Ram Dass
-
అవినీతికి యావజ్జీవ శిక్ష
రాష్ట్రంలో అవినీతికి పాల్పడే అధికారులకు యావజ్జీవ శిక్ష విధించాల్సిన అవసరం ఉందని పీఎంకే డిమాండ్ చేసింది. అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించే కొత్త పథకాలను రూపొందిం చాలని సూచించింది. సోమవారం పీఎంకే మాదిరి బడ్జెట్ను ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు విడుదల చేశారు. సాక్షి, చెన్నై: ప్రతి ఏటా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా కొన్ని సూచనలు, డిమాండ్లతో కూడిన మాదిరి బడ్జెట్ను పీఎంకే విడుదల చేస్తుంది. అయితే, 2016 అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికారం చేపట్టి తీరుతామన్న ధీమాతో ముందుకు వెళ్తున్న పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఈ ఏడాది సరికొత్త నినాదాల్ని తెర మీదకు తెస్తూ తమ పార్టీ నేతృత్వంలో మాదిరి బడ్జెట్ను సిద్ధం చేశారు. ప్రభుత్వం దృష్టికి దీనిని తీసుకెళ్లడంతో పాటుగా ప్రజల్ని ఆలోచింప చేసే విధంగా, వారికి దగ్గరయ్యే రీతిలో ఈ బడ్జెట్లో అంశాలను పొందు పరచడం విశేషం. ఈ బడ్జెట్లో నాలుగా ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుని సరికొత్త నినాదాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. చెన్నైలో ఈ మాదిరి బడ్జెట్ను రాందాసు, ఆ పార్టీ అధ్యక్షుడు జికే మణి, నాయకుడు ఏకే మూర్తి విడుదల చేశారు. ఇందులో రాష్ట్రంలో సాగుతున్న అవినీతిని ఎత్తి చూపుతూ, అవినీతి నిర్మూలన లక్ష్యంగా కొన్ని అంశాలను ప్రభుత్వం ముందు ఉంచే యత్నం చేశారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా 12 సూత్రాలను విడుదల చేశారు. ఇందులో ప్రధానమైనది అవినీతికి పాల్పడే అధికారికి యావజ్జీవ శిక్ష విధించే విధంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒక్కో శాఖలో ఒక్కో ప్రత్యేక ఉన్నతాధికారిని నియమించడం, ఆ శాఖలో అవినీతి దొర్లి న పక్షంలో అందుకు ఆ అధికారి బాధ్యుడు అవుతాడన్న హెచ్చరికతో చట్టాన్ని కఠినం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏడాదికా ఏడాది అప్పుల ఊబిలో కూరుకు పోతున్న దృష్ట్యా, అప్పుల బారి నుంచి బయట పడే రీతిలో కొత్త పథకాలతో ప్రజ ల్ని దరి చేరే విధంగా ముందుకు సాగాలని వివరించారు. మహిళలు, బాలికలపై సాగుతున్న లైంగిక దాడులకు అడ్డుకట్ట లక్ష్యంగా ప్రత్యేక విభాగం ఏర్పాటుకు డిమాండ్ చేశారు. మహిళా ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఆ విభాగం ఏర్పాటు కావాలని, అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని సూచించారు. అన్నదాతల జీవితాల్లో వెలుగు నింపే రీతిలో ఎరువులు, విత్తనాలు, ఉచితంగా అందించాలని సూచించారు. మేఘదాతులో కర్ణాటక డ్యాముల కుట్రను భగ్నం చేయడం లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడికి సన్నద్ధం కావాలని డిమాండ్ చేశారు. ముల్లై పెరియార్ డ్యాం నీటిని 152 అడుగులకు చేర్చడం, జాతీయ రహదారుల్లో టోల్ ట్యాక్స్ 60 శాతం మేరకు తగ్గించడం లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. రాష్ర్టంలో అన్ని తరగతుల్లో తమిళం తప్పని సరి చేస్తూ, దశల వారీగా ఉన్నత విద్య, పరిశోధనా రంగాల్లోనూ తమిళానికి చోటు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఐదేళ్లలో అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందే విధంగా తాగు నీటి హక్కు చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. తమ మాదిరి బడ్జెట్లో పేర్కొన్న అంశాలను ప్రభుత్వం పరిగణించాలని, లేని పక్షంలో తాము అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలై తీరుతాయని స్పష్టం చేశారు. -
‘కరుణ’కు వైగో షాక్
సాక్షి, చెన్నై:డీఎంకే అధినేత ఎం.కరుణానిధికి ఎండీఎంకే నేత వైగో షాక్ ఇచ్చారు. కరుణ ఆహ్వానాన్ని తిరస్కరించిన వైగో, డీఎంకే కూట మిలో చేరబోనని, తనకు అలాంటి ఆలోచనే లేదని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కరుణానిధి పావులు కదుపుతున్నారు. తన నేతృత్వంలో మెగా కూటమి కసరత్తుల్లో మునిగారు. ఎండీఎంకే, డీఎండీకే, పీఎంకేలను తన వైపు తిప్పుకునేందుకు వ్యూహ రచనలో పడ్డారు.రెండు రోజుల క్రితం మహాబలి పురం వేదికగా జరిగిన పీఎంకే అధినేత రాందాసు ఇంట శుభకార్యాన్ని కరుణానిధి తనకు అనుకూలంగా మలుచుకునే యత్నం చేశారు. ఈ వేడుకలో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే అధినేత వైగోలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవడం, ఇద్దరూ కలిసి మరుసటి రోజు ఒకే విమానంలో మదురైకు వెళ్లడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఎండీఎంకే వస్తే ఆహ్వానించేందుకు తాను సిద్ధం అని కరుణానిధి సైతం ప్రకటించారు. దీంతో త్వరలో కరుణ నివాసం మెట్లు ఎక్కేందుకు వైగో సిద్ధం అవుతున్నట్టుగా తమిళ మీడియా కోడై కూసింది. రాందాసు ఇంటి వివాహ వేడుక తమకు కలిసి వచ్చినట్టుగానే ఉందన్న ఆనందంలో డీఎంకే వర్గాలు పడ్డాయి. అయితే, ఆ ఆనందానికి, సాగుతున్న ప్రచారానికి ముగింపు పలుకుతూ వైగో స్పందించడం డీఎంకే వర్గాలకు షాక్ తగిలింది.కూటమిలో చేరబోను: ఈ రోడ్ జిల్లా ఎండీఎంకే కార్యదర్శి గణేష మూర్తి కుమారుడు కపిలన్ వివాహం దివ్యతో ఆదివారం జరిగింది. కాంగేయంలో జరిగిన ఈ వేడుకలో వధూవరులను ఆశీర్వదిస్తూ వైగో ప్రసంగించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు. గతంలో తాను పాదయాత్ర చేస్తున్న సమయంలో అప్పటి సీఎం జయలలితను కలుసుకున్నానన్నారు. అంతమాత్రాన తాను అప్పట్లో అన్నాడీఎంకే కూటమిలో చేరలేదని గుర్తు చేశారు. తాను పాదయాత్రగా వెళ్తున్న వైపుగానే సీఎంగా ఉన్న జయలలిత కాన్వాయ్ వెళ్లిందని పేర్కొన్నారు. ఆ సమయంలో ఇద్దరం ఒకే మార్గంలో ఎదురు పడ్డామని, మర్యాద పూర్వకంగా పలకరించుకున్నామని చెప్పారు. ఇప్పుడు కూడా అదే జరిగిందంటూ స్టాలిన్ను కలుసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాందాసు ఇంటి వేడుకలో తనకు స్టాలిన్ ఎదురు పడ్డారని, అదే విధంగా ఆయనకు తాను ఎదురు పడ్డానని, ఇద్దరం మర్యాద పూర్వకంగా పలకరించుకున్నట్లు తెలిపారు. అంత మాత్రాన డీఎంకే కూటమిలో ఎండీఎంకే చేరినట్టు కాదని స్పష్టం చేశారు. ఇంకా చెప్పాలంటే, డీఎంకే కూటమిలోకి వెళ్లాలన్న యోచన తనకు ఇప్పటి వరకు లేదన్నారు. ఎన్నికలకు సమయం ఇంకా ఉందని, కూటమి విషయం అప్పడు చూసుకోవచ్చన్నారు. త న పార్టీని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించడం గమనార్హం. అలాగే, తాను మాత్రం డీఎంకే కూటమిలో చేరబోనని స్పష్టం చేశారు. -
‘మెగా’ మద్దతు
సాక్షి, చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నాటికి డీఎంకే మెగా కూటమికి మద్దతు పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే డీఎండీకే, ఎండీఎంకేలు పరోక్షంగా ఆ కూటమికి మద్దతుగా వ్యాఖ్యలు చేయగా, అదే పల్లవిని బుధవారం పీఎంకే అధినేత రాందాసు అందుకున్నారు. హఠాత్తుగా గోపాలపురంలో రాందాసు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. మనవడు, మనవరాలి పెళ్లి వేడుకకు ఆహ్వానం పలికామేగానీ, రాజకీయ చర్చ లేదంటూనే రాజకీయ నాగరికత తెలిసిన నేత కరుణానిధి అంటూ ప్రశంసల కితాబు ఇవ్వడం గమనార్హం. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టడం లక్ష్యంగా డీఎంకే అధినేత ఎం కరుణానిధి పావులు కదుపుతున్నారు. అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా ఉన్న అన్ని పార్టీల్ని కలుపుకోవడం లక్ష్యంగా వ్యూహరచనల్లో పడ్డారు. తానే తదుపరి కూడా డీఎంకే కూటమి సీఎం అభ్యర్థినంటూ ప్రకటించుకుని ప్రతి పక్షాల దృష్టిని తన వైపు మళ్లించే యత్నంలో పడ్డారు. డీఎంకేలో నెలకొన్న వివాదాల్ని ఓవైపు పరిష్కరిస్తూనే, మరో వైపు మెగా కూటమి లక్ష్యంగా కుస్తీలు పడుతున్నారు. తదుపరి సీఎం అభ్యర్థి కరుణానిధి అన్న ప్రకటన వెలువడడంతో డీఎండీకే, ఎండీఎంకేలు పరోక్షంగా మద్దతు వ్యాఖ్యలు చేశాయి. అన్నాడీఎంకేకు అధికారం దూరం చేయడం లక్ష్యంగా ప్రతి పక్షాలన్నీ మళ్లీ డీఎంకే పక్షాన నిలబడే విధంగా రాజకీయ చదరంగంలో పావులు కదుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బుధవారం హఠాత్తుగా పీఎంకే అధినేత రాందాసు గోపాలపురంలో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. తమ నేతృత్వంలోనే కూటమి, తదుపరి తామే అధికార పగ్గాలు చేపడతామంటూ ప్రగల్బాలు పలుకుతూ వచ్చిన రాందాసు డీఎంకే అధినేత కరుణానిధితో భేటీ కావడంతో ఆంతర్యాన్ని కనిపెట్టే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి. పెళ్లికి రండి: పీఎంకే అధినేత రాందాసు తనయుడు, కుమార్తె అన్భుమణి, శాంతిలు వియ్యంకులు కాబోతున్నారు. అన్భుమణి కుమార్తె సంయుక్తను శాంతి కుమారుడు ప్రీతీవన్కు ఇచ్చి వివాహం చేయడానికి పెద్దలు నిశ్చయించారు. వీరి వివాహం అక్టోబరు 30న మహాబలి పురం వేదికగా జరగనున్నది. ఈ వివాహం ఆహ్వాన పత్రికతో ఉదయాన్నే గోపాలపురంలో తన సతీమణి సరస్వతితో కలసి రాందాసు ప్రత్యక్షం అయ్యారు. రాందాసును సాదరంగా కరుణానిధి ఆహ్వానించారు. ఇద్దరు కుశల ప్రశ్నలతో ఇరవై ఐదు నిమిషాలు మాటా మంతిలో మునిగారు. ఈ సమాచారంతో మీడియా అక్కడికి పరుగులు తీసింది. వెలుపలకు వచ్చి రాగానే, మీడియా వద్దకు వచ్చిన రాందాసును ఁపెళ్లికి రండిరూ. అంటూ ఆహ్వానం పలికారు. ప్రశంసలు: తన మనవడు, మనవరాలి వివాహానికి కరుణానిధి కుటుంబాన్ని ఆహ్వానించామన్నారు. తమ ఇంట్లో జరిగే అన్ని శుభకార్యాలకు కరుణానిధి హాజరయ్యారని, ఈ వేడుకకు కూడా హాజరు కానున్నారని తెలిపారు. ఉత్తరాధిలో రాజకీయ నాగరికత తెలిసిన నాయకులు ఎందరో ఉన్నారని గుర్తు చేశారు. అయితే, దక్షిణాదిలో రాజకీయ నాగరికత తెలిసిన ఒకే ఒక్క నాయకుడు కరుణానిధి మాత్రమేనని కితాబు ఇచ్చారు. తమ మధ్య రాజకీయ సంబంధింత చర్చలు సాగలేదని, ఆ ప్రస్తావనే రాలేదని పేర్కొంటూనే, కరుణానిధిని ప్రశంసలతో ముంచెత్తడం గమనార్హం. రాజకీయ నాగరికత వికసించాలన్నదే కరుణానిధి తపన అని, ఇది వికసించాలని తాను కోరుకుంటున్నట్టుగా పరోక్ష వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చ ఆరంభమయ్యింది. డిఎంకే మెగా కూటమి వైపుగా పీఎంకే సైతం చూస్తున్నట్టుగా ప్రచారం ఊపందుకుంటోంది.