కెప్టెన్ మా వెంటే!
►మద్దతు ఇస్తాడన్న నమ్మకం ఉంది
► పెదవి విప్పిన కరుణ
► రెండు రోజుల్లో మేనిఫెస్టో
► కొళత్తూరు బరిలో మళ్లీ స్టాలిన్
► ఇంటర్వ్యూకు హాజరు
సాక్షి, చెన్నై : డీఎండీకే పొత్తు వ్యవహారాలపై వస్తున్న ఊహాజనిత కథనాలకు ముగింపు పలికే విధంగా డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. కెప్టెన్ మా వెంటే అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్య, పండు పక్వానికి వచ్చింది...ఇక పాలల్లో పడాల్సిందే అని సామెతను వళ్లించి అటు కమలనాథులకు, ఇటు ప్రజా కూటమికి షాక్ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టోను సైతం ప్రకటించబోతున్నట్టు కరుణానిధి వెల్లడించారు.
అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలతో డీఎంకే అధినేత కరుణానిధి ముందుకు సాగుతూ వస్తున్నారు. ఇప్పటికే ఆ కూటమిలోకి కాంగ్రెస్ చేరింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎప్పటి నుంచో డీఎంకేతో పయనం సాగిస్తూనే ఉంది. ఇక, పది శాతం మేరకు ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్ తమ వెంట ఉంటే చాలు, అన్నాడీఎంకేను పతనం అంచుకు చేర్చినట్టే అన్న భావనలో డీఎంకే వర్గాలు పడ్డాయి.
అయితే, విజయకాంత్ ఎక్కడా, ఎవరికీ చిక్కకుండా నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ఊహాజనిత కథనాలెన్నో పుట్టుకొచ్చాయి. బీజేపీ వైపు వెళుతున్నారంటూ కొన్ని మీడియాలు, ప్రజా కూటమి వైపు అంటూ మరికొన్ని మీడియాలు కోడై కూసినా, డీఎంకే అధినేత కరుణానిధి మాత్రం పొత్తు విషయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆశావహుల ఇంటర్వ్యూల మీదే తన దృష్టిని అంతా పెట్టారు. ఈ పర్వం సోమవారం పొద్దు పోయే వరకు సాగింది. 4,433 మందిని గత నెల 22వ తేదీ నుంచి కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఇంటర్వ్యూలు చేయడం విశేషం.
ఇక, చివరగా కరుణానిధి ఇంటర్వ్యూకు స్టాలిన్ సైతం హాజరు కాక తప్పలేదు. కొళత్తూరు బరిలో మళ్లీ ఆయన నిలబడాలంటూ దరఖాస్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. దీంతో ఆ స్థానం తనదేనని సీటును రిజర్వు చేసుకుంటూ ఇంటర్వ్యూకు దళపతి స్టాలిన్ సైతం హాజరు కాక తప్పలేదు. కరుణానిధి సంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సైతం ఇచ్చారు. ఈ దరఖాస్తుల పర్వం ముగియడంతో మంగళవారం మీడియా ముందుకు వచ్చిన కరుణానిధి ఊహాజనిత కథనాలకు ముగింపు పలికే విధంగా వ్యాఖ్యల్ని , సామెతల్ని సంధించారు.
కెప్టెన్ మా వెంటే : అన్నా అరివాలయంలో పొత్తు వ్యవహారాలపై కరుణానిధి స్పందించారు. డి ఎంకే కూటమిలోకి డిఎండికే వస్తుందా..? అని ప్రశ్నించగా, పండు పక్వానికి వచ్చిందని, ఇక పాలల్లో పడాల్సిందేనని సామెతను వళ్లించారు. పొత్తు వ్యవహారాల్లో జాప్యం ఏమిటో..? అని ప్రశ్నించగా, జాప్యం ఏమీ లేదు, ఇతర వివరాలు చెప్పలేను అంటూ దాట వేశారు. విజయకాంత్ వస్తారన్న నమ్మకం ఉందా..? అని ప్రశ్నించగా, తప్పకుండా వస్తారని వ్యాఖ్యానించడం విశేషం. డీఎంకే మేనిఫెస్టో సిద్ధమా..? అని ప్రశ్నించగా, రెండు మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నామన్నారు. ఇతర పార్టీల్ని కూటమిలోకి ఆహ్వానిస్తున్నారా..? అని ప్రశ్నించగా, ఇతరులెవ్వరినీ ఆహ్వానించ లేదు, ఆహ్వానించబోమని వ్యాఖ్యానించారు. ఇక, విజయకాంత్ తమ వెంటనే అన్నట్టుగా కరుణానిధి స్పందించడంతో కమలం వర్గాలు, ప్రజా కూటమి వర్గాలకు షాక్ తగిలినట్టు అయ్యాయి. ఇక, విజయకాంత్ చేజారినట్టేనా..అన్న భావనలో ఆ రెండు వర్గాలు పడ్డాయి.