CM aravind kejriwal
-
స్టేడియంలో అధికారి కుక్క వాకింగ్ కోసం.. విమర్శలు
ఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్‌పై.. సోషల్‌మీడియాలో తాజాగా కొందరు తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ అధికారి తన కుక్కతో వాకింగ్ చేసేందుకు వీలుగా స్టేడియం వేళల్ని సవరించినందుకు మండిపడుతున్నారు. ఢిల్లీలో స్టేడియాల వేళల్ని పొడిగించింది కేజ్రీవాల్ సర్కార్. రాత్రి పది గంటలకు వరకు అథ్లెట్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ఈ ఆదేశాల జారీ వెనుక ఉన్న వ్యవహారమే విమర్శలకు దారి తీస్తోంది. ఢిల్లీ త్యాగరాజ స్టేడియంలో ఓ ఐఏఎస్ అధికారి పెంపుడు కుక్కతో నిత్యం వాకింగ్‌కు వస్తున్నాడు. ఈ తరుణంలో ఆయన కోసం స్టేడియం నిర్వాహకులు.. అథ్లెట్లకు ప్రాక్టీస్ చేసుకునే సమయం తగ్గించారు. త్వరగా వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. దీంతో విమర్శలు వెల్లువెత్తగా.. రాత్రి పది గంటల వరకు స్టేడియాలను తెరిచి ఉంచాలని తాజాగా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. Delhi CM Arvind Kejriwal has directed that all Delhi Govt sports facilities will stay open for sportspersons till 10pm (File pic) pic.twitter.com/a7d0IyodXH — ANI (@ANI) May 26, 2022 ఢిల్లీ రెవెన్యూ సెక్రెటరీ సంజీవ్ ఖీర్వార్ తన పెంపుడు కుక్కతో ఈ స్టేడియంలోనే వాకింగ్ చేస్తున్నారు. ఈయన కోసమే అథ్లెట్లను బయటకు పంపించి వేస్తున్నారంటూ.. ఫొటో ఆధారాలతో సహా విమర్శిస్తున్నారు కొందరు. అయితే స్టేడియం నిర్వాహకుడు అనిల్ చౌదరి మాత్రం విమర్శలను ఖండిస్తున్నారు. స్టేడియం అధికారిక టైమింగ్ రాత్రి ఏడువరకే. ఆ తర్వాత ఎవరినీ ఎవరూ బయటకు వెళ్లిపోమనట్లేదు. స్వచ్చందంగా అథ్లెట్లు వెళ్లిపోతున్నారంటూ చెప్పారు. మరి సంజీవ్ ఈ స్టేడియాన్ని ఉపయోగించుకుంటున్నారా? అనే ప్రశ్నకు మాత్రం ఆయన బదులివ్వలేదు. Delhi Staduim Dog Walk Row ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో .. ఇప్పుడు స్టేడియం వేళల్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు కేజ్రీవాల్. -
ఢిల్లీలో పోలింగ్ 61%
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య శనివారం ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రానికి 61.46% పోలింగ్ నమోదైంది. ఢిల్లీలోని 11 జిల్లాలకు గాను ఈశాన్య ఢిల్లీలో అత్యధికంగా 65.24% పోలింగ్ నమోదు కాగా, న్యూఢిల్లీలో 56.10%, ఆగ్నేయ ఢిల్లీలో అత్యల్పంగా 54.89% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు అధికారులు ప్రకటించారు. సీఎం కేజ్రీవాల్ బరిలో ఉన్న న్యూఢిల్లీ నియోజకవర్గంలో 42% మంది ఓటేశారు. కొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లు బారులు తీరి ఉన్నందున పోలింగ్ శాతం పెరిగే చాన్సుందని అధికారులు తెలిపారు. గత 2015 అసెంబ్లీ ఎన్నికల్లో 67.47% పోలింగ్ నమోదు కాగా, గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలో 60.60% పోలింగ్ నమోదైంది. పెట్రోలింగ్, క్విక్ రెస్పాన్స్ టీములు కలిపి 60వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాలకు ఈ నెల 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఓటేసిన రాష్ట్రపతి కోవింద్ దంపతులు పోలింగ్ సరళి ఇలా.. పోలింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభం కాగా మొదటి మూడు గంటల్లో కేవలం 14.5% మాత్రమే పోలింగ్ జరిగింది. ఆ తర్వాత కొద్దిగా పుంజుకుని, మధ్యాహ్నం 3 గంటలకు 41.5%కు చేరుకుంది. పోలింగ్ ముగిసే 6 గంటల సమయానికి ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ముస్తాఫాబాద్‌లో 66.29%, మతియామహల్ 65.62%, సీలాంపూర్‌లో 64.92% పోలింగ్ నమోదైంది. షహీన్బాగ్లాంటి కొన్ని చోట్ల ఓటర్ల క్యూలు కొనసాగుతున్నందున పోలింగ్ శాతం పెరిగే అవకాశాలున్నాయని ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ అధికారి రణ్‌బీర్ సింగ్ తెలిపారు. వీవీప్యాట్ స్లిప్పులో తన ఫొటో, పేరు కనిపించలేదంటూ న్యూఢిల్లీ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ సభర్వాల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కొద్దిసేపు పోలింగ్‌కు అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే ఆ వీవీప్యాట్ మిషన్ స్థానంలో మరొకటి ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో వీవీప్యాట్ వైఫల్యం కేవలం ఒక్క శాతమేనని సీఈవో తెలిపారు. శతాధిక వృద్ధులు 60 మందికిపైగా ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు. ఓటేసిన ప్రముఖులు రాష్ట్రపతి కోవింద్, మాజీ ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్ సింగ్ తదితరులు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజ్పూర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ పోలింగ్ కేంద్రంలో తల్లిదండ్రులతోపాటు భార్య సునీత, కొడుకు పుల్కిత్తో కలిసి వచ్చి ఓటు వేశారు. ముందుగా ఆయన తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రియాంకా గాంధీ కొడుకు రెహాన్, కేజ్రీవాల్ కొడుకు పుల్కిత్ మొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ఉన్నారు. కేజ్రీవాల్ మళ్లీ సీఎం అవుతారని భావిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా ప్రజలు ఎవరికి ఓటేస్తే వారే ఢిల్లీ సీఎం అవుతారని పుల్కిత్ బదులిచ్చాడు. పోలింగ్ కేంద్రం వద్ద సోనియా, ప్రియాంక కేజ్రీవాల్, స్మృతి ఇరానీ ట్విట్టర్ వార్ ఓటు ఎవరికి వేయాలనే విషయంలో మగవారిని సంప్రదించాలంటూ ఢిల్లీ మహిళలకు ఆప్ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇచ్చిన పిలుపుపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘మీరంతా తప్పకుండా ఓట్లేయండి. ముఖ్యంగా మహిళలకు ఓ విన్నపం. కుటుంబంతోపాటు దేశం, ఢిల్లీ గురించి ఆలోచించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఎవరికి ఓటు వేయాలనే విషయంలో మీ ఇంట్లో మగవారితోనూ చర్చించండి’ అంటూ పోలింగ్‌కు ముందు కేజ్రీవాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ..ఎవరికి ఓట్లేయాలో తెలియని స్థితిలో మహిళలున్నట్లు కేజ్రీవాల్ భావిస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు కేజ్రీవాల్ బదులిస్తూ..ఇంటి బాధ్యతలు మోసే ఢిల్లీ మహిళలు తమ కుటుంబం ఎవరికి ఓటేయాలో కూడా ఈసారి నిర్ణయించారని వ్యాఖ్యానించారు. షహీన్‌బాగ్‌లో ఆగని నిరసనలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశ రాజధాని షహీన్‌బాగ్‌లో పోలింగ్ రోజూ నిరసనలు ఆగలేదు. నిరసనలు కొనసాగేందుకు వీలుగా అందులోని మహిళలు కొందరు మధ్యాహ్నం, కొందరు సాయంత్రం పోలింగ్ బూత్‌లకు వెళ్లి ఓటేశారు. ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైన పోలింగ్ ప్రక్రియలో తామూ భాగస్వాములయ్యామని నిరసనల్లో పాల్గొంటున్న జెహ్రా షేక్ తెలిపారు. బిర్యానీ కోసమే నిరసనల్లో పాల్గొంటున్నట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు తప్పని రుజువు చేసేందుకు ఓట్లు వేశామని మొహమ్మద్ అయూబ్ అన్నారు. ఏ పార్టీ వారు కూడా తమకు బిర్యానీ సరఫరా చేయడం లేదన్నారు. షహీన్‌బాగ్‌లో నిరసనకారులకు ఢిల్లీ సీఎం బిర్యానీ అందజేస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు యూపీ సీఎం యోగికి ఈసీ నోటీసులు పంపింది. సిరా గుర్తుతో ఎంపీ గౌతం గంభీర్ దంపతులు. 9నెలల పాపతో క్లాసికల్ డ్యాన్సర్ అరణ్యని ఓటేసిన 111ఏళ్ల కలితార మండల్ -
కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి కేసులో పోలీసులు మంగళవారం కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 25న న్యాయస్ధానం ఎదుట హాజరుకావాలని పటియాలా హౌస్ కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కోరింది. అన్షు ప్రకాష్‌పై దాడికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలు బాధ్యులని పోలీసులు చార్జిషీట్లో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విధులను అడ్డుకోవడం, గాయపరచడం, బెదిరింపులకు గురిచేయడం వంటి కుట్రకు సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు కుట్రపూరితంగా వ్యవహరించారని 3000 పేజీల చార్జిషీట్లో పోలీసులు ఆరోపించారు. వీరు చట్టవిరుద్ధంగా గుమికూడటం,ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అవమానించారని చార్జిషీట్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు తనపై దాడికి తెగబడ్డారని అన్షు ప్రకాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసుల చార్జిషీట్లో పేర్కొన్న ఆరోపణలను చవకబారు ఆరోపణలని ఆప్ ప్రభుత్వం తోసిపుచ్చింది. మోదీ ప్రభుత్వం ఎంత నైరాశ్యంలో ఉందో ఇది వెల్లడిస్తోందని వ్యాఖ్యానించింది. -
ఫస్ట్ టైం.. ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా ప్రజలకే అందించే ఏర్పాటును కలిపించబోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తమదేనంటూ కేజ్రీవాల్ కేబినెట్ దానికి ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం ప్రజల వద్దకే ప్రభుత్వ సదుపాయాలు వచ్చి చేరుతాయన్న మాట. ఉదాహారణకు రేషన్ కార్డు సబ్సిడీ సదుపాయాలు, సర్టిఫికెట్లలలో మార్పులు-చేర్పులు, డ్రైవింగ్ లైసెన్సులు, వివాహ సర్టిఫికెట్లు.. లాంటి సేవలను నేరుగా ఇంటికి వెళ్లి ప్రజలకు అందించటం అన్న మాట. తద్వారా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పని, భారీ క్యూలలో నిలుచునే అవకాశం లేకుండా పోతుందని ప్రభుత్వం భావిస్తోంది. అధికారులే ప్రతీ గడప దగ్గరికి వెళ్లి అవసరమైన ప్రక్రియను చూసుకుంటారు. ఒకవేళ దానికి అవసరమైన ఫీజు ఉంటేనే ప్రజలు చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే లేదు అని ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తెలిపారు. వివిధ రకాల సర్టిఫికెట్లు జారీ చేయటం తదితరాల కింద మొత్తం 40 సేవలను మొదటి విడతగా ఈ పథకంలో చేర్చారు. ఢిల్లీ ప్రజలు తమ తమ పనుల్లోనే క్షణం తీరిగ్గా లేకుండా బిజీగా గడుపుతున్నారు. అలాంటి సమయంలో వారికి ఊరట ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం అని సిసోడియా అన్నారు. మరో నెలలో ఇంకో 40 సేవలను చేర్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. అయితే కాలుష్యాన్ని నివారించటంలో దారుణంగా విఫలమయ్యాడన్న విమర్శలు.. అది కాకుండా నానాటికీ తగ్గుతున్న ప్రజాదరణను నిలబెట్టుకునేందుకే ఇలా కంటితుడుపు నిర్ణయాలు తీసుకుంటున్నాడని విపక్షాలు చెబుతున్నాయి. -
‘వెనిజులాలో నోట్ల రద్దును రద్దు చేశారు.. మరిక్కడ’
ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ప్రజల సమస్యలు అస్సలుపట్టవన్నారు. ఎవరి సలహాలు ప్రధాని పరిగణనలోకి తీసుకోరని, ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని దేశ ప్రజలకు పనిచేయాలని అన్నారు. నోట్లను రద్దు చేస్తూ వెనిజులాలో నిర్ణయం తీసుకుంటే అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారని, దాంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ అక్కడి ప్రభుత్వం వెనక్కి తీసుకుందని చెప్పారు. కానీ, మోదీ మాత్రం ప్రజల బాధలను పట్టించుకోవడం లేదని, ఆయన అలా చేయాలని అనుకోవడం లేదని తెలిపారు. -
సలహా ఇస్తే.. విమర్శిస్తారా?: సీఎం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం చేసిన సర్జికల్ దాడులకు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. సర్జికల్ దాడులు జరగలేదని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని, తాను ఈ విషయాన్నే ప్రస్తావించానని కేజ్రీవాల్ చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తాము కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నామని, పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం తిప్పికొట్టాలని మాత్రమే తాను కేంద్రానికి సలహా ఇచ్చానని కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. ఇది చాలా సున్నితమైన విషయమని, బీజేపీ నాయకులు రాజకీయం చేయరాదని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతలు తనపై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. దాడులు చేయలేదంటూ పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ తిప్పి కొట్టాలని, సర్జికల్ దాడుల ఫుటేజీ విడుదల చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు పాకిస్థాన్ మీడియా వార్తల్లో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ప్రధాన శీర్షికలుగా ఉన్నాయి. సర్జికల్ దాడులు జరగలేదని భారత్‌లోనే ఓ ముఖ్యమంత్రి చెబుతున్నారంటూ పాక్ పత్రికలు ప్రచురించాయి. దీంతో కేజ్రీవాల్‌పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆర్మీని తక్కువ అంచనా వేసే మాటలు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే మానుకోవాలని బీజేపీ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. -
'మిస్టర్ కేజ్రీవాల్.. ఆర్మీని కించపరచకు'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆర్మీని తక్కువ అంచనా వేసే మాటలు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే మానుకోవాలని బీజేపీ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సర్జికల్ దాడికి ఆధారాలను వెంటనే బయటపెట్టాలని కేజ్రీవాల్ అనడం దురదృష్టకరం అని, ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం మూలంగా నేడు పాకిస్థాన్ ప్రధాన వార్తల్లో నిలిచారని, ఆయన వ్యాఖ్యలు పాక్ సానూకూల అంశంగా మార్చుకొని పతాక శీర్షికలు వెలువరించిందని చెప్పారు. ఆర్మీని కించపరిచేలాగా కేజ్రీవాల్ ప్రకటనలు ఉన్నాయని, దయచేసి అలాంటి మాటలు మానుకోవాలని హితవు పలికారు. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ మాట్లాడారని, దేశభద్రతపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. 'మిస్టర్ కేజ్రీవాల్ మీరొక విషయం తెలుసుకోవాలి. ఈ రోజు పాకిస్థాన్ మీడియా వార్తల్లో మీరే ప్రధాన శీర్షికలుగా ఉన్నారు. రాజకీయాలు వేరు. భారత సైన్యాన్ని కించపరిచేలా ఏమీ చేయకండి ఏమీ చెప్పకండి' అని కేంద్రమంత్రి అన్నారు. దాడులు చేయలేదంటూ పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ తిప్పి కొట్టాలని, సర్జికల్ దాడుల ఫుటేజీ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. -
