సీఎం పగ్గాలా...వాటానా..
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో మూడు కూటముల రాజకీయం ప్రస్తుతం డీఎండీకే అధినేత విజయకాంత్ చుట్టూ తిరుగుతున్నాయి. తమ వైపునకు అంటే, తమ వైపునకు రావాలంటూ డీఎంకే, ప్రజాకూటమి, బీజేపీలు బహిరంగంగానే పిలుపు నివ్వడంతో తమ అధినేత నిర్ణయం ఎటో...అన్న ఎదురు చూపుల్లో డీఎండీకే వర్గాలు పడ్డాయి. ఇక, రానున్న ఎన్నికలతో సీఎం పగ్గాలు చేపట్టే స్థాయికి తాను ఎదుగుతానా..? లేదా , అధికారాన్ని శాసించే స్థాయికి ఎదుగుతానా..? అన్న మల్లగుల్లాల్లో విజయకాంత్ ఉన్నట్టు సమాచారం. ‘ఒంటరి’నీ అంటూ రాజకీయాల్లోకి వచ్చిన విజయకాంత్ అదే బాటలో కొన్నేళ్లు పయనం సాగించారు. డీఎంకే పతనం లక్ష్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో దోస్తీ కట్టి తొలిసారిగా పొత్తుకు శ్రీకారం చుట్టారు.
ఆ ఎన్నికల ద్వారా ప్రధాన ప్రతి పక్ష నేతగా అవతరించిన విజయకాంత్ తన కంటూ కనీసంగా పది శాతం వరకు ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్నారని చెప్పవచ్చు. లోక్‌సభ ఎన్నికల్ని ఎన్‌డీఏతో కలసి ఎదుర్కొని డిపాజిట్లు గల్లంతు చేసుకున్నా, తన ఓటు బ్యాంక్ మాత్రం పదిలంగానే ఉంచుకున్నారు. ఇప్పుడు అదే ఓటు బ్యాంక్ ఆయన చుట్టూ ప్రతి పక్షాల రాజకీయం సాగేలా చేసి ఉన్నాయి. బీజేపీ, ప్రజా కూటమి వర్గాలు ఇప్పటికే ఆయనతో మంతనాల్లో మునిగారు. తమతో అంటే తమతో కలిసి నడవాలని, అవసరం అయితే, నేతృత్వం పగ్గాలు లేదా, సీఎం అభ్యర్థితత్వం అప్పగించే విధంగా సంప్రదింపులు సాగి ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సమయంలో డీఎంకే అధినేత ఎం కరుణానిధి సైతం విజయకాంత్‌కు స్వయంగా ఆహ్వానం పలకడం చర్చకు దారి తీసింది.
విజయకాంత్ కరుణానిధి పిలుపుపై ఇంత వరకు స్పందించ లేదని చెప్పవచ్చు. రాష్ట్ర రాజకీయం తన చుట్టూ తిరుగుతుండటంతో ఆచీ తూచీ అడుగులు వేయడానికి కెప్టెన్ సిద్ధమయ్యారు. ఇందుకు తగ్గ ఉపదేశాలను పార్టీ వర్గాలకు ఇచ్చి ఉన్నారు. అదే సమయంలో, బీజేపీ లేదా ప్రజా కూటమితో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్న పక్షంలో సీఎం కావాలన్న తన ఆశ నెర వేరుతుందా..? అన్న అంశాన్ని పరిగణించి, అందుకు తగ్గ రహస్య సర్వేకు సిద్ధ పడ్డట్టు సమాచారం. ఇక,డీఎంకే విషయంలో ప్రస్తుతం తాను అనుసరిస్తున్న బాణిని ఇలాగే కొనసాగించేందుకు నిర్ణయించి ఉన్నారు.
ఎన్నికల నాటి పరిస్థితుల మేరకు మనస్సు మార్చుకుని డీఎంకేతో అధికారంలో వాటాకు పట్టుబడితే ఎలా ఉంటుందో...? అన్న కోణంలోనూ ఈ కరుప్పు ఎంజీఆర్ ఆలోచనలో ఉన్నట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎంకేకు వ్యతిరేకంగా గత ఎన్నికల్లో వ్యవహరించి, ఇప్పుడు అదే పార్టీతో కలసి నడిచిన పక్షంలో ఎదురయ్యే నష్టాల్ని కూడా పరిగణలోకి తీసుకునే పనిలో ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తల నిర్ణయం మేరకు తన తుది నిర్ణయం ప్రకటించే విధంగా పయనంలో ఉన్న విజయకాంత్, ప్రజా కూటమికి ఎలాంటి హామీ ఇవ్వన్నట్టుగా, బీజేపీతో స్నేహ పూర్వక పలకరింపు మాత్రమే సాగినట్టుగా డీఎండీకే వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. ఇక, తమ ‘కెప్టెన్’ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ సారథిగా వ్యవహరించి కీలక నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు.