అవినీతికి యావజ్జీవ శిక్ష
రాష్ట్రంలో అవినీతికి పాల్పడే అధికారులకు యావజ్జీవ శిక్ష విధించాల్సిన అవసరం ఉందని పీఎంకే డిమాండ్ చేసింది. అప్పుల ఊబిలో నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించే కొత్త పథకాలను రూపొందిం చాలని సూచించింది. సోమవారం పీఎంకే మాదిరి బడ్జెట్‌ను ఆ పార్టీ వ్యవస్థాపకుడు రాందాసు విడుదల చేశారు.
సాక్షి, చెన్నై: ప్రతి ఏటా రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు ముందుగా కొన్ని సూచనలు, డిమాండ్లతో కూడిన మాదిరి బడ్జెట్‌ను పీఎంకే విడుదల చేస్తుంది. అయితే, 2016 అసెంబ్లీ ఎన్నికల ద్వారా అధికారం చేపట్టి తీరుతామన్న ధీమాతో ముందుకు వెళ్తున్న పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు, ఈ ఏడాది సరికొత్త నినాదాల్ని తెర మీదకు తెస్తూ తమ పార్టీ నేతృత్వంలో మాదిరి బడ్జెట్‌ను సిద్ధం చేశారు. ప్రభుత్వం దృష్టికి దీనిని తీసుకెళ్లడంతో పాటుగా ప్రజల్ని ఆలోచింప చేసే విధంగా, వారికి దగ్గరయ్యే రీతిలో ఈ బడ్జెట్‌లో అంశాలను పొందు పరచడం విశేషం. ఈ బడ్జెట్‌లో నాలుగా ప్రధాన అంశాలను పరిగణనలోకి తీసుకుని సరికొత్త నినాదాల్ని తెర మీదకు తీసుకొచ్చారు. చెన్నైలో ