dalit votes
-
పాతికేళ్ల తరువాత ఓటు వేసిన దళితులు
-
దళిత ఓట్లకు ప్రియాంక గాలం
లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోబోమని బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతి ప్రకటించిన నేపథ్యంలో ఎస్పీ–బీఎస్పీ కూటమికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ప్రియాంకా గాంధీ బుధవారం మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను పరామర్శించారు. దీంతో బీఎస్పీకి పట్టుకొమ్మలుగా ఉన్న దళితుల ఓట్లను ఆకర్షించేందుకే ప్రియాంక ఆజాద్‌ను కలుసుకున్నారని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. ఈ భేటీ అనంతరం ప్రియాంక మీడియాతో మాట్లాడుతూ..‘ఆజాద్ ఓ లక్ష్యం కోసం పోరాడుతున్నారు. ఆయన పోరాటాన్ని నేను గౌరవిస్తున్నా. ఈ పరామర్శ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. ఆజాద్ తమ సమస్యలను వినాల్సిందిగా గొంతెత్తి అరుస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం అహంకారంతో యువత గొంతు నొక్కేస్తోంది. ఈ ప్రభుత్వం ఉద్యోగాలను కల్పించడం లేదు. వాళ్లు యువత సమస్యలను వినాలనుకోవడం లేదు’ అని తెలిపారు. మరోవైపు ఈ విషయమై ఆజాద్ స్పందిస్తూ..‘ప్రియాంక ఆసుపత్రికి వచ్చినట్లు మీడియా ద్వారానే నాకు తెలిసింది. నా ఆరోగ్యం గురించి వాకబు చేసేందుకు ఆమె ఆసుపత్రికి వచ్చారు. మామధ్య రాజకీయాలకు సంబంధించి ఎలాంటి చర్చ జరగలేదు’ అని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలన్నీ కలిస్తే బీజేపీని ఓడించవచ్చని అభిప్రాయపడ్డారు. కాగా, ఈ సందర్భంగా ‘ఆజాద్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తారా?’ అన్న ప్రశ్నకు ప్రియాంక జవాబును దాటవేశారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో వాహనాలతో ర్యాలీ నిర్వహించడంతో ఆజాద్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అస్వస్థతకు లోనుకావడంతో మీరట్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు గానూ ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాయ్‌బరేలి(సోనియాగాంధీ) అమేథీ(రాహుల్ గాంధీ) స్థానాల్లో మాత్రం పోటీచేయకూడదని నిర్ణయించాయి. ప్రియాంక పోటీలో లేనట్టే! సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియమితులైన ప్రియాంక గాంధీ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదని పార్టీ వర్గాలు చెప్పాయి. గుజరాత్లో బుధవారం ఆమె చేసిన తన తొలి ప్రసంగానికి మంచి మార్కులు పడ్డాయి. ఆ ప్రసంగం తర్వాత పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా, సంతోషంగా ఉన్నాయి. ఈ ఏడాది జవనరిలో ప్రియాంక క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చాక ఆమె లోక్‌సభకు పోటీ చేస్తారని భారీ ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ప్రియాంక పోటీ చేయరనీ, ప్రచారానికి మాత్రమే వస్తారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ప్రియాంక ఇప్పటికే పలుమార్లు పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. -
దళిత, ఓబీసీలపైనే బీజేపీ ఆశలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాలన్నీ ఏకమవుతున్న నేపథ్యంలో బీజేపీ కూడా రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇందులో భాగంగానే.. దళిత, ఓబీసీ ఓటు బ్యాంకుతోపాటు హిందుత్వ అజెండాపై దృష్టిపెట్టింది. దళితులతోపాటు వెనుకబడిన వర్గాలకు మద్దతుగా నిలిచేందుకు బిల్లులను తీసుకొస్తున్న బీజేపీ.. వలసదారులను అడ్డుకోవడంలో చిత్తశుద్ధి తమకే ఉందంటూ హిందుత్వ ఓటర్లను ఆకర్షించనుంది. ఇదే ఈశాన్యరాష్ట్రాలు, హిందీ రాష్ట్రాల్లో బీజేపీకి ఎక్కువ ఓట్లు సంపాదించిపెడుతుందని భావిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఈ విషయంలో విపక్షాలను ఇరుకున పెట్టేలా అస్సాం ఎన్నార్సీని ‘జాతీయ భద్రత’తో ముడిపెడుతున్నారు. దళిత, ఓబీసీలకు బలమిచ్చే బిల్లులను తీసుకురానుంది. దళితులపై సుప్రీం ఇచ్చిన తీర్పును విభేదిస్తూ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న బిల్లు మళ్లీ ఆ వర్గంలో బీజేపీపై సానుకూలతను కలగజేస్తుందని పార్టీ భావిస్తోంది. ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా ఇవ్వడం ద్వారా దళితులు, గిరిజనులతో సమానంగా ఈ కమిషన్ కు అధికారాలు కల్పించింది. ఈ నిర్ణయం ఓబీసీల పట్ల తమ పార్టీ చిత్తశుద్ధిని నిరూపిస్తుందని పార్టీ నేతలంటున్నారు. -
అంబేడ్కర్ ఓ ఐకాన్ మాత్రమే..!
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ రాజకీయాల్లో నేడు డాక్టర్ అంబేడ్కర్ అత్యంత ప్రజాదరణ కలిగిన చారిత్రక పురుషుడు. ప్రతి పార్టీ ఎన్నికల సందర్భంగానో, జయంతి, వర్ధంతుల సందర్భంగానో ఆయన ఉపన్యాసాల గురించి, భావాల గురించి మాట్లాడుతుంది. ‘సమాజంలో ఓ వెనకబడిన వర్గం నుంచి వచ్చిన నేను ఈ రోజున ప్రధాన మంత్రి అయ్యానంటే అందుకు కారణం అంబేడ్కర్’ ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎన్నికలు సమీపించినా ఆయన అంబేడ్కర్ పేరును తలవకుండా ఉండలేరు. ఆయన దేశంలో డిజిటల్ లావాదేవీల కోసం ‘భీమ్’ యాప్‌ను తీసుకొచ్చారు. భీమ్ అంటే మనలో ఎక్కువ మందికి దళితుల నినాదం ‘జైభీమ్’లోని అంబేడ్కర్ మనకు స్ఫురించరు. మహాభారతంలోని భీముడు మనకు స్ఫురిస్తారు. అది వేరే విషయం అనుకోండి! 1980వ దశకం వరకు కాంగ్రెస్ పార్టీ సహా ప్రధాన స్రవంతిలోని ఏ రాజకీయ పార్టీ అంబేడ్కర్ పేరును తలవలేదు. ఎన్నికల సందర్భంగా కూడా ప్రస్తావించలేదు. బీజేపీ మొదటి నుంచి ఆయనకు మరీ దూరంగా ఉంటూ వచ్చింది. పదవుల్లో ఉన్న రాజకీయ నాయకులు మాత్రం జయంతి, వర్ధంతులకు పూలదండలు వేసి మొక్కుబడికి నివాళులర్పించేవారు. 1990 దశకం వరకు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ అంబేడ్కర్‌ను పట్టించుకోలేదని మేధావి, విద్యావంతుడు కంచ ఐలయ్య పేర్కొన్నారు. 1978లో ‘ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ అండ్ మైనారిటీస్ కమ్యూనిటీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్’ ఏర్పాటుతో మరోసారి అంబేడ్కర్ ప్రజల దృష్టికి వచ్చారు. ఈ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేసిన వ్యవస్థాప నాయకుల్లో ఒకరైన కాన్షీరామ్ 1984లో బహుజన్ సమాజ్ పార్టీని ఏర్పాటు చేయడంతో అంబేడ్కర్ పేరు మరింత ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాన్షీరామ్ శిష్యురాలు మాయావతి హయాంలో అంబేడ్కర్ పేరు మారుమోగిపోయింది. దళితుల ఓట్ల కోసం కొన్ని రాజకీయ పార్టీలు అంబేడ్కర్‌ను ఎత్తుకోవడంతో ఆయన దళితులకు ఓ ఐకాన్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలోనే మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసిన వీపీ సింగ్ ప్రభుత్వం 1990లో అంబేడ్కర్‌కు దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ను ప్రకటించింది. జాతిపిత మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలకు అంబేడ్కర్ అంటే అసలు పడేది కాదు కనుక స్వాతంత్య్ర రాజకీయాల్లో ఆయన వివాదాస్పద నాయకుడిగానే చెలామణి అయ్యారు. గాంధీజీని తాను కనీసం వ్యక్తిగత నైతిక ప్రమాణాల ప్రాతిపదికగా కూడా మహాత్ముడిగా గుర్తించనని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబేడ్కర్ వ్యాఖ్యానించడం పట్ల నాడు గాంధీతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు నొచ్చుకున్నారు. బ్రిటీష్ ఇండియాలో ఎన్నికలు రెండు రకాలుగా ఉండాలని, దళితులకు ప్రత్యేక ఓటింగ్ విధానం ఉండాలని, వారు దళితులను మాత్రమే తమ ప్రతినిధులుగా ఎన్నుకుంటారంటూ అంబేడ్కర్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చారు. దాన్ని విరమించుకోకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని గాంధీజీ బెదిరించడంతో ఆ ప్రతిపాదనను ఆయన ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. 1956లో అంబేడ్కర్ మరణించినప్పుడు జవహరలాల్ నెహ్రూ తన సంతాప సందేశంలో ‘వెరీ కాంట్రవర్శియల్ ఫిగర్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ (భారత రాజకీయాల్లో అత్యంత వివాదాస్పద నాయకుడు)’ అని వ్యాఖ్యానించారు. ఇక ఆయన ఆత్మకథను రాసిన ధనుంజయ్ కీర్ ‘మోస్ట్ హేటెడ్ మేన్ ఇన్ ఇండియా (భారత్‌లో ఎంతో వ్యతిరేకత కలిగిన నాయకుడు)’గా వర్ణించారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలతో విసిగిపోయిన అంబేడ్కర్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్, ఇండిపెండెంట్ లేబర్ పార్టీలను ఏర్పాటు చేసినా ఆయనకు ఓట్లు రాలలేదు. నేడు దళితుల ఓట్ల కోసం మాత్రం ప్రతి పార్టీ ఆయన పేరును నమ్ముకుంటోంది. అయినప్పటికీ అంబేడ్కర్కుగానీ, ఆయన రచనలకుగానీ నిజమైన గుర్తింపు రావడం లేదు. ఆయన్ని ఓట్లు కురిపించే ఓ ‘ఐకాన్’గానే చూస్తున్నారు. -
దళిత ఓట్లకు గాలం
దేశవ్యాప్తంగా మోడీ హవా వీచినా, పార్లమెంటు ఎన్నికల్లో ఆప్ ఓట్లశాతం 29.4 శాతం నుంచి 32.9 శాతానికి పెరగడంతో అప్రమత్తమైన ఢిల్లీ బీజేపీ దళిత ఓట్లపై కన్నేసింది. దళితుల ప్రాబల్యం ఉన్న బూత్‌లలో ప్రత్యేక వ్యూహాలు అమలు చేసి పట్టును పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా 100 ఓట్ల తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు/ఓటమి పాలైన బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తేదీలపై స్పష్టత రాకున్నా, బీజేపీ మాత్రం ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ విజయానికి దళితుల సహకారం అవసరమని భావిస్తోంది. ఇది వరకు కాంగ్రెస్, బీఎస్పీ వైపు ఉన్న దళితుల్లో కొందరు ప్రస్తుతం ఆప్‌వైపు మొగ్గుచూపినట్టు వార్తలు వచ్చాయి. వీరిని తమ వైపునకు మళ్లించడంపై ఢిల్లీ బీజేపీ దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు బీజేపీ దళిత ఓట్లపై శ్రద్ధ చూపలేదని, వీళ్లను తమ వైపునకు తిప్పుకుంటే పార్టీ ఓట్లవాటా 13 శాతం అదనంగా పెరుగుతుందని భావిస్తున్నామని సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో మురికివాడలు, అనధికార కాలనీల్లోని ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆప్ విజయం సాధించింది. 2008 వరకు దళిత ఓటు బ్యాంకు కాంగ్రెస్, బీఎస్పీకే పరిమితమయింది’ అని ఆయన అన్నారు. దళితుల ప్రాబల్యం ఉన్న బూత్‌లలో ప్రత్యేక వ్యూహాలు అమలు చేసి పట్టును పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా 100 ఓట్ల తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు/ఓటమి పాలైన బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. దాదాపు 3,088 బూత్‌లలో స్వల్ప మెజారిటీ కారణంగా గెలుపుఓటములు మారినట్టు గుర్తించింది. ‘మా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి స్థానికులను ఓటర్లుగా చేర్పించారు. మాకు మెజారిటీ రాని 1,600 బూత్‌ల పరిధిలోని దళితులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో మాకు ఓట్లశాతం పెరిగింది’ అని మరో సీనియర్ నాయకుడు అన్నారు.ముస్లిం, దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులకు ఓట్లశాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ముస్లిం ఓట్లు ఆప్, కాంగ్రెస్ మధ్య చీలినా, దళితుల ఓట్లను రాబట్టుకోవడంలో ఆప్ విజయం సాధించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంలో తామే ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందని దళితులకు వివరిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ మేరకు రాబోయే రెండు మూడు నెలల్లో మురికివాడలు, అనధికార కాలనీల్లో భారీగా ప్రచారం నిర్వహిస్తామని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ కౌల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ ఓట్లశాతం 29.4 శాతం నుంచి 32.9 శాతానికి పెరగడంతో అప్రమత్తమైన బీజేపీ దళిత ఓట్లపై కన్నేసింది.దేశవ్యాప్తంగా మోడీ హవాకుతోడు 49 రోజుల తరువాత రాజీనామాపై విమర్శలు వ్యక్తమైనా, ఆప్ ఓట్లశాతం పెంచుకోవడంపై బీజేపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కేజ్రీవాల్ హఠాత్తుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మధ్యతరగతి వర్గం ఆప్‌పై కోపం పెంచుకుందని, వాళ్లంతా తమ వైపు తిరిగారని బీజేపీ అంటోంది. అయినప్పటికీ ఆప్‌కు ఓట్ల శాతం పెరిగిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున ఎంపీలుగా ఎన్నికైన డాక్టర్ హర్షవర్ధన్, మీనాక్షి లేఖికి నరేంద్ర కేబినెట్లో చోటు దక్కినట్టు శుక్రవారం వార్తలు వచ్చాయి. హర్షవర్ధన్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ, లేఖికి సాంస్కృతిక శాఖ దక్కినట్టు సమాచారం. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్షవర్ధన్ చాందినీచౌక్ నుంచి, మీనాక్షి లేఖి న్యూఢిల్లీ స్థానం నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే.