
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి కేసులో పోలీసులు మంగళవారం కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 25న న్యాయస్ధానం ఎదుట హాజరుకావాలని పటియాలా హౌస్ కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కోరింది. అన్షు ప్రకాష్‌పై దాడికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలు బాధ్యులని పోలీసులు చార్జిషీట్‌లో పేర్కొనడం గమనార్హం.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విధులను అడ్డుకోవడం, గాయపరచడం, బెదిరింపులకు గురిచేయడం వంటి కుట్రకు సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు కుట్రపూరితంగా వ్యవహరించారని 3000 పేజీల చార్జిషీట్‌లో పోలీసులు ఆరోపించారు. వీరు చట్టవిరుద్ధంగా గుమికూడటం,ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అవమానించారని చార్జిషీట్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు తనపై దాడికి తెగబడ్డారని అన్షు ప్రకాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసుల చార్జిషీట్‌లో పేర్కొన్న ఆరోపణలను చవకబారు ఆరోపణలని ఆప్ ప్రభుత్వం తోసిపుచ్చింది. మోదీ ప్రభుత్వం ఎంత నైరాశ్యంలో ఉందో ఇది వెల్లడిస్తోందని వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment