సాక్షి, న్యూఢిల్లీ : అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీ సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా పాల్గొన్నారు. సామాజిక, పర్యావరణ రంగాల్లో అమెరికా రాయబారి కార్యాలయం నిర్వహిస్తోన్న కార్యక్రమాల గురించి రిచర్డ్ వర్మ సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా ఘనరూప వ్యర్థాల మేనేజ్‌మెంట్, స్వచ్ఛ ఇంధనం, నీటి రీసైక్లింగ్, యమునా నదిని శుభ్రం చేయడం, కాలుష్యం వంటి సమస్యల పరిష్కారానికి సలహాలు ఇవ్వాల్సిందిగా అమెరికా రాయబారిని కేజ్రీవాల్ కోరారు. నగరాన్ని మార్చే చక్కటి అవకాశం తమకు లభించిందని, ఇది చాలా పెద్ద బాధ్యత కూడా అని కేజ్రీవాల్ చెప్పారు.
ఢిల్లీని తాము ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం తాము కొత్త ఐడియాలు, భాగస్వాముల కోసం అన్వేషిస్తున్నామన్నారు . ఈ సమస్యలకు పరిష్కారాలను చూపించగలిగి ప్రపంచంలో పాటించే అత్యుత్తమ పద్ధతులను ఢిల్లీలో అమలుచేయడానికి ముందుకొచ్చే వారి కోసం తాము ఎదురుచూస్తున్నట్లు కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘అవినీతి నిరోధక హెల్ప్‌లైన్’ గురించి అమెరికా రాయబారి ఆరా తీశారు. అవినీతి, మహిళల భద్రత వంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించారు. అవినీతి జాతీయ సమస్య అని, అన్ని స్థాయిలలోనూ ఇది జరుగుతోందన్నారు. కానీ, దీని వల్ల సామాన్యుడు అధికంగా నష్టపోతున్నాడని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమైన అమెరికా రాయబారి
Published Thu, Apr 9 2015 10:23 PM | Last Updated on Fri, Aug 24 2018 6:33 PM
Advertisement