దళిత ఓట్లకు గాలం
దేశవ్యాప్తంగా మోడీ హవా వీచినా, పార్లమెంటు ఎన్నికల్లో ఆప్ ఓట్లశాతం 29.4 శాతం నుంచి 32.9 శాతానికి పెరగడంతో అప్రమత్తమైన ఢిల్లీ బీజేపీ దళిత ఓట్లపై కన్నేసింది. దళితుల ప్రాబల్యం ఉన్న బూత్‌లలో ప్రత్యేక వ్యూహాలు అమలు చేసి పట్టును పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా 100 ఓట్ల తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు/ఓటమి పాలైన బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది.
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తేదీలపై స్పష్టత రాకున్నా, బీజేపీ మాత్రం ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన ఈ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ భారీ విజయానికి దళితుల సహకారం అవసరమని భావిస్తోంది. ఇది వరకు కాంగ్రెస్, బీఎస్పీ వైపు ఉన్న దళితుల్లో కొందరు ప్రస్తుతం ఆప్‌వైపు మొగ్గుచూపినట్టు వార్తలు వచ్చాయి. వీరిని తమ వైపునకు మళ్లించడంపై ఢిల్లీ బీజేపీ దృష్టి పెట్టింది. ఇప్పటి వరకు బీజేపీ దళిత ఓట్లపై శ్రద్ధ చూపలేదని, వీళ్లను తమ వైపునకు తిప్పుకుంటే పార్టీ ఓట్లవాటా 13 శాతం అదనంగా పెరుగుతుందని భావిస్తున్నామని సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.
‘అసెంబ్లీ ఎన్నికల్లో మురికివాడలు, అనధికార కాలనీల్లోని ఓటర్లను ఆకట్టుకోవడంలో ఆప్ విజయం సాధించింది. 2008 వరకు దళిత ఓటు బ్యాంకు కాంగ్రెస్, బీఎస్పీకే పరిమితమయింది’ అని ఆయన అన్నారు. దళితుల ప్రాబల్యం ఉన్న బూత్‌లలో ప్రత్యేక వ్యూహాలు అమలు చేసి పట్టును పెంచుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా 100 ఓట్ల తేడాతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు/ఓటమి పాలైన బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. దాదాపు 3,088 బూత్‌లలో స్వల్ప మెజారిటీ కారణంగా గెలుపుఓటములు మారినట్టు గుర్తించింది. ‘మా కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసి స్థానికులను ఓటర్లుగా చేర్పించారు.
మాకు మెజారిటీ రాని 1,600 బూత్‌ల పరిధిలోని దళితులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో మాకు ఓట్లశాతం పెరిగింది’ అని మరో సీనియర్ నాయకుడు అన్నారు.ముస్లిం, దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులకు ఓట్లశాతం తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. ముస్లిం ఓట్లు ఆప్, కాంగ్రెస్ మధ్య చీలినా, దళితుల ఓట్లను రాబట్టుకోవడంలో ఆప్ విజయం సాధించింది. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వంలో తామే ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందని దళితులకు వివరిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఈ మేరకు రాబోయే రెండు మూడు నెలల్లో మురికివాడలు, అనధికార కాలనీల్లో భారీగా ప్రచారం నిర్వహిస్తామని ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి సంజయ్ కౌల్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఆప్ ఓట్లశాతం 29.4 శాతం నుంచి 32.9 శాతానికి పెరగడంతో అప్రమత్తమైన బీజేపీ దళిత ఓట్లపై కన్నేసింది.దేశవ్యాప్తంగా మోడీ హవాకుతోడు 49 రోజుల తరువాత రాజీనామాపై విమర్శలు వ్యక్తమైనా, ఆప్ ఓట్లశాతం పెంచుకోవడంపై బీజేపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే కేజ్రీవాల్ హఠాత్తుగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మధ్యతరగతి వర్గం ఆప్‌పై కోపం పెంచుకుందని, వాళ్లంతా తమ వైపు తిరిగారని బీజేపీ అంటోంది.
అయినప్పటికీ ఆప్‌కు ఓట్ల శాతం పెరిగిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు. ఇదిలా ఉంటే తాజాగా నిర్వహించిన పార్లమెంటు ఎన్నికల్లో ఢిల్లీ నుంచి బీజేపీ తరఫున ఎంపీలుగా ఎన్నికైన డాక్టర్ హర్షవర్ధన్, మీనాక్షి లేఖికి నరేంద్ర కేబినెట్‌లో చోటు దక్కినట్టు శుక్రవారం వార్తలు వచ్చాయి. హర్షవర్ధన్‌కు కేంద్ర ఆరోగ్యశాఖ, లేఖికి సాంస్కృతిక శాఖ దక్కినట్టు సమాచారం. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు హర్షవర్ధన్ చాందినీచౌక్ నుంచి, మీనాక్షి లేఖి న్యూఢిల్లీ స్థానం నుంచి గెలుపొందిన సంగతి తెలిసిందే.