ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో మొదటి విడత పోలింగ్ నేడు జరగనుంది. ఏడు విడతల ఎన్నికల్లో మొదట 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికల్లో రైతు ఉద్యమం ప్రభావం కీలకం కానుంది. ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం పశ్చిమ యూపీలోని అన్ని కులాల, మతాల రైతులను దగ్గర చేసింది. మొదట రైతులం, తర్వాతే ఇంకేదైనా అనేట్టుగా చేయగలిగింది. ఆర్థికంగా మెరుగవ్వడం అన్న ఒక్క ఆలోచన మీదే వారి ఐక్యత సాగుతోంది. మూడు సాగు చట్టాల రద్దు తర్వాత కూడా సంయుక్త కిసాన్ మోర్చా తన ఆందోళనను కొనసాగిస్తోంది. 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలన్నది వీరి డిమాండ్లలో ప్రధానమైనది. ఈ నేపథ్యంలో తాజా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా, ఎస్.పి–ఆర్.ఎల్.డి. పొత్తుకు అనుకూలంగా ఫలితాలు ఉండే అవకాశం ఉం
ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో రైతులు తమకు ఏ విధంగా ఓటు వేస్తారు? భారతీయ జనతాపార్టీని ప్రస్తుతం అమితంగా వ్యాకులతకు గురిచేస్తున్న అంతర్లోచన ఇది. సంకేతాలేమీ బాగోలేవు. తాజా బడ్జెట్ కూడా ఆ సంకేతాలను మెరుగుపరిచేదేమీ కాదు. రైతుల ఆగ్రహ జ్వాలలూ ఇప్పట్లో చల్లారేలా లేవు. దీర్ఘకాలంగా ఉన్న తమ డిమాండ్లను ఏ ఒక్కటీ నెరవేర్చకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందనే విషయాన్ని ఎత్తిచూపేందుకు గానూ ఇటీవల వారు ‘విశ్వాస ఘాతుక దినం’ కూడా పాటించారు. బహుశా బీజేపీ ఇప్పుడు ఈ రెండు రాష్టాల్లో మరీ ఎక్కువ సీట్లు కోల్పోకూడదన్నంత వరకే తన ఆశను పరిమితం చేసుకుని ఉండాలి.
రైతులు తీవ్ర నిరసనతో తిరస్కరించిన మూడు సాగు చట్టాలను రద్దు చేశాం కాబట్టి తమకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆ పార్టీ నమ్మవచ్చు. కానీ ఆ లెక్క తప్పేలా ఉంది. సాగు చట్టాల రద్దు నిర్ణయాన్ని మోదీ కానుకగా ముద్రవేయడానికి బీజేపీ ప్రయత్నిం చింది. అయితే ఇందులో మోదీ తమకు చేసిందేమీ లేదని రైతులు బలంగా విశ్వసిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడి దీర్ఘకాల పోరాటంతో, ప్రాణత్యాగాలతో సాధించుకున్న ‘ట్రోఫీ’గా మాత్రమే ఈ రద్దును రైతులు పరిగణిస్తున్నారు.
నలభైకి పైగా రైతు సంఘాల సమష్టి నాయకత్వంతో రైతుల ఉద్యమాన్ని నడిపించిన ‘సంయుక్త కిసాన్ మోర్చా’ (ఎస్కేయం) సాగు చట్టాల రద్దు తర్వాత కూడా నేటికింకా ఆందోళనను కొనసా గిస్తూనే ఉంది. 23 పంటలకు కనీస మద్దతు ధరను ప్రకటించాలన్నది ఎస్కేయం డిమాండ్‌లలో ప్రధానమైనది. ‘ఏ పార్టీకైనా ఓటు వెయ్యండి కానీ, బీజేపీకి మాత్రం వేయకం’డని అది ప్రజలను కోరుతోంది. ఈ ఎన్నికల్లో మోదీ విజయం సాధిస్తే కనుక రద్దు చేసిన సాగు చట్టాలను వేరే రూపంలో తిరిగి పునరుద్ధరిస్తారన్న భయం రైతులలో స్పష్టంగా కనిపిస్తోంది. మోదీని వారు కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైన వ్యక్తిగా మాత్రమే చూడగలుగుతున్నారు.
