అసెంబ్లీ ఎన్నికల్లో మెగా కూటమి లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ కూటమికి జైకొట్టే రీతిలో డీఎంకే వర్గాలకు డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత సంకేతాన్ని పంపించినట్టు తెలిసింది. కరుణ నేతృత్వానికి ఓకే అని, స్టాలిన్ అంటే ఆలోచించాల్సి ఉంటుందన్న ఆమె సంకేతం డీఎంకే వర్గాలను ఆలోచనలో పడేసినట్టు సమాచారం.
సాక్షి, చెన్నై:డీఎండీకే ఆవిర్భావం కాలం నుంచి డీఎంకేకు వ్యతిరేకంగా విజయకాంత్ వ్యవహరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో దోస్తీ కట్టి, డీఎంకే ప్రభుత్వ పతనమే లక్ష్యంగా శ్రమించారు. ఆ ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే ఛీదరించుకోవడంతో ఒంటరిగా మిగిలా రు. పార్టీ ఎమ్మెల్యేలు పలువురు రెబల్ అవతా రం ఎత్తినా, సీనియర్లు టాటా చెప్పినా విజయకాంత్ ఏమాత్రం తగ్గలేదు. లోక్ సభ ఎన్నికల్లో వినూత్న పంథాను అనుసరించారు. రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా జాతీయ పార్టీ(బీజేపీ) కూటమితో జతకట్టారు. ఈ ఎన్నికల అనంతరం బీజేపీ తమను పక్కన పెట్టడం విజయకాంత్‌ను జీర్ణించుకోలేకపోయారు. అన్నాడీఎంకే, బీజేపీ రూపంలో ఎదురైన అవమానాలతో అసెంబ్లీ ఎన్నికల్లో తన సత్తాను చాటుకునేందుకు రెడీ అయ్యారు.
పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపే విధంగా ఁమీతో నేనురూ. కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల సింగపూర్ వెళ్లి, శస్త్ర చికిత్సను చేయించుకొచ్చిన విజయకాంత్ ఇంటి వద్ద నుంచి పార్టీ కార్యక్రమాలను, ప్రకటనలను విడుదల చేస్తూ, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై విమర్శలు, ఆరోపణలు గుప్పించే పనిలో పడ్డారు. పిలుపు: అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమయ్యే విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకుంటూ వస్తున్న విజయకాంత్ పొత్తుల విషయంలో ఇది వరకు చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలకు రెడీ అయ్యారు. తాను దూషిస్తున్నా, తనను అక్కున చేర్చుకునేందుకు పదేపదే డీఎంకే ప్రయత్నాలు చేస్తుండడంతో ఈ సారి ఎన్నికల్లో ఆ కూటమి వైపు చూడ్డానికి విజయకాంత్ సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఎన్నికల సమయంలో పొత్తులు ప్రకటించుకోకుండా, ముందుగానే నిర్ణయాలు తీసుకుని, కలసిమెలసి పనిచేయడం లక్ష్యంగా కసరత్తుల్లో నిమగ్నమై ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అందుకే శనివారం పార్టీ సమావేశానికి ఆయన పిలుపునిచ్చినట్టు చెబుతున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల పొత్తులపై పార్టీ నాయకుల అభిప్రాయాలను తీసుకుని ముందుకు సాగేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకోవటం గమనార్హం.చర్చలు : పొత్తుకు రెడీ అయిన విజయకాంత్ కసరత్తుల్లో బిజీ బిజీగా ఉంటే, తాము డీఎంకే వైపు చూస్తున్నామన్న సంకేతాన్ని ఆయన సతీమని ప్రేమలత పేర్కొనడం ఆలోచించాల్సిందే. ఇటీవల డీఎంకే నాయకులు పలువురు పరామర్శ పేరిట విజయకాంత్ ఇంటికి వెళ్లారు. వారితో రాజకీయ అంశాలపై విజయకాంత్ చర్చలు సాగించినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సమయంలో జోక్యం చేసుకున్న ప్రేమలత డీఎంకే అధినేత కరుణ నేతృత్వానికి ఓకే అని, స్టాలిన్ నేతృత్వం అంటే ఆలోచించాల్సి ఉంటుందని పేర్కొనడం వెలుగులోకి రావడంతో చర్చ బయలు దేరింది. డీఎంకేలో స్టాలిన్ నేతృత్వానికి ఆయన మద్దతుదారులు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. దీన్ని కరుణానిధి వ్యతిరేకిస్తూ, పార్టీ వర్గాల నోళ్లు మూయించే పనిలో పడ్డారు. మెగా కూటమికి అడ్డంకులు సృష్టించే యత్నం చేయొద్దని పార్టీ వర్గాలకు హితవు పలికారు. ఈ పరిస్థితుల్లో ప్రేమలత విజయకాంత్ ఇచ్చిన సంకేతాన్ని డీఎంకే వర్గాలు ఆహ్వానిస్తున్నా, స్టాలిన్ మద్దతుదారులు మాత్రం గుర్రు మంటున్నారు. అసెంబ్లీ ఎన్నికలో మెగా కూటమికి కరుణానిధి నేతృత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా, ఆయన గొడుగు నీడన ఎన్నికలు ఎదుర్కొనే రీతిలో పార్టీ సమావేశంలో విజయకాంత్ నిర్ణయం తీసుకుంటారా..? లేదా, ఒంటరి..ఒంటరి అంటూ చివరికి పొత్తుకు రెడీ అనే పాత పల్లవిని ఆయన అందుకుంటారో .. అన్నది వేచి చూడాల్సిందే.
‘మెగా’చూపు
Published Sun, Aug 17 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement
Advertisement