♦ ప్రయివేట్ రంగ సంస్థలకు సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తి
♦ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి
♦ యమునా నదిని శుభ్రం చేయడంలో సహకరించాలి
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఐదేళ్లలో ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. నగరాన్ని అభివృద్ధి చేయడానికి తోడ్పాటునందించాలని ప్రైవేటు రంగ సంస్థలను కోరారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. అనంతరం కేజ్రీవాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు రంగం ఉపాధిని ృసష్టిస్తుందని, అందువల్ల తమ ప్రభుత్వం ఢిల్లీలో వాణిజ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటోందని చెప్పారు.
జనతా దర్బార్‌లో తనను కలవడానికి వచ్చేవారిలో అత్యధికులు ఉద్యోగమిప్పించాలని కోరేవారేనని పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కలిపించడంలో చేయూతనివ్వాలని కోరారు. ఐదేళ్లలో ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా చూడాలనుకుంటున్నానని అన్నారు. ఆ లక్ష్యాన్ని తమ ప్రభుత్వం సాధిస్తుందన్న నమ్మకముందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నీటిని రీసైకిల్ చేయడంపై సలహాలివ్వండి
ఇప్పటి వరకు నీటి సమస్యను అధిగమించేందుకు పొరుగు రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఆ విధంగా కాకుండా ఢిల్లీయే దీనికి స్వయంగా పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉందన్నారు. నీటిని రీసైకిల్ చేయడానికి తగిన సలహాలిస్తే స్వీకరిస్తామని ఆయన వాణిజ్య వేత్తలను ఆహ్వానించారు. యమునా నది నీటి మట్టం వర్షాకాలంలో పెరుగుతోందని, ఆ నీటిని ఆదా చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ నీరు వృథాగా పోకుండా నిల్వ చేయడానికి తగిన మార్గాలు అన్వేషించాలని చెప్పారు. కాలుష్య కాసారంగా మారిన యమునా నదిని శుభ్రం చేయడానికి సాయపడాలని ప్రయివేటు రంగాన్ని కోరారు. ఘనరూప వ్యర్థాల మేనేజ్‌మెంట్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరముందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. నగరాన్ని శుభ్రం చేయడం కోసం యంత్రాలను వాడాల్సిన అవసరముందని ఆయన చెప్పారు. దీని కోసం నిధులను తాము వికేంద్రీకరించనున్నట్లు తెలిపారు. తద్వారా కాలనీ స్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చన్నారు.
దేశాన్ని మార్చడానికి రాజకీయాల్లోకి వచ్చా
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో విబేధాల గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ఆయన నిరాకరించారు. పాలన గురించి మాత్రమే మాట్లాడుతానని చెప్పారు. తాను దేశాన్ని మార్చడానికి రాజకీయాలలోకి వచ్చానని తెలిపారు. కానీ, ఢిల్లీ సమస్యలను పరిష్కరించడానికే చాలా సమయంపడుతోందని, మిగతా విషయాలకు సమయం లేదని పేర్కొన్నారు. టీఆర్‌పీ రేట్లు పెంచుకోవడానికే టీవీ చానెళ్లు ఈ అంశాల గురించి మాట్లాడుతుంటాయని, తాను దృష్టి పెట్టాల్సిన విషయాలు వేరే ఉన్నాయని ఆయన చెప్పారు.
ఢిల్లీని ప్రపంచంలోని ఐదు అగ్రనగరాల్లో ఒకటిగా నిలుపుతాం
Published Tue, Apr 7 2015 11:03 PM | Last Updated on Wed, Apr 4 2018 7:42 PM
Advertisement