ఈ పరిస్థితి మోదీ, బీజేపీల స్వయంకృతమే. ఎండనక, వాననక, చలికి వణుకుతూ, కరోనా బారిన పడుతూ ఏడాది పాటు నిర్విరా మంగా రైతులు ఢిల్లీ శివారు వీధులలో సాగు చట్టాలకు నిరసనగా ఏకబిగిన ప్రదర్శనలు జరిపారు. వీధుల్లోనే వండుకున్నారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు వీధుల్లోనే పడకేశారు. ఈ మహోద్యమ కాలంలో 700 మంది వరకు అనారోగ్యంతో, వాతావరణ అననుకూలతతో కన్ను మూశారు. వాళ్లను ఆందోళన జీవులనీ, అలవాటుగా ఆందోళన చేస్తు న్నవారనీ, వాళ్లది ధిక్కార ప్రదర్శన కనుక ఏ విధంగానూ పట్టించు కోనవసరం లేదనీ మోదీ విమర్శించారు. ఆ చేదు అలా రైతుల గుండెల్లో ఉండిపోయింది. జనవరి 5న పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ పర్యటనలో భద్రత లోపాలను చూపి ప్రధాని అర్ధంతరంగా వెనుదిరిగి వెళ్లిపోవడం కూడా పాలకులకు, రైతులకు మధ్య సంబంధాలను మరింతగా క్షీణింపజేసింది.
గత అక్టోబరులో లఖింపూర్ ఖేరీ ప్రాంతంలోని టికూనియా వద్ద నిరసనకారులపైకి కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా తన వాహనాన్ని నడిపి నలుగురు రైతుల దుర్మరణానికి కారణం అవడం కూడా రైతుల ఆగ్రహానికి ఆజ్యం పోసింది. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వేర్వేరు వ్యూహాలను అనుసరిస్తోంది. యూపీలో తనకు మాత్రమే ప్రత్యేకమనుకున్న హిందుత్వను అస్త్రంగా చేసుకుంది. ఎనిమిదేళ్ల క్రితం జాట్‌లకూ, ముస్లింలకూ మధ్య జరిగిన హింసాత్మక ఘటనల్ని తవ్వి బయటికి తీస్తోంది. నాటి మత కలహాలలో 60 మందికి పైగా మరణించారు. వేల మంది నిరాశ్రయులయ్యారు. ఈ ఏడాది 29న హోంశాఖ మంత్రి అమిత్‌షా ముజఫర్‌నగర్‌లో జాట్‌లు ఉండే ప్రాంతాలలో ఇల్లిల్లూ తిరిగి... ‘ఆనాటి అల్లర్లను మీరు మర్చిపోయారా?’ అని జాట్ ఓటర్లను ప్రశ్నించి పాత గాయాలను గుర్తు చేశారు. దీనిని బట్టి ఓటర్లకు బీజేపీ ఏం చెప్పదలచుకుందో స్పష్టంగానే అర్థమౌతోంది. ‘మొదట మీరు హిందువులు. ఆ తర్వాతే రైతులు’ అని చెప్పడం ఆ పార్టీ ఉద్దేశం. ఆ మాటతో కొంతమంది జాట్‌ల పట్టును సాధించగలిగింది కానీ... ఉద్యమంలో ఉన్న జాట్ రైతులు మాత్రం... ‘మొదట మేము రైతులం. ఆ తర్వాతే జాట్‌లం’ అంటున్నారు.
రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్.ఎల్.డి.) అధ్యక్షుడు జయంత్ చౌధురి మాటల్లో కూడా ఇదే అర్థం ధ్వనించింది. ఆర్.ఎల్.డి. రైతు ఉద్యమా నికి సంఘీభావం ప్రకటించడంతో పశ్చిమ యూపీలోని జాట్‌లు జయంత్ చౌధురితో ఉన్నారు. ఆయన పార్టీకి సమాజ్‌వాది పార్టీతో పొత్తు ఉంది. ఆ పొత్తును రద్దు చేసుకుని తమతో చేయి కలపమని బీజేపీ కోరినప్పుడు జాట్‌లను తను జాట్‌లుగా కాక రైతులుగా మాత్రమే చూస్తున్నానని జయంత్ చౌధురి అన్నారు. ఢిల్లీలో జనవరి 26న అమిత్ షా కొంతమంది జాట్ నాయకులతో సమావేశ మైనప్పుడు బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జయంత్ చౌధురిని మా ఇంటికి రమ్మని ఆహ్వానించాం. కానీ ఆయన తగని ఇంటిని ఎంచుకున్నారు. అయితే ఆయన కోసం మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి’’ అని అన్నారు. చౌధురి అందుకు స్పందిస్తూ.. ‘‘నన్ను మీ ఇంటికి రమ్మని అడగటం కాదు... మీరు కూల్చేసిన 700 మందికి పైగా రైతుల కుటుంబాల వాళ్లను రమ్మని ఆహ్వానించండి’’ అని ట్వీట్ చేశారు.
పశ్చిమ యూపీలో బీజేపీపై అసంతృప్తి, ఆగ్రహం ఉన్న జాట్ కులస్థులు, ఇతర కులాల్లోని రైతులు చౌధురికి మద్దతుగా ఉన్నారు. ‘మొదట రైతులం, తర్వాతే హిందువులం’ అని ఇప్పుడు చెబుతున్న వీళ్లంతా 2014, 2017, 2019 ఎన్నికల్లో ‘మొదట హిందువులం, తర్వాతే రైతులం’ అని బీజేపీకి ఓటు వేసినవారే. కానీ 2022లో మత విశ్వాసాలకన్నా, ఆర్థిక అవసరాలే ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ కారణంతోనే ముస్లిం రైతులు కూడా రాష్ట్రీయ లోక్ దళ్‌కు మద్దతు ఇస్తున్నారు.
ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం పశ్చిమ యూపీలోని హిందూ, ముస్లిం రైతులను దగ్గర చేసింది. ముజఫర్‌నగర్‌లో ఇటీవల సంయుక్త కిసాన్ మోర్చా నిర్వహించిన మహాపంచాయత్‌కు రెండు మతాల రైతులూ హాజరయ్యారు. ‘హర హర మహాదేవ్’, ‘అల్లాహో అక్బర్’ అనే నినాదాలతో మతసామరస్యం మిన్నంటింది. రైతు ఉద్యమంలో హిందూ, ముస్లింలు కలిసికట్టుగా పాల్గొనడం 2013 నాటి గాయాల్ని మాన్పగలిగింది. ఇప్పుడు వాళ్ల ఆలోచన ఒక్కటే. ఆర్థికంగా మెరుగవ్వాలి. ఈ ఆలోచనే తాజా ఎన్నికల్లో బీజేపీకి ప్రతికూలంగా, ఎస్.పి–ఆర్.ఎల్.డి. పొత్తుకు అనుకూలంగా ఫలితా లను ఇవ్వబోతోంది. రైతుల ఆర్థిక ఇబ్బందులు హిందువుల మత విశ్వాసాలను కూడా రెండోస్థానంలోకి తీసుకెళ్లాయి. హిందువులు గోవును మాతగా పూజిస్తారని అంటూ యోగి ప్రభుత్వం గోవిక్రయా లను, గోవధను నిషేధించింది. అయితే రాష్ట్రంలోని రైతులు, వాళ్లలో హిందువులు అయినవాళ్లు కూడా పోషణ లేక ఆకలితో అలమటిస్తున్న ఆవులు, ఎద్దులు తమ పంటలను తినేస్తుండటంలో ప్రభుత్వ నిషేధ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.
రైతు ఉద్యమంలో భాగస్వాములైన రైతు సంఘాలలో కొన్ని రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఎన్నికల్లో తలపడుతుండటం వెనుక ఉన్నవి కేవలం రైతు ప్రయోజనాలే తప్ప వేరొకటి కాదు. పంజాబ్‌లో బీజేపీ ఎప్పటిలాగే ఎన్నికల్లో హిందూవాదాన్ని కాకుండా, జాతీయ వాదాన్ని ప్రయోగిస్తోంది. అయితే ఆ ప్రయత్నం ఫలించకపోవచ్చు. ఈసారి పంజాబ్ ఎన్నికలు రైతుల చుట్టూనే తిరుగుతాయి తప్ప జాతీయ భద్రత అనేది ఒక విషయమే కాదు. అందుకే బీజేపీతో తన రెండు దశాబ్దాల పొత్తును కూడా శిరోమణి అకాలీ దళ్ తెంపేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి ఉన్న మద్దతు తగ్గిపోవడమే అందుకు కారణం.
– అరుణ్ సిన్హా జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment