లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ ఓటమి చెందినప్పటికీ కమలం పార్టీకి కాస్త పోటీ ఇచ్చిందనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్ధానం నుంచి గెలుపొందగా, ఆ పార్టీ సీనియర్ నేత ఆజం ఖాన్ రాంపూర్ స్ధానం నుంచి గెలిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎస్పీ నేతలు అఖిలేష్ యాదవ్, ఆజంఖాన్ శాసన సభ్యలుగానే కాకుండా లోక్‌సభ సభ్యులుగానే ఉన్నారు. (చదవండి: ఆమె బీజేపీ ఏజెంట్.. మమ్మల్ని ఓడించారు )
అయితే తాజా సమాచారం ప్రకారం.. వీరిద్దరు శాసన సభ సభ్యత్వానికి రాజీనామా చేసి లోక్‌సభ సభ్యులుగానే కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరు వరుసగా ఆజంఘఢ్, రాంపూర్ లోక్‌సభ స్ధానాల నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్హాల్ అసెంబ్లీ స్థానంలో యాదవ్ 67,504 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆయనకు 1,48,196 ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి చెందిన కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్‌కు 80,692 ఓట్లు వచ్చాయి. కర్హల్ ఎస్పీకి కంచుకోటగా భావిస్తారు. పోలైన ఓట్లలో యాదవ్‌కు 60.12 శాతం ఓట్లు రాగా, బాఘేల్‌కు 32.74 శాతం ఓట్లు వచ్చాయి. యాదవ్ తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. సీఎంగా ఉన్న సమయంలో అఖిలేష్ యాదవ్ శాసనమండలి సభ్యుడిగా ఉన్నారు.
లోక్‌సభలో ఎస్పీకి ఐదుగురు సభ్యులుండగా సభలో తమ సంఖ్యాబలం మరింత బలహీనపడకుండా చూసుకోవాలని ఆ పార్టీ యోచిస్తోంది. దీంతో వీరిద్దరూ అసెంబ్లీ సభ్యత్వాలకు రాజీనామా చేసి లోక్‌సభ ఎంపీలుగా కొనసాగుతారని ఎస్పీ వర్గాలు వెల్లడించాయి. కాగా, మార్చి 21న లక్నోలోని పార్టీ కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల సమావేశానికి అఖిలేష్ యాదవ్ అధ్యక్షత వహించనున్నారు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ తర్వాత సమాజ్ వాదీ పార్టీ 111 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment