాలి అనే నిబంధన ఉంది. ప్రస్తుతం దానిని తొలగించి ముస్లిమేతరులు కూడా సీఈఓ కావచ్చని మార్చ బోతున్నారు. ఇది ముస్లింల హక్కులకు గొడ్డలి పెట్టు.

ఇప్పటివరకు వక్ఫ్‌కి డొనేట్‌ చెయ్యాలంటే ఇస్లామ్‌ మతావలంబి అయి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. ప్రస్తుత ప్రతిపాదిత సవరణ ద్వారా ఐదేళ్ళుగా ప్రాక్టీసింగ్‌ ముస్లింగా ఉన్నవారు మాత్రమే డొనేట్‌ చేయాలనడం దారుణం మాత్రమే కాదు... వక్ఫ్‌ను బలహీన పరచడం! అదే ఎండో మెంట్‌ వారి విషయానికి వచ్చేటప్పటికి ప్రాక్టీసింగ్‌ హిందువే దానం చేయాలనే నిబంధన లేదు.

సెక్షన్‌ 5 ప్రకారం వక్ఫ్‌ ట్రిబ్యునల్‌కు ఉన్న అధికారాలను పరిమితం చేయడం జరిగింది. సెక్షన్‌ 3ఇ ప్రకారం కలెక్టర్లను వక్ఫ్‌ భూవివాదాల విచారణ, పరిష్కారాల కోసం నియమించడం సరికాదు. 

ఎందుకంటే కలెక్టర్‌ రెవిన్యూ రికార్డ్‌లకు అధిపతి కనుక అతను ప్రభుత్వ పక్షపాతి అవుతాడు. వివాదంలో ఉన్న ఏ వక్ఫ్‌ ఆస్తినైనా ప్రభుత్వ ఆస్తిగా మార్చేస్తాడు. ఒకసారి వక్ఫ్‌ అయితే అది ఎప్పటికీ వక్ఫే అన్న మతనియమానికి ఇది విరుద్ధం. అంతే కాక, అధికారుల పక్షపాతంతో, అధికార దుర్విని యోగంతో కొన్ని రోజుల్లోనే మొత్తం వక్ఫ్‌ ఆస్తులను ముస్లిం సమాజం కోల్పోయే ముప్పుంది.

ఈ బిల్లు ద్వారా వక్ఫ్‌ భూములకు  లిమిటేషన్‌ చట్టాన్ని వర్తింపచేస్తున్నారు. ఇదే జరిగితే వక్ఫ్‌ బోర్డులు శాశ్వతంగా ఆక్రమణలో ఉన్న వక్ఫ్‌ భూములను తిరిగిపొందే హక్కును... అనగా రైట్‌ ఆఫ్‌ రికవరీని కోల్పోతాయి. అంటే కోల్పోయిన వక్ఫ్‌ భూములు ఎప్పటికీ రికవర్‌ అయ్యే అవకాశం లేదు. 

ఈ అన్ని కారణాల రీత్యా ఈ బిల్లును ప్రజా స్వామ్య వాదులందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో ‘రైతు ఉద్యమ’ స్ఫూర్తితో ముస్లింలు ఉద్యమబాట పట్టబోతున్నారు. సంయుక్త పార్లమెంటరీ సంఘం చెప్పిన అభ్యంతరాల్ని కాదని ప్రభుత్వం బిల్లు తేవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.

ముహమ్మద్‌ షరీఫ్‌ 
వ్యాసకర్త ‘జమాఅతె ఇస్లామీ హింద్‌’
ఏపీ రాష్ట్ర కార్యదర్శి ‘ 99483 15926

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement