బహిష్కరణ!
Published Sat, Feb 1 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM
అసెంబ్లీ సమావేశాన్ని శనివారం డీఎంకే, డీఎండీకే, పీఎంకేలు బహిష్కరించాయి. సీఎం జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ గురించి మాట్లాడేందుకు సభలో అనుమతినిస్తారా? అంటూ స్పీకర్ ధనపాల్‌ను డీఎంకే శాసన సభా పక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు.
సాక్షి, చెన్నై :
అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. గురువారం రాష్ర్ట గవర్నర్ రోశయ్య ప్రసంగాన్ని డీఎంకే బహిష్కరించింది. శుక్రవారం వాగ్యుద్ధాల నడమ సభ రసాభాసగా సాగింది. శనివారం సమావేశం సజావుగా సాగినా, డీఎంకే, డీఎండీకే, పీఎంకేలు బహిష్కరించాయి. తొలి రోజు నుంచి పీఎంకే ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు. మహానాడు బిజీతో అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని డీఎండీకే ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం అసెం బ్లీకి డీఎంకే సభ్యులందరూ హాజరయ్యారు. ఉదయా న్నే స్టాలిన్ నేతృత్వంలో అందరూ సభ్యులు అసెంబ్లీ వద్దకు రావడంతో సభ వాడీవేడిగా సాగడం ఖాయం అని సర్వత్రా ఎదురు చూశారు. అయితే, అసెంబ్లీ సమావేశ మందిరంలోకి అడుగు పెట్టకుండానే డీఎంకే సభ్యులు బయటకు వచ్చేశారు. తాము అసెంబ్లీని బహిష్కరించామని, సోమవారం కూడా ఇదే పంథాను అనుసరించనున్నామని ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంకే స్టాలిన్ స్పీకర్ ధనపాల్‌కు సవాల్ చేస్తూ ప్రశ్నలు సంధించారు.
జయ,శశిపై చర్చకు అవకాశం ఇస్తారా?
అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విరుచుకుపడ్డారు. శుక్రవారం నాటి సమావేశంలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే మార్కండేయన్ తన ప్రసంగంలో డీఎంకేపై, తమ అధినేత కరుణానిధిపై విరుచుకు పడ్డారని గుర్తు చేశారు. ఆ వ్యాఖ్యలను అసెంబ్లీ రికార్డుల నుంచి తొలగించాలని తాము పట్టుబట్టినా, స్పీకర్ ఖాతరు చేయలేదని ధ్వజమెత్తారు. తమను తిట్టి పోయడానికి మాత్రం స్పీకర్ అనుమతులు ఇచ్చేస్తారని, అదే ప్రజా సమస్యలపై మాట్లాడే ప్రతి పక్షాల గళాన్ని మాత్రం నొక్కేస్తారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు మాట్లాడితే గొం తు నొక్కేస్తున్నారుగా! అందువలన ఇతర అంశాలపై మాట్లాడేందుకు తాము సిద్ధంగా నే ఉన్నామన్నారు. ఇందుకు అనుమతి ఇస్తారా? అని స్పీకర్ ధనపాల్‌ను సవాల్ చేస్తూ నాలుగు ప్రశ్నలు సంధించారు.
ప్రశ్నలు:
తమ పార్టీ, తమ నేత గురించి మాట్లాడేందుకు అవకాశం ఇచ్చి నప్పుడు, సీఎం జయలలిత, ఆమె నెచ్చిలి శశికళ గురించి చర్చించేందుకు అవకాశం ఇస్తారా?
శశికళ, వారి బంధువుల వల్ల తనకు ప్రాణహాని ఉందని సీఎం జయలలిత ఇది వరకు పేర్కొన్నారని, శశికళను పోయెస్ గార్డెన్ నుంచి గెంటేసిన విషయం అని గుర్తు చేశారు. ఇప్పుడు ఆమెను మళ్లీ పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కించారు. దీనిపై మాట్లాడుకునే అవకాశం ఇస్తారా?
ఓ మీడియాతో ఇది వరకు మాట్లాడిన సీఎం జయలలిత, తెలుగు నటుడు శోభన్ బాబు గురించిన ప్రస్తావన తెచ్చారని గుర్తు చేస్తూ... దీనిపై చర్చించుకునేందుకు అవకాశం ఇస్తారా?
ఎంజీయార్‌కు వ్యతిరేకంగా అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీకి జయలలిత ఓ లేఖ రాశారని గుర్తు చేశారు. ఎంజీయార్ మృతికి కారణం ఆయన సతీమణి అంటూ గతంలో పేర్కొన్నారని, వీటిపై అసెంబ్లీ వేదికగా మాట్లాడుకుందామా? చెప్పండి అంటూ స్పీకర్‌కు సవాల్ విసిరారు. పుదియ తమిళగం, మనిదనేయ మక్కల్ కట్చి ఎమ్మెల్యే సైతం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు.
Advertisement
Advertisement