ప్రధాని మోదీని ప్రశ్నించిన ఆప్
సీఎం ఇంటి బయట ధర్నా చేయడంపై ఆగ్రహం
న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి బయట బీజేపీ కార్యకర్తలు ధర్నా చేయడంపై ఆప్ మండిపడింది. నక్సలైట్ల వంటి నిరసనలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తారా అని గురువారం ఎద్దేవా చేసింది. ఢిల్లీ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని మరోసారి డిమాండ్ చేసింది. గతంలో ఆప్ నిరసన తెలిపినందుకు ప్రధాని మోదీ తమను అరాచకులు, నక్సలైట్లు అని వ్యాఖ్యానించిన విషయాన్ని ఆప్ నేత కుమార్ బిశ్వాస్ గుర్తుచేశారు. మరి సతీశ్ ఉపాధ్యాయ, బీజేపీ కార్యకర్తలు చేసిన ఈ నిరసనలను ఆయన ఏమంటారో చూడాలి అని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎవరు నక్సలైట్లో చెప్పాలని ప్రశ్నించారు.
సతీశ్ ఉపాధ్యాయ నిరసన వెనక ఉన్న ఉద్దేశం ఏంటో అర్థం కావడంలేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఢిల్లీలో శాంతి భద్రతల వైఫల్యం ఉంటే.. వెళ్లి కేంద్రంతో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి పోలీసులను తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. కాగా, తుర్క్‌మాన్ వద్ద జరిగిన సంఘటనలో ఆప్ కార్యకర్తలు నిందితులని, వారు పర్యావరణ మంత్రికి, మటియా మహల్ ఎమ్మెల్యేకు సన్నిహితులని అందుకే వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. అలాగే వారిని పదవి నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఇప్పుడు ఎవరు నక్సలైట్లు?
Published Thu, Apr 9 2015 10:59 PM | Last Updated on Fri, Mar 29 2019 9:12 PM
Advertisement