'ఆ మాటలు వింటుంటే నా రక్తం మరుగుతోంది'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడుల విషయంలో పాక్ చేస్తున్న ఆరోపణలు, వల్లే వేస్తున్న అబద్ధాలు చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసలు తమ భూభాగంలో ఎలాంటి సర్జికల్ దాడులు భారత్ చేపట్టలేదని పాక్ చేస్తున్న దుష్ప్రచారాలను విదేశీ మీడియాలు సైతం నమ్మే పరిస్థితి వచ్చిందని, ఇదంతా చూస్తుంటే తనకు బాగా కోపం వస్తుందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం సర్జికల్ దాడుల ఫుటేజీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏడు ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు నిర్వహించిందని, ఆ దాడులకు సంబంధించిన ఫుటేజీ విడుదల చేస్తే పాక్ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టినట్లవుతుందంటూ ఆయన ఓ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 'నాకు ప్రధాని నరేంద్రమోదీతో కొన్ని అభిప్రాయ విభేదాలు ఉండొచ్చు. కానీ పాకిస్థాన్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయానికి నమస్కరిస్తున్నాను' అంటూ కేజ్రీవాల్ అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ 'పాకిస్థాన్‌కు ఎలా బుద్ధి చెప్పాలో ప్రధాని నరేంద్రమోదీకి తెలుసు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిజంగా ఢిల్లీని చికెన్ గునియా, డెంగ్యూ రహిత ప్రాంతంగా ఎలా మార్చాలో అనే విషయంపైనే బాధపడాలి తప్ప ఇలాంటి విషయంలో కాదు' అని అన్నారు. -
'ఎఫ్ఐఆర్లో నన్నెందుకు చేర్చారో తెలియడం లేదు'
న్యూఢిల్లీ: ఢిల్లీ మహిళా కమిషన్ సభ్యుల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్ లో తన పేరును ఎందుకు చేర్చారో అర్థం కావడం లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను ఏం చేశాననే విషయాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో పేర్కొనలేదని చెప్పారు. 'ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్‌పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో నా పేరు ఎందుకు చేర్చారో తెలియదు. ఇందులో నా పాత్ర ఏముంది? అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఎఫ్ఐఆర్ వెనుక కుట్ర ఏమిటో తేల్చుకునేందుకు త్వరలోనే ప్రత్యేక విధాన సభ సమావేశం ఏర్పాటుచేసి పూర్తి స్థాయిలో చర్చిస్తామని అన్నారు. మహిళా కమిషన్ సభ్యుల నియామకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని స్వాతి మలివాల్ పై కేసు నమోదు చేసిన అధికారులు ఇప్పటికే ఆమెను ప్రశ్నించారు. డీసీడబ్ల్యూ మాజీ అధ్యక్షురాలు బర్కా శుక్లా సింగ్ ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ విచారణ చేపట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వారిని డీసీడబ్ల్యూలో అక్రమంగా నియమించినట్టు ఆమె ఫిర్యాదు చేశారు. ఎటువంటి అర్హతలు లేకపోయినా 85 మందిని నియమించారని ఆరోపించారు. ఈ ఆరోపణలను స్వాతి మలివాల్ తోసిపుచ్చిన విషయం తెలిసిందే. -
ఢిల్లీ సీఎం మరో మంత్రి పరువు తీశారంట
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై మరో పరువు నష్టం దావా కేసు పడింది. అమృత్ సర్ కోర్టులో పంజాబ్ మంత్రి మజీతియా కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేశారు. డ్రగ్స్ సిండికేట్ తో మజితియాకు సంబంధం ఉందని గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు. దీంతో ఆయన ఆరోపణలు కొట్టిపారేశారు. తనపై కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశారని, నలుగురిలో పరువు తీసే చర్యలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఓసారి అరుణ్ జైట్లీ డీసీసీబీ విషయంలో కేజ్రీవాల్ పై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. -
'సీఎంగారూ ఈ డబ్బులతో బూట్లు కొనుక్కోండి'
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిన విందు కార్యక్రమానికి చెప్పులతో హాజరైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు విశాఖపట్నానికి చెందిన ఓ వ్యాపార వేత్త రూ.364 పంపించారు. మున్ముందు రాష్ట్రపతితో జరిగే కార్యక్రమాల్లోనైనా ఆయన ఆ డబ్బులతో చక్కగా ఫార్మల్ బూట్లు కొనుక్కోని హాజరుకావాలని కోరారు. దీనికి సంబంధించి ఒక డీడీ కూడా పంపించారు. ఇటీవల జరిగిన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ప్రాంకోయిస్ హోలాండ్ హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఓ విందు కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఆ కార్యక్రమానికి అరవింద్ కేజ్రీవాల్ శాండిల్స్, సాక్సు వేసుకొని వచ్చారు. దీనికి ఆశ్చర్యపోయిన విశాఖపట్నానికి చెందిన వ్యాపారావేత్త సుమిత్ అగర్వాల్ కేజ్రీవాల్‌ను ఫార్మల్ షూ కొనుక్కోవాల్సిందిగా కోరుతూ రూ.364 డీడీ తీసి పంపించారు. 'అది రాష్ట్రపతి భవన్లో ఒక గౌరవ విందు కార్యక్రమం.. ఆమ్ ఆద్మీ పార్టీ రామ్ లీలా మైదాన్లోనో, జంతర్ మంతర్లోనో నిర్వహించే ర్యాలీ కాదు, ధర్నా కాదు' అని ఆయన అన్నారు. పబ్లిక్ స్టంట్ కోసమే కేజ్రీవాల్ శాండిల్స్ వేసుకున్నారని ఆరోపించారు. దీంతోపాటు కేజ్రీవాల్‌కు ఒక బహిరంగ లేఖ రాశారు. 'కేజ్రీవాల్ గారు మీరు రాష్ట్రపతి భవన్లో ఇచ్చిన గౌరవ విందులో ఉన్నారు. అదేదో ఫ్రెండ్స్ బర్త్ డే పార్టీనో, రెస్టారెంటో కాదు. ఎవరు ఏం ధరించాలనే విషయం వ్యక్తిగత స్వేచ్ఛ అయి ఉండొచ్చు. కాని కొన్ని స్థలాలు వ్యక్తిగత స్వేచ్ఛకంటే గొప్పవి. మీరు చాలా ఎదిగిన వ్యక్తి. దయచేసి పరిస్థితికి, ఓ ప్రత్యేక కార్యక్రమానికి తగిన విధంగా నడుచుకోండి. మంచి దుస్తులు వగైరా ధరించండి' అని ఆ లేఖలో పేర్కొన్నాడు. -
'అవన్నీ రాజకీయ జిమ్మిక్కులే'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జిమ్మిక్కు రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శర్మిష్ఠ ముఖర్జీ అన్నారు. ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా కల్పించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ(రిఫరెండం) జరపడమనేది రాజ్యాంగ విరుద్ధమైన చర్యమాత్రమే కాకుండా జాతి వ్యతిరేక చర్య అని ఆరోపించారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీకి పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదా కల్పించే అంశాన్ని డిమాండ్ చేస్తూ దానిపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఆమె స్పందించారు. ప్రతిసారి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలు చేస్తున్నారని, కేంద్రంతో తగువులు పెట్టుకుంటున్నారని శర్మిష్ఠ ఆరోపించారు. ఇది కేవలం రాష్ట్రం అనే సమస్య కాదని, ఢిల్లీ అంటే దేశ రాజధాని అయినందున దీని విషయంలో అందరితో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగ పరంగా అది సాధ్యమా కాదా అనే విషయం తెలుసుకోకుండా నలుగురుని అడగకుండా ప్రతిసారి రాష్ట్రహోదా అంటూ ఆప్ ముందుకు రావడం రాజకీయంగా జిమ్మిక్కులకు పాల్పడటం తప్ప మరొకటి కాదని ఆరోపించారు. -
ఇప్పుడు ఎవరు నక్సలైట్లు?
ప్రధాని మోదీని ప్రశ్నించిన ఆప్ సీఎం ఇంటి బయట ధర్నా చేయడంపై ఆగ్రహం న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి బయట బీజేపీ కార్యకర్తలు ధర్నా చేయడంపై ఆప్ మండిపడింది. నక్సలైట్ల వంటి నిరసనలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తారా అని గురువారం ఎద్దేవా చేసింది. ఢిల్లీ పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండాలని మరోసారి డిమాండ్ చేసింది. గతంలో ఆప్ నిరసన తెలిపినందుకు ప్రధాని మోదీ తమను అరాచకులు, నక్సలైట్లు అని వ్యాఖ్యానించిన విషయాన్ని ఆప్ నేత కుమార్ బిశ్వాస్ గుర్తుచేశారు. మరి సతీశ్ ఉపాధ్యాయ, బీజేపీ కార్యకర్తలు చేసిన ఈ నిరసనలను ఆయన ఏమంటారో చూడాలి అని దుయ్యబట్టారు. ఇప్పుడు ఎవరు నక్సలైట్లో చెప్పాలని ప్రశ్నించారు. సతీశ్ ఉపాధ్యాయ నిరసన వెనక ఉన్న ఉద్దేశం ఏంటో అర్థం కావడంలేదని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ ఢిల్లీలో శాంతి భద్రతల వైఫల్యం ఉంటే.. వెళ్లి కేంద్రంతో మాట్లాడి, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి పోలీసులను తీసుకొచ్చేందుకు కృషి చేయాలని సూచించారు. కాగా, తుర్క్‌మాన్ వద్ద జరిగిన సంఘటనలో ఆప్ కార్యకర్తలు నిందితులని, వారు పర్యావరణ మంత్రికి, మటియా మహల్ ఎమ్మెల్యేకు సన్నిహితులని అందుకే వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. అలాగే వారిని పదవి నుంచి తప్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. -
తుర్క్‌మాన్ గేట్ రోడ్ రేజ్‌పై బీజేపీ ‘రేజ్’
♦ సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద ధర్నా ♦ నిరసనకారులను నియంత్రించేందుకు ♦ వాటర్ కేనన్ల ప్రయోగించిన పోలీసులు ♦ గూండాలకు కొమ్ముకాస్తే సహించేదిలేదు: సతీశ్ ఉపాధ్యాయ ♦ ఈ కేసుతో మంత్రి అసీమ్‌కు సంబంధం ఉందని ఆరోపణ ♦ అసీం కేబినెట్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ : తుర్క్‌మాన్ గేట్ ‘రోడ్ రేజ్’ కేసు విషయంలో ఆప్ ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు గురువారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు ధర్నా జరిపారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షడు సతీష్ ఉపాధ్యాయ నేతృత్వంలో కార్యకర్తలు బారికేడ్లను దాటడానికి ప్రయత్నించారు. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. నిరసనకారులను చెల్లాచెదురు చేయడం కోసం పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు. శాంతిభద్రతలను పరిరక్షిస్తానని ఇచ్చిన హామీని గాలికి వదిలేసిన ప్రభుత్వం.. ఇప్పుడు నేరగాళ్లకు కొమ్ముకాస్తోందని బీజేపీ ఆరోపించింది. కారును ఢీకొట్టాడన్న కోపంతో మోటారుసైక్లిస్టును కొట్టి చంపిన కేసులో ప్రధాన నిందితుడైన అమీన్ పెహల్వాన్‌కు స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే అసీమ్ అహ్మద్‌ఖాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఆప్ సర్కారులో పర్యావరణ మంత్రి కూడా అయిన అసీమ్‌ను తక్షణం కేబినెట్ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో నిందితులందరూ ఆప్ కార్యకర్తలని బీజేపీ అంటోంది. నిందితుల అరెస్టులో జాప్యం చేయవలసిందిగా, కేసు బలహీనపడేలా ఎఫ్ఐఆర్ నమోదుచేయవలసిందిగా ఖాన్ ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని బీజేపీ ఆరోపించింది. నిందితులందరినీ అరెస్టు చేసి పోలీసులు తమ పని పూర్తి చేశారని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహించబోనని ఇచ్చిన హామీని ఆప్ ప్రభుత్వం మరచిపోయిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటూ ఆప్ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని తమ పార్టీ నిర్ణయించిందని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆప్‌కు రెండు నెలల సమయం ఇచ్చామని చెప్పారు. అయితే ఈ విధంగా గూండాలకు కొమ్ముకాస్తే సహించబోమని ఉపాధ్యాయ హెచ్చరించారు. -
సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమైన అమెరికా రాయబారి
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా పాల్గొన్నారు. సామాజిక, పర్యావరణ రంగాల్లో అమెరికా రాయబారి కార్యాలయం నిర్వహిస్తోన్న కార్యక్రమాల గురించి రిచర్డ్ వర్మ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఘనరూప వ్యర్థాల మేనేజ్మెంట్, స్వచ్ఛ ఇంధనం, నీటి రీసైక్లింగ్, యమునా నదిని శుభ్రం చేయడం, కాలుష్యం వంటి సమస్యల పరిష్కారానికి సలహాలు ఇవ్వాల్సిందిగా అమెరికా రాయబారిని కేజ్రీవాల్ కోరారు. నగరాన్ని మార్చే చక్కటి అవకాశం తమకు లభించిందని, ఇది చాలా పెద్ద బాధ్యత కూడా అని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీని తాము ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం తాము కొత్త ఐడియాలు, భాగస్వాముల కోసం అన్వేషిస్తున్నామన్నారు . ఈ సమస్యలకు పరిష్కారాలను చూపించగలిగి ప్రపంచంలో పాటించే అత్యుత్తమ పద్ధతులను ఢిల్లీలో అమలుచేయడానికి ముందుకొచ్చే వారి కోసం తాము ఎదురుచూస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘అవినీతి నిరోధక హెల్ప్‌లైన్’ గురించి అమెరికా రాయబారి ఆరా తీశారు. అవినీతి, మహిళల భద్రత వంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. అవినీతి జాతీయ సమస్య అని, అన్ని స్థాయిలలోనూ ఇది జరుగుతోందన్నారు. కానీ, దీని వల్ల సామాన్యుడు అధికంగా నష్టపోతున్నాడని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. -
ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా నిలుపుతాం
♦ ప్రయివేట్ రంగ సంస్థలకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి ♦ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి ♦ యమునా నదిని శుభ్రం చేయడంలో సహకరించాలి సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఐదేళ్లలో ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పాటునందించాలని ప్రైవేటు రంగ సంస్థలను కోరారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు రంగం ఉపాధిని ృసష్టిస్తుందని, అందువల్ల తమ ప్రభుత్వం ఢిల్లీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటోందని చెప్పారు. జనతా దర్బార్‌లో తనను కలవడానికి వచ్చేవారిలో అత్యధికులు ఉద్యోగమిప్పించాలని కోరేవారేనని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కలిపించడంలో చేయూతనివ్వాలని కోరారు. ఐదేళ్లలో ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా చూడాలనుకుంటున్నానని అన్నారు. ఆ లక్ష్యాన్ని తమ ప్రభుత్వం సాధిస్తుందన్న నమ్మకముందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. నీటిని రీసైకిల్ చేయడంపై సలహాలివ్వండి ఇప్పటి వరకు నీటి సమస్యను అధిగమించేందుకు పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఆ విధంగా కాకుండా ఢిల్లీయే దీనికి స్వయంగా పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందన్నారు. నీటిని రీసైకిల్ చేయడానికి తగిన సలహాలిస్తే స్వీకరిస్తామని ఆయన వాణిజ్య వేత్తలను ఆహ్వానించారు. యమునా నది నీటి మట్టం వర్షాకాలంలో పెరుగుతోందని, ఆ నీటిని ఆదా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నీరు వృథాగా పోకుండా నిల్వ చేయడానికి తగిన మార్గాలు అన్వేషించాలని చెప్పారు. కాలుష్య కాసారంగా మారిన యమునా నదిని శుభ్రం చేయడానికి సాయపడాలని ప్రయివేటు రంగాన్ని కోరారు. ఘనరూప వ్యర్థాల మేనేజ్మెంట్పై దృష్టిపెట్టాల్సిన అవసరముందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. నగరాన్ని శుభ్రం చేయడం కోసం యంత్రాలను వాడాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. దీని కోసం నిధులను తాము వికేంద్రీకరించనున్నట్లు తెలిపారు. తద్వారా కాలనీ స్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చన్నారు. దేశాన్ని మార్చడానికి రాజకీయాల్లోకి వచ్చా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో విబేధాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఆయన నిరాకరించారు. పాలన గురించి మాత్రమే మాట్లాడుతానని చెప్పారు. తాను దేశాన్ని మార్చడానికి రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు. కానీ, ఢిల్లీ సమస్యలను పరిష్కరించడానికే చాలా సమయంపడుతోందని, మిగతా విషయాలకు సమయం లేదని పేర్కొన్నారు. టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికే టీవీ చానెళ్లు ఈ అంశాల గురించి మాట్లాడుతుంటాయని, తాను దృష్టి పెట్టాల్సిన విషయాలు వేరే ఉన్నాయని ఆయన చెప్పారు.