ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఊహించని రేంజ్‌లో వెలువడుతున్నాయి. కొన్ని చోట్ల జాతీయ పార్టీలకు చెందిన సీనియర్ నేతలకు ప్రాంతీయ పార్టీల అభ్యర్థులు ఊహించని షాకిచ్చారు. గెలుపు మాదంటే మాదే అని ధీమాగా ఉన్న కొన్ని పార్టీలకు ఓటర్లు భారీ ట్విస్ట్ ఇచ్చారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీ పార్టీ మరోసారి కాషాయ జెండా ఎగురవేసింది. ఎగ్జిట్ పోల్స్‌ను నిజం చేస్తూ బీజేపీకే యూపీ ఓటర్లు మరోసారి పట్టం కట్టారు. దీంతో యోగి ఆదిత్యనాథ్ రెండో సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. 2012 తరహాలో ఎలక్షన్ రిజల్ట్‌ను పునరావృతం చేయాలని భావించిన సమాజ్‌వాదీ పార్టీకి మరోసారి ఫలితాలు చేదు అనుభవాన్నే మిగిల్చాయి. అధికారంలోకి రావాలన్న ఆయన ఆశలు మరోసారి గల్లంతయ్యాయి. కానీ, 1996 తర్వాత 100 సీట్లు దాటిన ప్రతిపక్షంగా ఎస్పీ రికార్డు సాధించింది. యూపీలో గతంలో ప‍్రతిపక్షానికి 50 సీట్లు దాటిన దాఖలాలు లేవు.
బీజేపీ గెలుపునకు కారణాలు ఇవే..
1. రామ మందిర నిర్మాణం..
ఎన్నికల ప్రచారం ప్రారంభమైన రోజు నుంచే అధికార బీజేపీ రామమందిర నిర్మాణం అంశాన్ని హైలెట్ చేసింది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీలను ఇరుకున పెట్టేసింది. పక్కా ప్లాన్‌తో ముందుకు సాగింది.
2. ఎన్నికల ప్రచారంలోకి కీలక నేతలు..
యూపీలో కచ్చితంగా కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో బీజేపీ కీలక నేతలంతా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా కీలక నేతలు ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ వారణాసిలో పర్యటించడం బీజేపీకి ప్లస్ పాయింట్‌గా మారింది.
3. యోగి కాంట్రవర్సీ కామెంట్స్..
ఎన్నికల ప్రచారంలో సీఎం యోగి ఆదిత్యనాథ్.. బూల్డోజర్ల ప్రస్తావన తెచ్చారు. రాష్ట్రంలో నేరాలు చేస్తే సహించేది లేదంటూ.. నేరస్తులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని వారి కోసం బూల్డోజర్లు రెడీగా ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా పెను దుమారమే చెలరేగింది. కానీ, అదే చివరకు అధికార పార్టీకి ప్లస్ పాయింట్ అయినట్టుగా కనిపిస్తోంది. మరోవైపు లవ్ జిహాద్ కేసుల్లో పట్టుబడిన దోషులకు పదేళ్ల జైలు శిక్ష వంటి అంశాలు కూడా కలిసొచ్చాయి.
4. అట్రాక్ట్ చేసిన ఉచిత పథకాలు..
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ.. లోక్ కల్యాణ్ సంకల్ప్ పత్ర్-2022 పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. ఫ్రీ రేషన్, ఉచిత కరెంట్, మద్దతు ధర హామీలకు ఓటర్లలు ప్రభావితం అయ్యారు. 60 ఏళ్లు నిండిన మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, యువతకు భారీగా ఉద్యోగాల కాన్సెప్ట్ కూడా ఎన్నికలపై ఎఫెక్ట్ చూపించింది.
5. ఫలించిన గో సంరక్షణ మంత్రం..
యూపీలో గోవధపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో గోవులు పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తాము అధికారంలోకి వస్తే గోవుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్టు చేస్తున్నట్టు యోగి తెలిపారు. ఎక్కువ సంఖ్యలో గోశాలలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
అఖిలేష్ యాదవ్ ఓటమికి కారణాలు..
1. స్టార్ క్యాంపెయినర్లు కరువు..
ఎన్నికల ప్రచారంలో సమాజ్‌వాదీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లు కరువయ్యారు. ప్రచారంలో అఖిలేష్ యాదవ్‌తో పాటు కేవలం ఎస్పీకి చెందిన కొందరు నేతలు మాత్రమే పాల్గొన్నారు. ఎస్పీకి చెందిన జయా బచ్చన్, డింపుల్ చౌదరి స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో ఉన్నప్పటికీ వారు ప్రచారంలోకి రాలేకపోయారు. ఇది పార్టీకి పెద్ద నెగిటివ్‌గా మారింది.
2. ప్రభావం చూపని ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు
ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి ఉన్నావ్, హథ్రాస్, లఖింపూర్ ఖేరీ ఘటనలు బూస్ట్ ఇస్తాయని భావించారు. ఈ ఘటనలపై ప్రజా వ్యతిరేకత వస్తుందని భావించినప్పటికీ నిరాశే ఎదురైంది.
3. యాదవ-ముస్లిం పార్టీగా ఎస్పీపై ముద్ర..
యాదవ-ముస్లిం పార్టీగా సమాజ్‌వాదీ పార్టీపై ముద్రవేయడంలో అధికార బీజేపీ పూర్తిగా విజయవంతమైంది. బీజేపీ లాజిక్‌తో మిగతా వర్గాలు ఎస్పీకి దూరమయ్యాయి. ఈ విషయంలో కాంగ్రెస్, బీఎస్పీలు కూడా వైఫల్యం చెందడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ చీలిపోయాయి.
4. బీజేపీ వైపే జాట్, బ్రహ‍్మణ వర్గాలు..
యూపీలో గెలుపు, ఓటమిని డిసైడ్ చేసేది జాట్, బ్రహ‍్మణ వర్గాలే. అయితే, రైతు చట్టాల రద్దు సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా జాట్‌లు పోరాటం చేశారు. ఈ క్రమంలో జాట్‌లు రెండుగా చీలిపోయారు. ఓ వర్గం బీజేపీకి అనుకూలంగా మారడంతో ఓట్లు చీలిపోయాయి. చెరుకు పండించే జాట్ రైతులు, బ్రహ్మణులు పూర్తిగా బీజేపీ వైపు మొగ్గారు. దీంతో ఎస్పీకి ఓటు బ్యాంకు చీలిపోయింది.
5. ఫలించని మేనిఫెస్టో..
ఎన్నికల సందర్భంగా ఎస్పీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. మేనిఫెస్టోలో రైతులు, మహిళలకు వరాలు ప్రకటించినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఉచిత 2 గ్యాస్ సిలిండర్లు, బాలికలకు కేజీ టూ పీజ్‌ఉచిత విద్య, ప్రతి జిల్లాలో మోడల్ స్కూల్స్ నిర్మాణం, 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందిస్తామని ప్రకటించిన ఓటర్లు ప్రభావితం కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment