మీరట్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్‌ను పరామర్శించేందుకు వచ్చిన ప్రియాంకా గాంధీ
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించిన నేపథ్యంలో ఎస్పీ–బీఎస్పీ కూటమికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రియాంకా గాంధీ బుధవారం మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పరామర్శించారు. దీంతో బీఎస్పీకి పట్టుకొమ్మలుగా ఉన్న దళితుల ఓట్లను ఆకర్షించేందుకే ప్రియాంక ఆజాద్‌ను కలుసుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.
ఈ భేటీ అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ..‘ఆజాద్ ఓ లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఆయన పోరాటాన్ని నేను గౌరవిస్తున్నా. ఈ పరామర్శ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. ఆజాద్ తమ సమస్యలను వినాల్సిందిగా గొంతెత్తి అరుస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అహంకారంతో యువత గొంతు నొక్కేస్తోంది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించడం లేదు. వాళ్లు యువత సమస్యలను వినాలనుకోవడం లేదు’ అని తెలిపారు. మరోవైపు ఈ విషయమై ఆజాద్ స్పందిస్తూ..‘ప్రియాంక ఆసుపత్రికి వచ్చినట్లు మీడియా ద్వారానే నాకు తెలిసింది. నా ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు ఆమె ఆసుపత్రికి వచ్చారు. మామధ్య రాజకీయాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు’ అని స్పష్టం చేశారు.
ప్రతిపక్షాలన్నీ కలిస్తే బీజేపీని ఓడించవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ సందర్భంగా ‘ఆజాద్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారా?’ అన్న ప్రశ్నకు ప్రియాంక జవాబును దాటవేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించడంతో ఆజాద్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అస్వస్థతకు లోనుకావడంతో మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్‌ఎల్డీ 3 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాయ్‌బరేలి(సోనియాగాంధీ) అమేథీ(రాహుల్ గాంధీ) స్థానాల్లో మాత్రం పోటీచేయకూడదని నిర్ణయించాయి.
ప్రియాంక పోటీలో లేనట్టే!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ప్రియాంక గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదని పార్టీ వర్గాలు చెప్పాయి. గుజరాత్‌లో బుధవారం ఆమె చేసిన తన తొలి ప్రసంగానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ ప్రసంగం తర్వాత పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాయి. ఈ ఏడాది జవనరిలో ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక ఆమె లోక్‌సభకు పోటీ చేస్తారని భారీ ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయరనీ, ప్రచారానికి మాత్రమే వస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ప్రియాంక ఇప్పటికే పలుమార్లు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment