'మిస్టర్ కేజ్రీవాల్.. ఆర్మీని కించపరచకు'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆర్మీని తక్కువ అంచనా వేసే మాటలు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే మానుకోవాలని బీజేపీ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. సర్జికల్ దాడికి ఆధారాలను వెంటనే బయటపెట్టాలని కేజ్రీవాల్ అనడం దురదృష్టకరం అని, ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడం మూలంగా నేడు పాకిస్థాన్ ప్రధాన వార్తల్లో నిలిచారని, ఆయన వ్యాఖ్యలు పాక్ సానూకూల అంశంగా మార్చుకొని పతాక శీర్షికలు వెలువరించిందని చెప్పారు.
ఆర్మీని కించపరిచేలాగా కేజ్రీవాల్ ప్రకటనలు ఉన్నాయని, దయచేసి అలాంటి మాటలు మానుకోవాలని హితవు పలికారు. దేశ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా కేజ్రీవాల్ మాట్లాడారని, దేశభద్రతపై రాజకీయాలు చేయడం సరికాదన్నారు. 'మిస్టర్ కేజ్రీవాల్ మీరొక విషయం తెలుసుకోవాలి. ఈ రోజు పాకిస్థాన్ మీడియా వార్తల్లో మీరే ప్రధాన శీర్షికలుగా ఉన్నారు. రాజకీయాలు వేరు. భారత సైన్యాన్ని కించపరిచేలా ఏమీ చేయకండి ఏమీ చెప్పకండి' అని కేంద్రమంత్రి అన్నారు. దాడులు చేయలేదంటూ పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ తిప్పి కొట్టాలని, సర్జికల్ దాడుల ఫుటేజీ విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.