స్టాలిన్, కెప్టెన్, అన్భుమణి హాజరు కావాలి
సెషన్స్ కోర్టు నోటీసులు
చెన్నై: వరద రాజకీయం వ్యవహారంలో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే సీఎం అభ్యర్థి, ఎంపీ అన్భుమణి రాందాసులకు ఏర్పడింది. విచారణ నిమిత్తం కోర్టుకు రావాలంటూ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రాజమాణిక్యం నోటీసులు జారీ చేశారు. డిసెంబర్‌లో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, కడలూరుల్లో వరదలు సృష్టించిన విలయ తాండవం గురించి తెలిసిందే. వరద బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ఆరోపణలు బయలు దేరాయి.
డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, పీఎంకే సీఎం అభ్యర్థి అన్భుమణి రాందాసు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. వరద సాయంలో సర్కారు వైఫల్యం అంటూ తీవ్రంగా విరుచుకు పడుతూ స్పందించిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆధార రహిత ఆరోపణలు గుప్పించారంటూ స్టాలిన్ , అన్భుమణిలపై మంత్రి ఉదయకుమార్ పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. డీఎంకే అధినేత విజయకాంత్‌పై సీఎం జయలలిత తరఫున న్యాయవాదులు పరువు నష్టం దావాను సెషన్స్ కోర్టులో దాఖలు చేశారు.
ఈ పిటిషన్ల విచారణ శుక్రవారం చెన్నై మొదటి సెషన్స్ కోర్టు న్యాయమూర్తి రాజమాణిక్యం ముందుకు వచ్చింది. పరువు నష్టం దావా పిటిషన్లను పరిశీలించిన న్యాయమూర్తి స్టాలిన్, విజయకాంత్, అన్భుమణి విచారణ నిమిత్తం నేరుగా కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. స్టాలిన్ ఏప్రిల్ 18న, విజయకాంత్ ఏప్రిల్ 25న, అన్భుమణి ఏప్రిల్ 29న విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. అలాగే, వీరు గుప్పించిన ఆరోపణల్ని ప్రచురించిన కొన్ని తమిళ పత్రికలకు సైతం నోటీసులు జారీ చేశారు. ఆయా పత్రికల సంపాదకులు సైతం విచారణకు రావాలంటూ తదుపరి విచారణను వాయిదా వేశారు.
కోర్టుకు రండి!
Published Sat, Feb 27 2016 8:56 AM | Last Updated on Sun, Sep 3 2017 6:33 PM
Advertisement