'ఆ మాటలు వింటుంటే నా రక్తం మరుగుతోంది'
న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడుల విషయంలో పాక్ చేస్తున్న ఆరోపణలు, వల్లే వేస్తున్న అబద్ధాలు చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసలు తమ భూభాగంలో ఎలాంటి సర్జికల్ దాడులు భారత్ చేపట్టలేదని పాక్ చేస్తున్న దుష్ప్రచారాలను విదేశీ మీడియాలు సైతం నమ్మే పరిస్థితి వచ్చిందని, ఇదంతా చూస్తుంటే తనకు బాగా కోపం వస్తుందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం సర్జికల్ దాడుల ఫుటేజీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఏడు ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ దాడులు నిర్వహించిందని, ఆ దాడులకు సంబంధించిన ఫుటేజీ విడుదల చేస్తే పాక్ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టినట్లవుతుందంటూ ఆయన ఓ వీడియో ద్వారా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 'నాకు ప్రధాని నరేంద్రమోదీతో కొన్ని అభిప్రాయ విభేదాలు ఉండొచ్చు. కానీ పాకిస్థాన్ విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయానికి నమస్కరిస్తున్నాను' అంటూ కేజ్రీవాల్ అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్ మాట్లాడుతూ 'పాకిస్థాన్కు ఎలా బుద్ధి చెప్పాలో ప్రధాని నరేంద్రమోదీకి తెలుసు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిజంగా ఢిల్లీని చికెన్ గునియా, డెంగ్యూ రహిత ప్రాంతంగా ఎలా మార్చాలో అనే విషయంపైనే బాధపడాలి తప్ప ఇలాంటి విషయంలో కాదు' అని అన్నారు.