court summons
-
కేజ్రీవాల్‌కు మళ్లీ సమన్లు
న్యూఢిల్లీ: మద్యం విధానం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన నోటీసులను పట్టించుకోని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు మరోసారి సమన్లు జారీ చేసింది. విచారణకు రావాలంటూ జనవరి 12, 31వ తేదీలతోపాటు ఫిబ్రవరి 14వ తేదీన పంపిన 4 నుంచి 8 వరకు సమన్లపై కేజ్రీవాల్ స్పందించలేదంటూ బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణ చేపట్టిన జడ్జి దివ్యా మల్హోత్రా ఈ నెల 16వ తేదీన తమ ఎదుట హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేశారు. -
గేదెను గుద్దిచంపిన కేసు.. 28 ఏళ్ల తర్వాత సమన్లు
లక్నో: మన దేశంలో న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉన్నప్పటికీ.. ఆ నత్తనడక విధానాల మాత్రం ఎందుకనో విమర్శలు చేయకుండా ఉండలేం. తాజాగా అలాంటి ఘటన ఒకటి యూపీలో జరిగింది. దాదాపు 28 ఏళ్ల కిందటి నాటి కేసులో.. ఓ పెద్దాయనకు తాజాగా నోటీసులు అందాయి. ఆ సమన్లను ఇంటికి వెళ్లి మరీ అందించిన పోలీసులు.. కోర్టు విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించి వెళ్లారు. అసలే పక్షవాతంతో మంచానికే పరిమితమైన ఆ పెద్దాయన ఆ నోటీసులు చూసి ఇంకా వణికిపోతున్నాడట. ఇంతకీ ఆ పెద్దాయన చేసిన నేరం.. రవాణా శాఖలో డ్రైవర్‌గా పని చేస్తూ ఆ టైంలో ఓ బర్రెను ఢీ కొట్టి అతను చంపాడట. ఆ కేసుకు సంబంధించి నోటీసులు ఇప్పుడు బరేలీ పోలీసులు బరాబాన్కీలో ఉన్న ఇంటికి వెళ్లి మరీ అందజేశారు. ఆ సమన్లను చూసి పాపం 83 ఏళ్ల అచ్చన్ షాక్ తిన్నాడట. 1994 ప్రాంతంలో ఘటన జరిగితే.. పోలీసులు ఇప్పుడు రావడంతో అచ్చన్ పాపం భయంతో వణికిపోతున్నాడు. ఆ టైంలో రెండు సార్లు సమన్లు వస్తే.. బెయిల్ తెచ్చుకున్నాడట. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కేసు వెలుగులోకి రావడంతో పాపం ఆ పెద్దాయన వణికిపోతున్నాడు. ఇదీ చదవండి: అమ్మను కాపాడుకునేందుకు సాహసం -
టీడీపీ నేతలు జేసీ బ్రదర్స్‌కు కోర్టు సమన్లు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్రంలో వాహనాల కుంభకోణం కేసులో టీడీపీ నేతలు జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. 155 బీఎస్–3 వాహనాలకు బీఎస్–4గా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి వాటిని జేసీ బ్రదర్స్ విక్రయించారనే అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా ఉన్న జేసీ బ్రదర్స్‌తో సహా 18 మందికి విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. మార్చి 1న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. పోలీసులు జేసీ ప్రభాకర్‌రెడ్డికి స్వయంగా సమన్లు అందజేశారు. -
కేజ్రీవాల్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్‌పై దాడి కేసులో పోలీసులు మంగళవారం కోర్టులో చార్జిషీట్‌ను సమర్పించారు. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్ 25న న్యాయస్ధానం ఎదుట హాజరుకావాలని పటియాలా హౌస్ కోర్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కోరింది. అన్షు ప్రకాష్‌పై దాడికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సహా 11 మంది ఆప్ ఎమ్మెల్యేలు బాధ్యులని పోలీసులు చార్జిషీట్లో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విధులను అడ్డుకోవడం, గాయపరచడం, బెదిరింపులకు గురిచేయడం వంటి కుట్రకు సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు కుట్రపూరితంగా వ్యవహరించారని 3000 పేజీల చార్జిషీట్లో పోలీసులు ఆరోపించారు. వీరు చట్టవిరుద్ధంగా గుమికూడటం,ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అవమానించారని చార్జిషీట్ పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగిన సమావేశంలో ఆప్ ఎమ్మెల్యేలు తనపై దాడికి తెగబడ్డారని అన్షు ప్రకాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పోలీసుల చార్జిషీట్లో పేర్కొన్న ఆరోపణలను చవకబారు ఆరోపణలని ఆప్ ప్రభుత్వం తోసిపుచ్చింది. మోదీ ప్రభుత్వం ఎంత నైరాశ్యంలో ఉందో ఇది వెల్లడిస్తోందని వ్యాఖ్యానించింది. -
వివాదంలో మరో ఆప్ ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. 2015లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో ఈసీకి తప్పుడు సమాచారం ఇచ్చారనే కేసులో ఆప్ ఎమ్మెల్యే సోమ్ దత్‌కు ఢిల్లీ కోర్టు సమన్లు పంపింది. ఈ కేసులో అక్టోబరు 13వ తేదీలోపు కోర్టు ఎదుట హాజరుకావాల్సిందిగా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అభిలాష్ మల్హోత్రా.. సోమ్ దత్‌ను ఆదేశించారు. 2015లో సాదర్ బజార్ నియోజకవర్గం నుంచి ఆప్ తరఫున సోమ్ దత్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దత్ తల్లిదండ్రులు ఆయనపై ఆధారపడి జీవిస్తున్నారని, అఫిడవిట్లో ఈ విషయాన్ని దాచారని, అలాగే ఆస్తుల వివరాలను పూర్తిగా ప్రకటించలేదని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఢిల్లీలో అధికార ఆప్ ఎమ్మెల్యేలు 12 మందిపై పలు కేసులు నమోదయ్యాయి. నకిలీ డిగ్రీ పొందారనే ఆరోపణలపై న్యాయ శాఖ మాజీ మంత్రి జితేందర్ తోమర్ అరెస్ట్ కాగా, మరో మాజీ మంత్రి సోమనాథ్ భారతి గృహహింస కేసును ఎదుర్కొంటున్నారు. ఇక ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌పై హత్య, అత్యాచారం కేసు నమోదైంది. -
కోర్టుకు రండి!
స్టాలిన్, కెప్టెన్, అన్భుమణి హాజరు కావాలి సెషన్స్ కోర్టు నోటీసులు చెన్నై: వరద రాజకీయం వ్యవహారంలో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే సీఎం అభ్యర్థి, ఎంపీ అన్భుమణి రాందాసులకు ఏర్పడింది. విచారణ నిమిత్తం కోర్టుకు రావాలంటూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రాజమాణిక్యం నోటీసులు జారీ చేశారు. డిసెంబర్లో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరుల్లో వరదలు సృష్టించిన విలయ తాండవం గురించి తెలిసిందే. వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆరోపణలు బయలు దేరాయి. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే సీఎం అభ్యర్థి అన్భుమణి రాందాసు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. వరద సాయంలో సర్కారు వైఫల్యం అంటూ తీవ్రంగా విరుచుకు పడుతూ స్పందించిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆధార రహిత ఆరోపణలు గుప్పించారంటూ స్టాలిన్ , అన్భుమణిలపై మంత్రి ఉదయకుమార్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. డీఎంకే అధినేత విజయకాంత్‌పై సీఎం జయలలిత తరఫున న్యాయవాదులు పరువు నష్టం దావాను సెషన్స్ కోర్టులో దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ శుక్రవారం చెన్నై మొదటి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రాజమాణిక్యం ముందుకు వచ్చింది. పరువు నష్టం దావా పిటిషన్లను పరిశీలించిన న్యాయమూర్తి స్టాలిన్, విజయకాంత్, అన్భుమణి విచారణ నిమిత్తం నేరుగా కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. స్టాలిన్ ఏప్రిల్ 18న, విజయకాంత్ ఏప్రిల్ 25న, అన్భుమణి ఏప్రిల్ 29న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. అలాగే, వీరు గుప్పించిన ఆరోపణల్ని ప్రచురించిన కొన్ని తమిళ పత్రికలకు సైతం నోటీసులు జారీ చేశారు. ఆయా పత్రికల సంపాదకులు సైతం విచారణకు రావాలంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు. -
దర్శకుడు రాజమౌళికి కోర్టు నోటీసులు
ఈ నెల 24లోపు కోర్టులో హాజరుకావాలని ఆదేశం సాక్షి, హైదరాబాద్: ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళికి నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లోని లోటస్‌హైట్స్ అపార్ట్‌మెంట్స్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో (జి-1) ఫ్లాట్ రాజమౌళి పేరిట ఉంది. 2011 అక్టోబర్ 1న ఈ ఫ్లాట్‌ను రాజమౌళి అమ్మకానికి పెట్టగా సినీ నిర్మాత భువనేశ్వర్ మారం రూ. 41 లక్షలకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకొని అడ్వాన్స్‌గా రూ. 2.7 లక్షలు ఇచ్చారు. అయితే సదరు అపార్ట్‌మెంట్‌ను అక్రమంగా నిర్మించడమే కాకుండా క్రమబద్ధీకరించకపోవడం, నాలుగేళ్లపాటు ఆస్తిపన్ను కట్టకపోవడం, ఎల్ఐసీలో రుణం ఉండటం వంటి కారణాలతో ధ్రువపత్రాలు భువనేశ్వర్‌కు ఇవ్వడంలో జాప్యం జరిగింది. రాజమౌళి ఒప్పందాన్ని ఉల్లంఘించి ఈ ఫ్లాట్‌ను మరొకరికి విక్రయించారు. దీంతో రాజమౌళి తనను మోసం చేశారంటూ అదే ఏడాది భువనేశ్వర్ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు రాజమౌళిపై చీటింగ్ కేసు నమోదు చేయాల్సిందిగా నాంపల్లి మూడో అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు బంజారాహిల్స్ పోలీసులను ఆదేశించింది. అనంతరం మూడుసార్లు నోటీసులు జారీ చేసినా రాజమౌళి స్పందించకపోవడంతో ఈ నెల 24 లోపు కోర్టుకు హాజరుకావాలంటూ గురువారం నోటీసులు అందజేశారు. -
టీవీ షో వివాదం; దర్శక నిర్మాతలకు సమన్లు
2013లో ప్రసారమయిన వివాదాస్పద టివీ షో ఏఐబి నాక్అవుట్ వివాదం కరణ్ జోహర్‌ను ఇప్పటికీ వెంటాడుతోంది. అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకోణ్ లాంటి బాలీవుడ్ టాప్‌స్టార్స్ పాల్గొన్న ఈ షోలో సెలబ్రిటీల భాష అసభ్యంగా ఉందంటూ వివాదం జరిగింది. ముఖ్యంగా షోలో అర్జున్ కపూర్, రణవీర్ సింగ్‌ల బిహేవియర్‌తో పాటు కరణ్ జోహార్ చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా సంచలనం సృష్టించాయి. 2013లో డిసెంబర్లో ప్రసారం అయిన ఈ షోను తరువాత ఆన్ లైన్ లో పెట్టారు. ఆన్లైన్ లో పెట్టడం ద్వారా మరింత ప్రచారం కలగటంతో సామాజిక కార్యకర్త సంతోష్ దౌండకర్, 2014 ఫిబ్రవరిలో సిటీ కోర్టులో కేసు వేశారు. ఆ కార్యక్రమాన్ని పరిశీలించిన కోర్టు అందులో పాల్గొన్న వ్యక్తుల పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందింగా పోలీసులను ఆదేశించింది. దీంతో ఏఐబి షోలో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ పై కూడా కేసు నమెదైంది. కరణ్ స్టేట్మెంట్ ను రికార్డ్ చేయటం కోసం ఆయన్ను టార్డియో పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాల్సింది సమన్లు పంపించారు. ప్రస్తుతం ఓ సెలెబ్రిటి షో కోసం లండన్‌లో ఉన్న కరణ్ ఈ విషయం పై స్పందించడానికి నిరాకరించినట్టుగా సమాచారం. కరణ్ జోహార్‌తో పాటు అర్జున్ కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకోణ్లపై ఐపిసి సెక్షన్ 295 కింద కేసు నమోదు చేశారు. -
దర్శకుడు చేరన్, కూతురికి సమన్లు
చెన్నై: సినీ దర్శకుడు చేరన్ ఆయన కుమార్తె నివేద ప్రియదర్శినులకు చెక్కు మోసం కేసులో పరమకుడి కోర్టు సమన్లు జారీ చేసింది. వివరాల్లోకెళితే దర్శకుడు చేరన్ సీ2హెచ్ పేరుతో కొత్త సినిమాలను సీడీల రూపంలో అందించే సంస్థను ప్రారంభించారు. దీనికి తన కూతురు నివేద ప్రియదర్శినిని నిర్మాత, డైరెక్టర్ గా నియమించారు. కాగా ఈసీ2 హెచ్ తరపున పరమకుడి, పార్తిపనూర్, ముదుకుళత్తూర్, కముది, అభిరామం ప్రాంతాలకు ఏజెంట్‌గా పరమకుడి, మాధవన్ నగర్‌కు చెందిన పళముత్తునాదన్ను నియమించారు. అందుకుగాను ఆయన డిపాజిట్‌గా 80 వేల రూపాయల్ని చేరన్‌కు ఇచ్చారు. అయితే సీ2హెచ్ సంస్థ నిర్వాహణ అంత ఆశాజనకంగా లేకపోవడంతో పళముత్తునాథన్ డిపాజిట్ చేసిన డబ్బును లెక్క చూసి తిరిగి చెల్లించనున్నట్లు చేరన్,ఆయన కూతురు ఒప్పుకున్నారని సమాచారం. కాగా చెప్పినట్లుగానే ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో పళముత్తునాదన్కు వారు ఇచ్చారు. చెక్కును పళముత్తునాదన్ పరమకుడిలోని బ్యాంకులో వేయగా చెక్కు బౌన్స్ అయింది. ఇలా పలుమార్లు చెక్కు బౌన్స్ అవడంతో పళముత్తునాథన్ పరమకుడి కోర్టును ఆశ్రయించారు. చెక్కు మోసం పేరుతో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఇన్బకార్తికేయన్ దర్శకుడు చేరన్, ఆయన కుమార్తె నివేద ప్రియదర్శినులకు ఈ నెల 30న కోర్టుకు హాజరు కావలసిందిగా సమన్లు జారీ చేశారు. -
నటుడు ధనుష్‌కు కోర్టు సమన్లు
చెన్నై : నటుడు ధనుష్‌కు చెన్నై ఎగ్మూర్ కోర్టు సమన్లు జారీ చేసింది.వివరాల్లోకెళితే నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, ఫాక్స్‌స్టార్ సూడిమోస్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం కాక్కముట్టై. ఇటీవల విడుదలయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. కాగా ఈ చిత్రంలో న్యాయవాదులను కించపరచే విధంగా సన్నివేశాలు చోటు చేసుకున్నాయంటూ అఖలభారత న్యాయవాదుల సంఘం పరిరక్షణ సంఘం అధ్యక్షుడు మణివన్నన్ ఎగ్మూర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు శుక్రవారం మెజిస్ట్రేట్ మురుగన్ సమక్షంలో విచారణకు వచ్చింది. పిటిషనర్ తర పున న్యాయవాది నమోనారాయణ హాజరయ్యి తన వాదనలను వినిపించి భారతశిక్షాస్మృతి ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.ఆయన వాదనలను విన్న న్యాయమూర్తి నటుడు ధనుష్, దర్శకుడు వెట్రిమారన్, చిత్ర దర్శకుడు మణికంఠన్‌లకు సమన్లు జారీ చేశారు. -
నిజం నిగ్గు తేలుతుంది: మన్మోహన్
న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీచేయడంపై మాజీ ప్రధాని మన్మోహన్ స్పందించారు. తాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తానని, ఇప్పటికే తన వైఖరిని సీబీఐకి స్పష్టం చేశామన్నారు. ''కొంచెం అప్ సెట్ అయ్యాను కానీ, జీవితంలో ఇదొక భాగం.. ఎప్పటికైనా నిజం నిగ్గుదేలాలి'' అంటూ వ్యాఖ్యానించారు. నిజాలను వెల్లడించడానికి ఇదొక మంచి అవకాశమని, న్యాయ విచారణకు తానెప్పుడూ సిద్ధమని చెప్పారు. దీనిపై లీగల్ కౌన్సిల్ లో చర్చిస్తామని చెప్పారు. ఇది ఇలా ఉంటే సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేయడం పై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ చేసిన పాపానికి మన్మోహన్ శిక్ష అనుభవిస్తున్నారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. దీనిపై జాతికి, మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీపై మరో మరక అని, ఆ పార్టీని సమర్ధిస్తున్నమిగతా పార్టీలన్నీ ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని ఆయన కోరారు. బీజేపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ మనీష్ తివారీ స్పందించారు. మన్మోహన్ చాలా పారదర్శకంగా. నిజాయితీగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. బొగ్గు కేటాయింపులను పరిశీలించిన సుప్రీంకోర్టు మన్మోహన్ కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదని గుర్తు చేశారు. మరోవైపు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ ఈ సమన్లపై ఆశ్యర్యం వ్యక్తం చేశారు. దీనిపై ఇపుడు తానేమీ మాట్లాడలేనన్నారు. -
ప్రధాని మోడీకి అమెరికా కోర్టు నోటీసులు
వాషింగ్టన్ : ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా కోర్టు నోటీసులు పంపింది. 2002 గుజరాత్ అల్లర్ల కేసుకు సంబంధించి ఆయనకు న్యూయార్క్ కోర్టు ఈ నోటీసులు ఇచ్చింది.ఇందుకు సంబంధించి మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలని మోడీని ఆదేశించింది. అలియెన్స్ ఫర్ జస్టీస్ అండ్ అకౌంటబిలిటీ ( ఏజేఎ) దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం ఈ నోటీసులు జారీ చేసింది. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో అమెరికా ....తొమ్మిదేళ్లపాటు మోడీకి వీసా నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా దేశాధినేతగా మోడీకి ఈ కేసు వర్తించదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు మోడీ పర్యటనకు నిరసనగా నల్ల జెండాలను ప్రదర్శిస్తామని అలియెన్స ఫర్ జస్టీస్ అండ్ అకౌంటబిలిటీ ( ఏజేఎ) ప్రకటించింది. ఈ నెల 28న న్యూయార్క్ నగరంలోని మన్ హట్టన్ మధ్యనున్న మోడీ మాదిసన్ స్వ్కేర్ కు విచ్చేసినప్పడు తాము తెలుపుతామని వెల్లడించింది. 2002లో సిక్కుల ఊచకోత సందర్భంగా మోడీ తీసుకున్న చర్యలపై ఈ ప్రజాకోర్టు ద్వారా నిరసనలు తెలుపుతామని పేర్కొంది. -
రేప్ కేసులో కేంద్రమంత్రికి కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ కేబినెట్ లో ఓ మంత్రి తన పదవికి రాజీనామా చేసే అవకాశం కనిపిస్తోంది. రేప్ కేసులో కేంద్రమంత్రి నిహాల్చంద్కు కోర్టు సమన్లు జారీ చేసింది. తాజా కేంద్రమంత్రివర్గంలో ఓ మంత్రిని కోర్టు తప్పుపట్టడం తొలి సంఘటన నమోదైంది. ఈ వ్యవహారంపై ప్రధాని ఏవిధంగా స్పందిస్తారోనని మీడియా, రాజకీయవర్గాలు వేచి చూస్తున్నాయి. కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ప్రధాని మోడీని కేంద్ర మంత్రి నిహాల్చంద్ భేటి అయ్యారు. ఐతే నిహాల్ చంద్ రాజీనామా చేసే అవకాశం ఉందని దేశరాజధానిలో ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. తన భర్త, ప్రస్తుత కేంద్రమంత్రి నిహాల్ చంద్ తోపాటు అతని స్నేహితులు తనను లైంగిక వేధించారని జైపూర్ లోని వైశాలీ నగర్ కు చెందిన ఓ మహిళ కోర్టు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో కోర్టు 17 మందితోపాటు కేంద్రమంత్రికి సమన్లు జారీ చేసింది. -
అవినీతి కేసుల్లో జర్దారీకి సమన్లు
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీకి ఇస్లామాబాద్‌లోని అవినీతి నిర్మూలన కోర్టు సమన్లు జారీ చేసింది. సోమవారం ఆయన కోర్టు ఎదుట హాజరు కావాల్సిఉన్నా విదేశాల్లో ఉన్నందున రాలేకపోయారు. ఈ నెల 29న హాజరు కావాల్సిందిగా కోర్టు నోటీసులు జారీ చేసింది. పదవీకాలం ముగియడంతో ఇటీవల పాక్ అధ్యక్షుడిగా వైదొలిగిన జర్దారీ అవినీతి కేసుల్లో కూరుకుపోయారు. ఆయనపై మొత్తం ఐదు కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ జర్దారీ అధికారంలో ఉన్నపుడు అధికార దుర్వినియోగానికి సంబంధించినవి. ఈ కేసులను పునఃప్రారంభించాల్సిందిగా జాతీయ పారదర్శక విభాగం (ఎన్ఏబీ) కోర్టు న్యాయమూర్తి గత నెలలో ఆదేశించినట్టు కథనం. వీటిని సుమోటాగా స్వీకరించింది. పాక్ అధ్యక్షుడిగా ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న జర్దారీ గత నెల 6న కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రస్తుతం పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్‌గా ఉన్నారు. క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు దృష్టిసారిస్తున్నారు. -
సోనియాకు కోర్టు సమన్లు అందించిన సిక్కు సంస్థ
అమెరికా ఫెడరల్ కోర్టు జారీచేసిన సమన్లను సోనియా గాంధీకి తాము అందజేసినట్లు సిక్కు సంస్థ తెలిపింది. వైద్య చికిత్స నిమిత్సం న్యూయార్క్ వచ్చిన సోనియాగాంధీకి ఆస్పత్రి సిబ్బంది ద్వారా ఈ నోటీసులు ఇచ్చామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జె.) అనే సంస్థ సోనియాపై కేసు దాఖలుచేసిన విషయం తెలిసిందే. సిక్కు వ్యతిరేక అల్లర్లలో భాగస్వామ్యం ఉన్న కాంగ్రెస్ నాయకులను ఆమె రక్షిస్తున్నారంటూ వారు కేసు దాఖలు చేశారు. న్యూయార్క్‌లోని స్లోన్-కెటెరింగ్ కేన్సర్ సెంటర్లో చికిత్స తీసుకున్న సోనియాకు సమన్లను అందించారు. ఆస్పత్రిలోని నైట్ షిప్టు నర్సింగ్ సూపర్వైజర్ ఈస్టర్ రూయిజ్ ఈ సమన్లను అందుకున్నట్లు ఎస్.ఎఫ్.జె. అటార్నీ గురుపత్వంత్ ఎస్. పన్నున్ తెలిపారు. అలాగే ఆస్పత్రి సెక్యూరిటీ మేనేజర్ ఆల్విన్ మిల్నర్కు కూడా సమన్ల కాపీని ఇచ్చారు. అమెరికా ఫెడరల్ నిబంధనల ప్రకారం, ఈ సమన్లపై స్పందించేదుకు సోనియాగాంధీకి 21 రోజుల సమయం ఉంటుంది. అయితే, బుధవారం ఉదయానికే సోనియా అమెరికా నుంచి స్వదేశానికి ఢిల్లీ తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.