పాక్ కు ప్రేమలేఖలు రాయడం మానుకోండి!
పట్నా: పాకిస్థాన్ లో సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో మిగతా ప్రతిపక్షాలకు భిన్నమైన వైఖరిని బిహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రదర్శించారు. సర్జికల్ దాడులపై మోదీ ప్రభుత్వాన్ని పూర్తిగా సమర్థిస్తూనే... సైన్యం విరోచిత చర్యను రాజకీయాలకు వాడుకోవద్దని సుతిమెత్తగా సూచించారు. పాకిస్థాన్ కు వ్యతిరేకంగా తీసుకొనే ప్రతి చర్య విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని నితీశ్ కుమార్ అన్నారు. అయితే, గత నెల సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ పై రాజకీయ అవకాశవాదానికి పాల్పడొద్దని సూచించారు.
రాజ్ గిరిలో సోమవారం జరిగిన బహిరంగ సభలో నితీశ్ మాట్లాడుతూ.. 'పాక్ కు వ్యతిరేకంగా ఏ చర్య అవసరమైనా తీసుకోండి. ఇకనైనా ఆ దేశానికి ప్రేమలేఖలు రాయడం మానుకోండి' అంటూ ప్రధాని మోదీకి సూచించారు. పాక్ ప్రధాని షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ఆకస్మికంగా లాహోర్ కు వెళ్లిన విషయాన్ని నితీశ్ పరోక్షంగా విమర్శించారు. పాకిస్తాన్ పై ఇక కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు. ప్రధాని మోదీ ప్రధానమంత్రి దేశానికి నాయకుడిగా వ్యవహరించాలని కానీ, బీజేపీకి కాదని ఆయన అన్నారు. పాక్ లో భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో ప్రధాని మోదీని కీర్తిస్తూ బీజేపీ పోస్టర్లు అంటించడాన్ని ఆయన తప్పుబట్టారు.