నిజం నిగ్గు తేలుతుంది: మన్మోహన్
న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీచేయడంపై మాజీ ప్రధాని మన్మోహన్ స్పందించారు. తాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తానని, ఇప్పటికే తన వైఖరిని సీబీఐకి స్పష్టం చేశామన్నారు. ''కొంచెం అప్ సెట్ అయ్యాను కానీ, జీవితంలో ఇదొక భాగం.. ఎప్పటికైనా నిజం నిగ్గుదేలాలి'' అంటూ వ్యాఖ్యానించారు. నిజాలను వెల్లడించడానికి ఇదొక మంచి అవకాశమని, న్యాయ విచారణకు తానెప్పుడూ సిద్ధమని చెప్పారు. దీనిపై లీగల్ కౌన్సిల్ లో చర్చిస్తామని చెప్పారు.
ఇది ఇలా ఉంటే సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేయడం పై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ చేసిన పాపానికి మన్మోహన్ శిక్ష అనుభవిస్తున్నారని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. దీనిపై జాతికి, మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీపై మరో మరక అని, ఆ పార్టీని సమర్ధిస్తున్నమిగతా పార్టీలన్నీ ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని ఆయన కోరారు.
బీజేపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ మనీష్ తివారీ స్పందించారు. మన్మోహన్ చాలా పారదర్శకంగా. నిజాయితీగా వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. బొగ్గు కేటాయింపులను పరిశీలించిన సుప్రీంకోర్టు మన్మోహన్ కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదని గుర్తు చేశారు. మరోవైపు బొగ్గు శాఖ మాజీ కార్యదర్శి పీసీ పరేఖ్ ఈ సమన్లపై ఆశ్యర్యం వ్యక్తం చేశారు. దీనిపై ఇపుడు తానేమీ మాట్లాడలేనన్నారు.