'Tribute To My Son': Umesh Pal's Mother Thanks CM Yogi On Encounter - Sakshi
Sakshi News home page

అసద్‌ ఎన్‌కౌంటర్‌.. ఇదే నిజమైన నివాళి అంటూ ఉమేశ్‌ పాల్‌ తల్లి కామెంట్స్‌

Published Thu, Apr 13 2023 4:02 PM | Last Updated on Thu, Apr 13 2023 4:45 PM

Umesh Pal Mother Shanthi Devi Thanks To CM Yogi On Encounter - Sakshi

లక్నో: బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభ మాజీ ఎంపీ, జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అతిఖ్‌ అహ్మద్‌ కొడుకు అసద్‌ను యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటన హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే, ఓ హత్య కేసు(ఉమేశ్‌ పాల్‌కు సంబంధించిన కేసు)లో నిందితుడిగా ఉన్న అసద్‌ను.. ఝాన్సీ వద్ద పోలీసులు కాల్చి చంపినట్లు తెలుస్తోంది. గురువారం అతిఖ్‌ను కోర్టులో ప్రవేశపెట్టే సమయంలోనే.. ఈ ఎన్‌కౌంటర్‌ జరగడం గమనార్హం.

ఇక, ఈ ఎన్‌కౌంటర్‌పై ఉమేశ్‌ పాల్‌ తల్లి శాంతి దేవి స్పందించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌.. నా కొడుకు మరణానికి ఇచ్చిన నిజమైన నివాళి అంటూ సంతోషం వ్యక్తం చేశారు. నాకు, మా కుటుంబానికి న్యాయం చేసినందకు సీఎం యోగికి జీకి ధన్యవాదాలు. మున్ముందు కూడా మాకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. సీఎం యోగిపై మాకు పూర్తి నమ్మకం ఉంది అంటూ వ్యాఖ్యలు చేశారు. తమ విధులను నిర్వర్తించిన ముఖ్యమంత్రికి, పోలీసు శాఖకు ధన్యవాదాలు అని అన్నారు. 

మరోవైపు.. ఈ ఎన్‌కౌంటర్‌పై సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌, మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ కూడా స్పందించారు. ఈ సందర్బంగా అఖిలేష్‌ మాట్లాడుతూ.. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వానికి కోర్టులపై నమ్మకం లేదని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటోందని విమర్శించారు. ఏది ఒప్పో, ఏది తప్పో నిర్ణయించే హక్కు వారికి లేదన్నారు. 

ఇదిలా ఉండగా, అంతకుముందు.. 2005లో జరిగిన బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్‌ హత్య కేసులో ఉమేశ్‌ పాల్‌ అనే లాయర్‌  ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అయితే.. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన ఉమేశ్‌ను ప్రయాగ్‌రాజ్‌లోని ఆయన ఇంటి వద్ద దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో అసద్‌తో పాటు గులాం అనే ఇద్దరు నిందితులుగా ఉన్నారు. ఈ క్రమంలో గురువారం వాళ్లను పట్టుకునే యత్నం చేసిన పోలీసులపై ఇద్దరూ కాల్పులు ప్రారంభించగా.. ప్రతిగా పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అసద్‌తో పాటు గులాం కూడా చనిపోయాడు. వీళ్లిద్దరిపై ఐదేసి లక్షల రూపాయల రివార్డు ఉంది. మరోవైపు.. బీఎస్‌పీ ఎమ్మెల్యే రాజ్‌పాల్‌ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్‌ పాల్‌ను 2006లో కిడ్నాప్‌ చేశాడనే కేసు అతిఖ్‌ అహ్మద్‌పైనా ఉంది. ఈ కేసులో సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అయిన అతిఖ్‌ అహ్మద్‌కు నెలలో శిక్ష కూడా పడింది. సుమారు వంద కేసుల్లో నిందితుడైన అతిఖ్‌ అహ్మద్‌.. యూపీ పోలీసులు ఎన్‌కౌంటర్‌పేరుతో తననూ చంపేందుకు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement