‘మెగా’ సాధ్యమే!
రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలో మెగా కూటమి ఆవిర్భావం సాధ్యమేనని ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా గురువారం మహాబలి పురం వేదికగా మూడు పార్టీల అగ్ర నేతలు ఒకే వేదిక మీదకు రానుండడంతో రాజకీయ పరిణామాలు ఏ మలుపులు తిరగనున్నాయో..! అన్న చర్చ బయలు దేరింది.
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మెగా కూటమి ఏర్పాటు లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి పావులు కదుపుతున్నారు. డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలను తమ వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచనల్లో నిమగ్నమయ్యారు. అయితే, ఆయా పార్టీల మనోగతాలు మాత్రం అంతు చిక్కడం లేదు. ఏ క్షణాన ఏ పార్టీ ఎవరికి మద్దతుగా వ్యాఖ్యానిస్తారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఓ తమిళ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మెగా కూటమి సాధ్యమే అన్న భావనను కలిగించాయి.
ఎద్దేవా: రాష్ట్రంలో డీఎంకే , అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చంకలు గుద్దుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఆ ఇంటర్వ్యూలో స్టాలిన్ విమర్శలు గుప్పించారు. గతంలో తమతో కలిసి ఎన్నికల్ని ఎదుర్కొన్నప్పుడే నాలుగు స్థానాలకు పరిమితమైన బీజేపీ, తాజాగా అధికార పగ్గాలు చేపట్టే స్థాయికి రాష్ట్రంలో ఎదుగుతుందనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తమిళనాడులో బీజేపీ బలోపేతం సాధ్యం కాని పనిగా పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోసుకున్నా, వెలుపల మాత్రం అందరు ఎంపీలు స్నేహ పూర్వకంగానే ఉంటారన్నారు. అయితే, అలాంటి పరిస్థితి తమిళనాడు అసెంబ్లీలో లేదని, స్నేహ పూర్వక వాతావరణం లక్ష్యంగా డీఎంకే ప్రయత్నిస్తోందని చెప్పారు. అళగిరి పార్టీలో లేనందున ఆయన గురించి తానేమీ మాట్లాడబోనంటూ దాట వేశారు.
ఎండీఎంకే నేత వైగోతో తనకు ఎలాంటి విబేధాలు లేవని, స్నేహ పూర్వకంగా తాము మెలుగుతామన్నారు. ఇటీవల అసెంబ్లీలో డీఎండీకేకు ఇబ్బందులు తలెత్తినప్పుడు తాము అండగా నిలిచామని, అదే విధంగా తమకు ఇబ్బందుల్ని అధికార పక్షం కల్పించినప్పుడు వాళ్లు అండగా నిలిచారని గుర్తు చేస్తూ, ఇలాంటి స్నేహ పూర్వక వాతావరణం అసెంబ్లీలో మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ట్రంలో మెగా కూటమి సాధ్యం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. డీఎండీకే, పీఎంకే, ఎండీఎంకే, డీఎంకేలు కలసికట్టుగా మెగా కూటమి ఏర్పాటుకు ఆమోదిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకే వేదిక మీదకు : మెగా కూటమి సాధ్యమే అన్నట్టుగా స్టాలిన్ వ్యాఖ్యానించడం ఓ వైపు చర్చకు దారి తీస్తే, ఇందుకు అనుకూలించే పరిస్థితులు మరో రెండు రోజు ల్లో రానున్నాయి. మహాబలి పురం వేదికగా గురువా రం పీఎంకే అధినేత రాందాసు మనవడు, మనవరాలి వివాహం జరగనుంది. ఇందుకు కరుణానిధి నేతృత్వం వహించబోతున్నారు. ఈ వేడుకకు ఎండీఎంకే నేత వైగో సైతం హాజరయ్యేందుకు నిర్ణయించారు. ఈ దృష్ట్యా, మూడు పార్టీల అగ్ర నేతలు ఒకే వేదిక మీద ప్రత్యక్షం కాబోతోండటం గమనార్హం. అదే సమయం లో డీఎండీకే నేత విజయకాంత్ సైతం ఈ కల్యాణ వేడుకకు హాజరయ్యే అవకాశాలున్నా, ఆయన వేదిక ఎక్కేనా అన్నది వేచి చూడాల్సిందే. ఇప్పటికే రాందా సు, వైగోను తమ వైపు తిప్పుకునే విధంగా డీఎంకే వర్గాలు వ్యాఖ్యలు చేశారుు.
ఈ వేదిక మీద ఏ మేరకు పొగడ్తల వర్షం కురిసి మెగా కూటమికి దారి తీస్తాయోనన్న ఎదురు చూపులు పెరిగాయి. ఇప్పటికే బీజేపీ అధిష్టానం మీద వైగో, రాందాసు గుర్రుగా ఉన్నారు. ఆ పార్టీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన విందుకు సైతం దూరంగానే ఉన్నారు. విజయకాంత్ సైతం ఈ విందు కు దూరంగా ఉన్నా, తరచూ మోదీ జపం అందుకోవడం ఆయన మదిలో నిర్ణయం ఏమిటోనన్నది అంతు చిక్కడం లేదు. ఈ కల్యాణ వేదికను అస్త్రంగా చేసుకుని ఁమెగారూ.మార్గాన్ని సుగమం చేసుకునేందుకు డీఎంకే అధినేత కరుణానిధి తన రాజతంత్రాన్ని ప్రయోగించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.