ఉత్తరప్రదేశ్‌లో అప్పుడే తమ విజయావకాశాల మీద పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ అసలైన పరీక్ష అవి ఇంకా దాటాల్సే ఉంది. ఏడు దశలుగా జరుగుతున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫిబ్రవరి 10, 14 తేదీల్లో రెండు దశలు ముగిశాయి. మూడో దశ పోలింగ్ 20న జరగనుంది. ఈ దశ బరిలో సమాజ్‌వాదీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నారు. 70 ఏళ్ల ఆ రాష్ట్ర ఎన్నికల చరిత్రలో వరుసగా రెండుసార్లు గెలిచిన ముఖ్యమంత్రులు లేరు. మరి ఆ రికార్డును యోగి ఆదిత్యనాథ్ బద్దలుకొడతారా? ప్రతిష్ఠాత్మక సీఎస్‌డీఎస్, ఢిల్లీ ఎన్నికల విశ్లేషణ ‘సాక్షి’కి ప్రత్యకం.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలిప్పుడు దేశా ద్యంతం హాట్ టాపిక్! సాధారణ ఎన్నికల సెమీఫైనల్స్‌గా పరిగణిస్తారు వీటిని. ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్తు రాజకీయాల తీరు తెన్నులను నిర్దేశిస్తాయంటే అతిశయోక్తి ఏమీ కాదు. ఏకంగా పది హేను కోట్ల ఓటర్లు, 1.70 లక్షల పోలింగ్ కేంద్రాల్లో 403 మంది ఎమ్మె ల్యేలను ఎన్నుకునేందుకు ఏడు దశల్లో నిర్వహిస్తున్న ఈ ఎన్నికల్లో ఇప్పటికే రెండు దశలు ముగిశాయి. మూడో దశ ఓటింగ్‌కూ సన్నాహాలు జరిగిపోతున్నాయి. ఈ ఎన్నికలు ముఖ్యమైనవి అనడంలో సందేహం ఏమీ లేదు కానీ... యూపీలో గెలుపు ఢిల్లీ పీఠాన్ని సులువు చేస్తుందన్న మీడియా కథనాల్లో కొంత అతిశయోక్తి ఉందేమో! యూపీఏ ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్‌కు ఇక్కడ చెప్పుకోదగ్గ స్థానాలేవీ లేని విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
2022 యూపీ ఎన్నికల నగారా ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్, సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ మాటల యుద్ధంతోనే మొదలైందనవచ్చు. ఫిరాయింపులు, మతోన్మాదంతో కూడిన ప్రకట నలు, రాజకీయ ఆధిపత్యం కోసం పోటాపోటీ ఈ తాజా ఎన్నికల తీరు. కుల, కూటమి రాజకీయాలకు ప్రాధాన్యం దక్కే ఉత్తరప్రదేశ్‌లో ప్రతి పార్టీ తమ రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, అధికా రాన్ని అందుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. 2017 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన కాషాయ సునామీలో భారతీయ జనతా పార్టీ మొత్తం 403 స్థానాల్లో 312 గెలుచుకుంది. బీజేపీ కూటమి సభ్యులైన అప్నా దళ్ (సోనోలాల్) తొమ్మిది స్థానాలు, సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ) నాలుగు స్థానాలు దక్కించు కున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ 22 స్థానాలు, కూటమి భాగస్వామి కాంగ్రెస్ ఏడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ 22 శాతం ఓట్లతో 19 సీట్లు దక్కించుకుంది. అలాగే మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ మనవడు రాష్ట్రీయ లోక్‌దళ్ అధ్యక్షుడు జయంత్ చౌదరి ఒకే ఒక్క సీటుతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. గత ఎన్నికలు ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దాలుగా సాగుతున్న ప్రాంతీయ పార్టీల ఆధిపత్యానికి గండికొట్టి చరిత్ర సృష్టిం చాయనడంలో సందేహం లేదు.
ఓపీనియన్ పోల్స్ చెబుతున్నదేమిటి?
ఉత్తరప్రదేశ్‌లో ఈసారి ఎన్నికలు భిన్న పరిస్థితుల్లో జరుగుతున్నా యని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ, ఏఐఎంఐఎం బరిలోకి దిగు తూండటం ఒక ప్రత్యేకత కాగా... కూటమి సమీకరణల్లోనూ మార్పులు వచ్చాయి. పోటీ బహుముఖంగానే కనిపిస్తోంది కానీ... తరచి చూస్తే ప్రధాన పోటీ బీజేపీ, ఎస్పీల కూటమి మధ్యే అన్నది అర్థమవుతుంది. నిర్బన్ ఇండియన్ సోషిత్ హమారా ఆమ్ దళ్ (నిషాద్), అప్నాదళ్ (సోనేలాల్)లతో బీజేపీ పొత్తు పెట్టుకోగా... ఆర్‌ఎల్‌డీ, ఎస్‌బీఎస్‌సీ, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (లోహియా)లతో కలిసి ఎస్పీ బరిలోకి దిగింది.
బీఎస్పీ కూడా చిన్న, చితక పార్టీలతో కలిసి పోటీ చేస్తూండగా, కాంగ్రెస్ మాత్రం ఒంటరి పోటీకి సిద్ధమైంది. ఓటింగ్ మొదలు కాకముందు నిర్వహిం చిన అనేక ఓపీనియన్ పోల్స్ బీజేపీ 225–267 సీట్లతో విజయం సాధిస్తుందని అంచనా కట్టాయి. ఎస్పీ 111–160 స్థానాలతో రెండో స్థానానికి పరిమితమవుతుందనీ, బీఎస్పీ, కాంగ్రెస్ మూడు, నాలుగు స్థానాల్లో నిలుస్తాయనీ లెక్కకట్టాయి. అయితే చరిత్రను ఒకసారి పరి శీలిస్తే ఉత్తరప్రదేశ్‌లో ఒపీనియన్ పోల్స్ అంచనాలు ఫలించిన సందర్భాలు తక్కువే. 2007, 2012లలో ఒపీనియన్ పోల్స్ హంగ్ అసెంబ్లీని అంచనా వేయగా బీఎస్పీ, ఎస్పీలు స్పష్టమైన విజయం సాధించాయి. గత ఎన్నికల్లో మాత్రం బీజేపీ విజయాన్ని ఒపీనియన్ పోల్స్ కరెక్టుగానే అంచనా వేశాయి. కానీ మోదీ వేవ్‌ను మాత్రం స్పష్టంగా చూడలేకపోయాయి. మూడు వందలకు పైగా సీట్లు సాధి స్తుందని ఎవరూ ఊహించలేకపోయారు.
కుల, మత, కూటమి రాజకీయాలు...
ఉత్తరప్రదేశ్‌లో ప్రతి రాజకీయ పార్టీ కూడా రాష్ట్రంలోని కుల, మత సమీకరణలు, భావసారూప్యత వంటి అంశాలను పరిగణనలోకి తీసు కునే కూటమి మిత్రులను ఎంచుకుంటాయి. యూపీ ఓటర్లలో 41% మంది ఓబీసీలు, 21% మంది దళితులు ఉండగా... ముస్లింలు, అగ్ర వర్ణాల వారు 19% చొప్పున ఉన్నారు. ప్రాంతీయ పార్టీలు బలో పేతం కాకమునుపు వరకూ ఉత్తరప్రదేశ్‌లో అగ్రవర్ణాలు, దళిత, ముస్లిం వర్గాల సాయంతో కాంగ్రెస్ పెత్తనమే చలాయించింది. బీఎస్సీ, ఎస్పీల రాకతో ఈ కుల సమీకరణకు గండి పడింది. సరికొత్త రాజకీయ సమీకరణలు మొదలయ్యాయి. దళితుల్లో అధికులు బీఎస్పీ వైపు వెళ్లిపోగా, జనాభాలో తొమ్మిది శాతమున్న యాదవులు ఎస్పీకి ప్రధాన ఓట్‌బ్యాంక్‌గా మారారు. ముస్లింలలో అధికశాతం మంది ఎన్నికల వాతావరణానికి అనుగుణంగా బీఎస్పీ, ఎస్పీలకు మద్ద తిచ్చారు.
