సలహా ఇస్తే.. విమర్శిస్తారా?: సీఎం
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత సైన్యం చేసిన సర్జికల్ దాడులకు సంబంధించి ఆధారాలు బయటపెట్టాలని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. సర్జికల్ దాడులు జరగలేదని పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని, తాను ఈ విషయాన్నే ప్రస్తావించానని కేజ్రీవాల్ చెప్పారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో తాము కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నామని, పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వం తిప్పికొట్టాలని మాత్రమే తాను కేంద్రానికి సలహా ఇచ్చానని కేజ్రీవాల్ వివరణ ఇచ్చారు. ఇది చాలా సున్నితమైన విషయమని, బీజేపీ నాయకులు రాజకీయం చేయరాదని విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేతలు తనపై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు.
దాడులు చేయలేదంటూ పాకిస్థాన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ తిప్పి కొట్టాలని, సర్జికల్ దాడుల ఫుటేజీ విడుదల చేయాలని కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ రోజు పాకిస్థాన్ మీడియా వార్తల్లో కేజ్రీవాల్ వ్యాఖ్యలు ప్రధాన శీర్షికలుగా ఉన్నాయి. సర్జికల్ దాడులు జరగలేదని భారత్‌లోనే ఓ ముఖ్యమంత్రి చెబుతున్నారంటూ పాక్ పత్రికలు ప్రచురించాయి. దీంతో కేజ్రీవాల్పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత ఆర్మీని తక్కువ అంచనా వేసే మాటలు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెంటనే మానుకోవాలని బీజేపీ నేత, కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు.