పీఎం పదవైనా ఒకే !
అధికారం ఇచ్చినా సరే
సరైన సమయంలో నిర్ణయం
కూటమిపై విజయకాంత్ వ్యాఖ్య
సాక్షి, చెన్నై : గవర్నర్, సీఎం, ఇంకా చెప్పాలంటే, పీఎం పదవికి తానే అభ్యర్థి అని ఎంపిక చేసినా అందుకు ఒకే. అయితే, కూటమి ఎవరితో అన్నది మాత్రం ఇప్పట్లో చెప్పనని డీఎండీకే అధినేత విజయకాంత్ స్పష్టం చేశారు. మూడు సమావేశాల అనంతరం సరైన సమయంలో నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ రాజకీయం సాగుతూ వస్తున్న విషయం తెలిసిందే. తమతో అంటే తమతో దోస్తీ కట్టాలంటూ ఓ వైపు బీజేపీ, మరో వైపు డీఎంకే, ఇంకో వైపు ప్రజా కూటమి ఆహ్వానాలు పలికాయి. ఇక, కాంగ్రెస్ కూడా తమతో కలసి రావాలన్న ఆహ్వానం ఇచ్చింది.
ఇక, విజయకాంత్‌తో మంతనాల్లోనూ ఆయా పార్టీల వర్గాలు మునిగి ఉన్నారని చెప్పవచ్చు. అయితే, ఎవరికీ చిక్కకుండా విజయకాంత్ ఆచీతూచీ అడుగులు వేస్తున్నారు. అలాగే, పొత్తు విషయంగా మీడియా వద్ద నోరు జారకుండా జాగ్రత్త పడుతున్నారు. ఈ పొత్తుల ప్రయత్నాలు సాగుతున్న వేళ మీడియా ముందుకు విజయకాంత్ రాలేదని చెప్పవచ్చు. ఈ సమయంలో ఆదివారం ఆయన మీడియా ముందుకు వచ్చి ఏ పదవికి తనను ఎంపిక చేసినా సరే.. తాను మాత్రం ఒకే అంటూ తన దైన శైలిలో స్పందించడంతో పాటుగా, ఎవరితో పొత్తు అన్న విషయాన్ని మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నించినా గప్ చుప్ అంటూ ముందుకు సాగారు.
పీఎం అభ్యర్థిత్వానికీ ఒకే : డీఎండీకే తరపున ఆదివారం నగరంలోని అడయార్, తండయార్ పేట, పోరూర్, మధ్యకైలాశ్‌లలో రక్త దాన, వైద్య శిబిరాలు జరిగాయి. మధ్యకైలాశ్‌లో శిబిరాన్ని ప్రారంభించినానంతరం మీడియాతో విజయకాంత్ మాట్లాడారు. తనను కూటమిలోకి రావాలని ఆహ్వానిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అయితే, పొత్తు ఎవరితో అన్నది మాత్రం ఇప్పట్లో తేల్చనని స్పష్టం చేశారు. ముందుగా పార్టీ కార్యవర్గ సమావేశం, తదుపరి సర్వసభ్య సమావేశం, చివరగా మహానాడులో కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం ఉంటుందని వివరించారు.
పదే పదే గుచ్చిగుచ్చి ప్రశ్నలు సంధించినా, ఒక్కటే చెబుతున్నా, తన కార్యకర్తల్ని సంప్రదించకుండా నిర్ణయం మాత్రం తీసుకోనని స్పష్టం చేశారు. సీఎం అభ్యర్థిగా ఎంపిక చేస్తే, అని ప్రశ్న సంధించగా, గవర్నర్, సీఎం, పీఎం పదవికి తనను అభ్యర్థిగా ఎంపిక చేసినా ఒకే, అయితే, పొత్తు విషయంలో మాత్రం నోరు జారబోనని వ్యాఖ్యానించారు. అధికారంలో వాటా ఇస్తే అని ప్రశ్నించగా, వాటా ఎందుకు, ఏకంగా అధికారం ఇచ్చినా తీసుకునేందుకు తాను రెడీ అని, అయితే, పొత్తు ఎవరితో అన్నది ఆ మూడు సమావేశాల అనంతరం చెబుతానని సమాధానం ఇచ్చారు. అంత వరకు వేచి ఉంటే, ఉండండి, లేదా ఏదో మీకు తోచించి రాసుకోండటంటూ మీడియాకు ఉచిత సలహా ఇచ్చారు.
విమర్శతో చర్చ: జల్లికట్టు విషయంగా ప్రశ్నలు సంధించగా, డీఎంకే, బీజేపీల మీద పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం. పరోక్షంగా తాను ప్రజా కూటమికి విధేయుడిగా ఈ సమాధానం సాగడం విశేషం. కేబినెట్ మంత్రి జవదేకర్ అనుమతి ఇచ్చేస్తున్నారట.. సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హామీ ఇచ్చారట. దీనికి కట్టుబడి ఆయన దీక్షకు వాయిదా వేశారంటా..! అని విమర్శలు గుప్పించారు. డీఎండీకే ఓటు బ్యాంక్ తగ్గిందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని, అలాంటప్పుడు తన చుట్టూ ఎందుకు ఇంత చర్చ అని ఓ ప్రశ్నకు సమాధానంగా స్పందించారు.
అన్నాడీఎంకేకు సుమారు పార్లమెంట్, రాజ్యసభల్లో 49 లేదా 50 మంది వరకు సభ్యులు ఉండగా, వారి ద్వారా రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యమేనని మండి పడ్డారు. అన్నాడీఎంకే వాళ్లను, ఓపీఎస్‌ను( ఆర్థిక మంత్రి)ని అడగాల్సిన ప్రశ్నల్ని తనను అడుగుతున్నారంటూ సహాయ చర్యల మీద స్పందిస్తూ తీవ్రంగా మండి పడ్డారు. ఇదే ప్రశ్నలు వాళ్లకు సంధించే ధైర్యం ఉందా అంటూ ఏకంగా ఓ మీడియా ప్రతినిధిని ఉద్దేశించి తన దైన శైలిలో స్పందించారు. పోరూర్‌లోని శిబిరంలో రక్తదానం చేసినానంతరం మీడియాతో మాట్లాడిన ప్రేమలత విజయకాంత్ ఇప్పటికే విజయకాంత్ చెప్పారుగా, అదే విధంగా సరైన సమయంలో మంచి నిర్ణయం ఉంటుందని వ్యాఖ్యానించారు.