గెలుపునకు కావాల్సిన సరైన కుల సమీకరణలు చేపట్టిన ప్రాంతీయ పార్టీలకు 2014 సాధారణ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. అగ్రవర్ణాలు, ఓబీసీల్లోని కొన్ని వర్గాలు, ఎస్సీలను కలుపుకొని బీజేపీ అత్యధిక శాతం లోక్‌సభ స్థానాలను గెలుచుకుంది. బీజేపీకి సంస్థా గతమైన బలం చేకూరడం, కులాల ఆధారంగా కూటములు ఏర్పాటు చేసుకోవడం, హిందుత్వ రాజకీయాలన్నీ కలిపి ఆ పార్టీకి 2017లో రికార్డు స్థాయిలో అసెంబ్లీ సీట్లు దక్కించాయి. రెండేళ్ల తరువాత జరి గిన సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీ ఆధిపత్యం కొనసాగింది. ఈసారి ఎన్నికల్లోనూ బీజేపీ అగ్రవర్ణాలు, యాదవులు, జాటేతర దళితులను మినహాయించి ఓబీసీల్లోని కొన్ని ఉపకులాలను తనవైపు తిప్పుకుంది. హిందుత్వ వాదనతో ఈ ఎన్నికలను గెలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ఎస్పీ కూడా యాదవుల పార్టీ అన్న ముద్రను తొలగించుకునేందుకు ఓబీసీల్లోని కొన్ని వర్గాలకు చెందిన పార్టీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. కాషాయ పార్టీ పాలనలో బ్రాహ్మణ వర్గం ఒంటరి అయ్యిందన్న వాదనను తన విజయావకాశాలను మెరుగుపరచు కునేందుకు ఉపయోగిస్తోంది. ఆర్‌ఎల్‌డీతో పొత్తుతో పశ్చిమ ఉత్తర ప్రదేశ్‌లో ఆధిపత్యం చలాయించే జాట్ల ఓట్లు తమకు దక్కుతాయని ఎస్పీ భావిస్తోంది. 2013 మతఘర్షణల తరువాత జాట్లు బీజేపీ వైపు మొగ్గిన విషయం తెలిసిందే. అయితే రైతు ఆందోళనల నేపథ్యంలో బీజేపీ–జాట్ల బంధం బలహీనమైందన్న వాదనలు ఉన్నాయి. రాజ ధాని ఢిల్లీకి సమీపంలోని 113 యూపీ అసెంబ్లీ స్థానాల్లో జాట్లు, ముస్లింలు తమ విజయానికి దోహద పడతారని ఎస్పీ భావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ రాజకీయాలకు ప్రియాంక గాంధీ వాద్రా నేతృత్వం వహిస్తున్నారు. నలభై శాతం సీట్లు మహిళా అభ్యర్థులకు కేటాయించి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
70 ఏళ్ల రికార్డు బద్దలవుతుందా?
ఈసారి ఉత్తరప్రదేశ్ ఓటర్లను ప్రభా వితం చేయగల అంశాల్లో పాలనకు సంబంధించినది ప్రధానమైంది కాగా... నేతృత్వం, ఎన్నికల మ్యాని ఫెస్టోలు తమ వంతు ప్రభావం చూపనున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగైందనీ, నేరాలు తగ్గాయనీ, మహిళలకు భద్రత లభిస్తోందనీ బీజేపీ ప్రచారం చేస్తోంది. మౌలిక సదుపాయాల వృద్ధి, సంక్షేమ కార్యక్రమాల తక్షణ అమలు, పెట్టుబడులు పెరగడం, కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టు పూర్తి కావడం తమకు విజయం తెచ్చి పెడతాయని బీజేపీ అంచనా. అయితే ఈ అంశాలతో ఏకీభవించని పార్టీలు దళితులు, మహిళలు, మైనారిటీలపై పెరుగుతున్న అత్యాచారాలను ఓటర్ల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. రెండో దశ కోవిడ్ నిర్వహణలో వైఫల్యం, నిరుద్యోగిత, ధరల పెరుగుదల, ఆర్థిక పరిస్థితులు, వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకత వంటివి ప్రతిపక్షాల ఆయుధాలుగా మారాయి.
ఉత్తరప్రదేశ్‌లో వరుసగా రెండుసార్లు గెలి చిన ముఖ్యమంత్రులు ఇప్పటివరకూ ఎవరూ లేరు. బీజేపీ సీఎం అభ్యర్థి యోగి ఆదిత్యనాథ్ ఈ రికార్డును బద్దలు కొట్టగలరా? చెప్ప లేము. ఎందుకంటే తమిళనాడు, కేరళల్లోనూ దశాబ్దాల పోకడలకు భిన్నమైన ఫలితాలు వచ్చాయి. కేంద్రంలో, రాష్ట్రంలోనూ బీజేపీ అధి కారంలో ఉండటం ఆ పార్టీకి కొంతవరకూ కలిసి రావచ్చు. బీజేపీ యేతల పార్టీలన్నింటినీ ఒక్క తాటిపైకి తీసుకురావడంలో ఎస్పీ తది తర పార్టీలు విఫలం కావడమూ కాషాయ పార్టీకి ప్రయోజనం చేకూర్చవచ్చు.
ఎస్పీ, కాంగ్రెస్ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు అనేందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. మొట్టమొదటగా చెప్పుకోవాల్సింది బీజేపీ కుల సమీకరణలు, హిందుత్వ అజెండాకు సెంట్రల్, తూర్పు ఉత్తర ప్రదేశ్‌లో ఆదరణ తగ్గకపోవడం. పశ్చిమ యూపీలోనూ జాట్ల కోపాన్ని తగ్గించేందుకు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో పాటు, ఇతర సమస్యలను ఇంటింటి ప్రచారం ద్వారా పరిష్కరించే ప్రయత్నం చేసింది. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా మోదీ ప్రభావం కొంత ఉండవచ్చు. పశ్చిమ యూపీలో ఎస్సీ తదితర పార్టీలు ఆశిస్తున్నట్లుగా జాట్– ముస్లిం ఓట్ల ఏకీకరణ ఎంతవరకూ జరుగుతుందన్నది ఇంకో ప్రశ్న. జాట్‌ల ప్రతినిధిగా నిలవాలని అను కుంటున్న ఆర్‌ఎల్‌డీ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాల్సి ఉంది.
మొత్తమ్మీద చూస్తే... ఈ సారి ఎన్నికల్లోనూ ఓటర్ల మద్దతు కాషాయ పార్టీ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్పీ గూండారాజ్‌ను అంతమొందించగలిగామన్న బీజేపీ వాదనకు ఓటర్లు జై కొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. యూపీ ఎన్నికలు బీజేపీ పాలనకు ఒక రిఫరెండమ్ అనుకుంటే రెండు రకాల ఫలితాలు వచ్చే సంభావ్యత ఉంది. ఎస్పీ–ఆర్‌ఎల్‌డీ కూటమి పశ్చిమ యూపీలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడమే నిజమైతే, బీజేపీ కూటమికి దక్కే సీట్ల సంఖ్య 250 కంటే దిగువకు చేరుతుంది. బీజేపీ ప్రభుత్వం చెప్పుకుంటున్న ‘ప్రగతి‘ని ఓటర్లు చూడగలిగి, ఎస్పీ– ఆర్‌ఎల్‌డీ కూటమి ఓటర్లను తమవైపు మళ్లించుకోవడంలో విఫలమైతే బీజేపీకి 250 కంటే ఎక్కువ సీట్లు కచ్చితంగా దక్కే అవకాశం ఉంది. అయితే యూపీ రాజకీయాలను కచ్చితంగా అంచనా వేయడం ఎప్పుడూ కత్తిమీద సామే. అందుకే ఈ సారి ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చినా రావచ్చు!
వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు,సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్, ఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment