‘మెగా’ మద్దతు
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నాటికి డీఎంకే మెగా కూటమికి మద్దతు పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే డీఎండీకే, ఎండీఎంకేలు పరోక్షంగా ఆ కూటమికి మద్దతుగా వ్యాఖ్యలు చేయగా, అదే పల్లవిని బుధవారం పీఎంకే అధినేత రాందాసు అందుకున్నారు. హఠాత్తుగా గోపాలపురంలో రాందాసు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. మనవడు, మనవరాలి పెళ్లి వేడుకకు ఆహ్వానం పలికామేగానీ, రాజకీయ చర్చ లేదంటూనే రాజకీయ నాగరికత తెలిసిన నేత కరుణానిధి అంటూ ప్రశంసల కితాబు ఇవ్వడం గమనార్హం.
2016 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి పావులు కదుపుతున్నారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీల్ని కలుపుకోవడం లక్ష్యంగా వ్యూహరచనల్లో పడ్డారు. తానే తదుపరి కూడా డీఎంకే కూటమి సీఎం అభ్యర్థినంటూ ప్రకటించుకుని ప్రతి పక్షాల దృష్టిని తన వైపు మళ్లించే యత్నంలో పడ్డారు. డీఎంకేలో నెలకొన్న వివాదాల్ని ఓవైపు పరిష్కరిస్తూనే, మరో వైపు మెగా కూటమి లక్ష్యంగా కుస్తీలు పడుతున్నారు. తదుపరి సీఎం అభ్యర్థి కరుణానిధి అన్న ప్రకటన వెలువడడంతో డీఎండీకే, ఎండీఎంకేలు పరోక్షంగా మద్దతు వ్యాఖ్యలు చేశాయి. అన్నాడీఎంకేకు అధికారం దూరం చేయడం లక్ష్యంగా ప్రతి పక్షాలన్నీ మళ్లీ డీఎంకే పక్షాన నిలబడే విధంగా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం హఠాత్తుగా పీఎంకే అధినేత రాందాసు గోపాలపురంలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. తమ నేతృత్వంలోనే కూటమి, తదుపరి తామే అధికార పగ్గాలు చేపడతామంటూ ప్రగల్బాలు పలుకుతూ వచ్చిన రాందాసు డీఎంకే అధినేత కరుణానిధితో భేటీ కావడంతో ఆంతర్యాన్ని కనిపెట్టే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి.
పెళ్లికి రండి: పీఎంకే అధినేత రాందాసు తనయుడు, కుమార్తె అన్భుమణి, శాంతిలు వియ్యంకులు కాబోతున్నారు. అన్భుమణి కుమార్తె సంయుక్తను శాంతి కుమారుడు ప్రీతీవన్‌కు ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. వీరి వివాహం అక్టోబరు 30న మహాబలి పురం వేదికగా జరగనున్నది. ఈ వివాహం ఆహ్వాన పత్రికతో ఉదయాన్నే గోపాలపురంలో తన సతీమణి సరస్వతితో కలసి రాందాసు ప్రత్యక్షం అయ్యారు. రాందాసును సాదరంగా కరుణానిధి ఆహ్వానించారు. ఇద్దరు కుశల ప్రశ్నలతో ఇరవై ఐదు నిమిషాలు మాటా మంతిలో మునిగారు. ఈ సమాచారంతో మీడియా అక్కడికి పరుగులు తీసింది. వెలుపలకు వచ్చి రాగానే, మీడియా వద్దకు వచ్చిన రాందాసును ఁపెళ్లికి రండిరూ. అంటూ ఆహ్వానం పలికారు.
ప్రశంసలు: తన మనవడు, మనవరాలి వివాహానికి కరుణానిధి కుటుంబాన్ని ఆహ్వానించామన్నారు. తమ ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు కరుణానిధి హాజరయ్యారని, ఈ వేడుకకు కూడా హాజరు కానున్నారని తెలిపారు. ఉత్తరాధిలో రాజకీయ నాగరికత తెలిసిన నాయకులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. అయితే, దక్షిణాదిలో రాజకీయ నాగరికత తెలిసిన ఒకే ఒక్క నాయకుడు కరుణానిధి మాత్రమేనని కితాబు ఇచ్చారు. తమ మధ్య రాజకీయ సంబంధింత చర్చలు సాగలేదని, ఆ ప్రస్తావనే రాలేదని పేర్కొంటూనే, కరుణానిధిని ప్రశంసలతో ముంచెత్తడం గమనార్హం. రాజకీయ నాగరికత వికసించాలన్నదే కరుణానిధి తపన అని, ఇది వికసించాలని తాను కోరుకుంటున్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ ఆరంభమయ్యింది. డిఎంకే మెగా కూటమి వైపుగా పీఎంకే సైతం చూస్తున్నట్టుగా ప్రచారం ఊపందుకుంటోంది.