సీఎం అభ్యర్థుల హడావుడి
ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తాలు
పీఎంకే, సంక్షేమ కూటమి నేతల సందడి
సాక్షి ప్రతినిధి,చెన్నై: వెనుకటికి ఒకడు పెళ్లి కాకుండానే బిడ్డకు పేరు ఖరారు చేసుకున్నాడట. దీంతో ఇరుగు పొరుగు వెక్కిరింపులు, వ్యాఖ్యానాల నుంచి ‘అలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు’ అనే సామెత పుట్టుకొచ్చింది. ముఖ్యమంత్రి అభ్యర్థులుగా పోటీచేస్తున్న నేతల తీరు ఆ సామెతకు అచ్చుగుద్దినట్లు సరిపోతోంది. అసెంబ్లీకి పంచముఖ పోటీ సాగుతుండగా, ముఖ్యమంత్రి అభ్యర్థులుగా నలుగురు రంగంలో ఉన్నారు. సీఎం అభ్యర్థిగా బీజేపీ ఎవ్వరినీ ప్రకటించలేదు. అన్నాడీఎంకే గెలిస్తే జయలలిత, డీఎంకే గెలిస్తే కరుణానిధి ముఖ్యమంత్రి అని ఇట్టే చెప్పేయవచ్చు. ఇక మిగిలిన ఇద్దరు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరంటే ప్రజా సంక్షేమ కూటమి అభ్యర్థి విజయకాంత్, పీఎంకే అభ్యర్థి అన్బుమణి రాందాస్.
నలుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులకు ఎవరి అంచనాలు వారికున్నాయి. తాము అధికారంలోకి వచ్చేది ఖాయమని గట్టిగా విశ్వసిస్తున్నాయి. ఎన్నికల్లో తామే డీలాపడితే ఓటర్లు ఇట్టే గ్రహిస్తారని, అనుకున్న ఓట్లు కూడా పక్కదారి పడతాయని అభ్యర్థులు మేకపోతు గాంభీర్యాన్ని కనబరుస్తారు. ‘అరసియల్ల ఇదెల్లాం సహజమప్పా’(రాజకీయాల్లో ఇదంతా సహజమయ్యా) అనుకోవడం కూడా కద్దు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి అభ్యర్థులు మరికొంత ముందడుగు వేసి పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏకంగా ముహూర్తాలనే పెట్టేసుకున్నారు. రెండురోజుల క్రితం పీఎంకే అధినేత డాక్టర్ రాందాస్ ఆదివారం నాటి ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ తన కుమారుడు, సీఎం అభ్యర్థి అన్బుమణిని అధికారం చేపట్టాల్సిందిగా మే 20వ తేదీన గవర్నర్ పిలుస్తాడని చెప్పుకొచ్చారు.
ఆ తరువాత అధికారం చేపట్టబోతున్నామని నిర్దారణగా తెలియజేశారు. ఇదిలా ఉండగా డీఎండీకే అధ్యక్షులు, ప్రజా సంక్షేమ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి విజయకాంత్ సైతం ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్నారు. సోమవారం మదురైలో జరిగిన ప్రచార సభలో ప్రసంగిస్తూ తనను చూడగానే అందరూ ముఖ్యమంత్రి స్వాగతం సుస్వాగతం అంటున్నారు, వారు చెబుతున్నది నిజమే, వచ్చేనెల 19వ తేదీన మదురైలోనే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. మదురైలో కూడా కార్యకర్తలపై విజయకాంత్ చేయిచేసుకునేలా వ్యవహరించారు. అవును నాకు కోపం ఎక్కువ, కోపం వచ్చే తీరుతుంది, ఎందుకంటే నేను మదురై వాడిని అంటూ సమర్థించుకున్నారు.
అలూ లేదు చూలూలేదు,..
Published Wed, Apr 27 2016 2:04 AM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM
Advertisement
Advertisement