ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు
ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు
Published Fri, Nov 25 2016 6:40 PM | Last Updated on Sat, Mar 23 2019 8:32 PM
భారత సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ షాక్ నుంచి పాకిస్థాన్ ఇంతవరకు కోలుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు మన సైనికులకు బలం ఉన్నా దాన్ని ప్రదర్శించలేకపోయేవారని.. కానీ పాకిస్థాన్ మన సైనికుల ప్రతాపం చూసిందని ఆయన అన్నారు. పంజాబ్‌లోని భటిండాలో ఎయిమ్స్ భవనానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. నియంత్రణ రేఖ వెంబడి 250 కిలోమీటర్ల పొడవున మన సైన్యం చేసిన సర్జికల్ స్ట్రైక్స్ షాక్ నుంచి ఆ దేశం ఇంకా కోలుకోలేదన్నారు.
పెషావర్‌లో ఉగ్రవాదులు ఒక పాఠశాలపై దాడి చేసి, అక్కడి పిల్లలను హతమారిస్తే భారతదేశంలోని 125 కోట్ల మంది పౌరులు శ్రద్ధాంజలి ఘటించారని, ప్రతి భారతీయుడు కూడా పాకిస్థానీల బాధను తమ బాధగా భావించారని చెప్పారు. పాక్ ప్రజలు తమ పాలకులను భారతదేశంపై పోరాటం ఆపి.. నల్లధనంపైన, అవినీతిపైన పోరాడాల్సిందిగా చెప్పాలని సూచించారు. పాకిస్థానీ ప్రజలు కూడా పేదరికం నుంచి విముక్తి కోరుకుంటున్నారని, కానీ అక్కడి రాజకీయ నాయకులు తమ స్వార్థప్రయోజనాల కోసం అక్కడ అలాంటి పరిస్థితిని కల్పించారని అన్నారు.
Advertisement