ఆర్కేనగర్‌లో పోటీకి అన్ని పార్టీలూ దూరమేనని సోమవారం తేటతెల్లమైంది. తమ అభ్యర్థిని పోటీకి పెట్టడంలేదని భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, డీఎండీకే అధికారికంగా ప్రకటించాయి. అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత, సీపీఐ అభ్యర్థి మహేంద్రన్ మధ్యనే ప్రధానపోటీ నెలకొంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి:శాసనసభ సభ్యత్వం లేకుండానే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జయలలిత ఆరు నెలల్లోగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాల్సి ఉంది. అన్నాడీఎంకేకు పెట్టనికోట, చెన్నై కార్పొరేషన్ పరిధిలో ఉండడం వంటి కారణాలతో ఆర్కేనగర్ నుంచి పోటీచేయాలని ఆమె నిశ్చయించుకున్నారు. అమ్మ ఆదేశాల మేరకు ఆర్కేనగర్ ఎమ్మెల్యే వెట్రివేల్ రాజీనామా చేయగా ఉప ఎన్నిక భేరీ మోగింది. 2011లో ప్రభుత్వాన్ని చేపట్టడం, 2014లో వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో సైతం అన్నాడీఎంకే జైత్రయాత్ర కొనసాగడం, గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అమ్మ హవా తగ్గకపోవడం విపక్షాలకు మింగుడుపడడం లేదు. ఈ పరిస్థితిలో ఆర్కేనగర్ ఉప ఎన్నికలో పోటీచేయడంపై అన్ని పార్టీలూ ఆలోచనలో పడ్డాయి.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయ జైలుశిక్షకు గురైన కారణంగా ఖాళీ అయిన శ్రీరంగం నియోజకవర్గంలో విపక్షాలు పోటీచేసి అన్నాడీఎంకే చేతిలో బొక్కబోర్లాపడ్డాయి. ప్రస్తుతం ఆర్కేనగర్‌లో పోటీకి దిగినా శ్రీరంగం ఫలితాలు పునరావృతమవుతాని విపక్షాలు జంకాయి. ఆర్కేనగర్‌లో అమ్మపై పోటీకి దిగి ఓటమితో అప్రతిష్టను మూటగట్టుకోవడం మినహా మరే ప్రయోజనం ఉండదని పసిగట్టిన డీఎంకే పోటీచేయడం లేదని అన్నిపార్టీల కంటే ముందుగానే ప్రకటించేసింది. ఆ తరువాత వరుసగా పీఎంకే, ఎండీఎంకేలు పోటీకి దూరమని చెప్పుకున్నాయి. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు నెలరోజులుగా మల్లగుల్లాలు పడ్డాయి. కూటమి భాగస్వామైన డీఎండీకేపై ఆశలు పెంచుకున్న బీజేపీకి నిరాశే మిగిలింది.
ఈసీ వల్లే పోటీకి దూరం
నామినేషన్ గడువు మరో 24 గంటల్లో (10వ తేదీ) ముగుస్తుండగా మూడు పార్టీలూ నోరివిప్పాయి. ఆర్కేనగర్‌లో పోటీ పెట్టడం లేదని కాంగ్రెస్, బీజేపీ, డీఎండీకే సోమవారం అధికారికంగా ప్రకటించాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నందున, పారదర్శకంగా ఎన్నికలు జరిగే అవకాశం లేనందునే పోటీ కి దిగడం లేదనే ఒకేమాటను మూడుపార్టీలూ చెబుతున్నాయి. రాష్ట్రంలో జరిగిన ప్రతి ఉప ఎన్నికల్లోనూ అధికార పార్టీలే గెలవడం పరిపాటిగా మారిపోయిందని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ అన్నారు. ఓటుకు నోటును అరికట్టితే పోటీకి సిద్ధమని తాను బహిరంగంగా ప్రకటించినా ఈసీ నుంచి స్పందన లేదని ఆయన అన్నారు. ఆర్కేనగర్‌లో పోటీచేయడంలేదని ఆయన వివరించారు. తటస్థంగా వ్యవహరించాల్సిన ఈసీ అధికారపార్టీ వైపు మొగ్గుచూపుతున్నందునే పోటీకి దూరమైనట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలూ పోటీ పెట్టడం లేదని ప్రకటిస్తే ఎందుకని ఎవ్వరూ ప్రకటించలేదు, తనను మాత్రం పదే పదే నిలదీస్తున్నారని డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్ నొచ్చుకున్నారు. అమ్మకు భయపడి ఆర్కేనగర్‌లో పోటీచేయడం లేదని కొందరు చేస్తున్న ప్రచారాన్ని విజయకాంత్ తీవ్రంగా ఖండిచారు. ఈసీపై నమ్మకం లేకనే పోటీ పెట్టడం లేదని వ్యాఖ్యానించారు.
అన్నాడీఎంకే వర్సెస్ సీపీఐ
అన్ని ప్రధానపార్టీలు పోటీ పెట్టడం లేదని స్పష్టం చేయడంతో అన్నాడీఎంకేకు సీపీఐ ప్రధాన ప్రత్యర్థి పార్టీగా మారింది. సీపీఐ అభ్యర్థిగా మహేంద్రన్ పోటీచేస్తుండగా, సీపీఎం మద్దతునివ్వనుంది. సోమవారం స్వతంత్య్ర అభ్యర్థులుగా మరో ఐదుగురు నామినేషన్ వేశారు.
అన్నాడీఎంకే + సీపీఐ
Published Tue, Jun 9 2015 2:18 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM
Advertisement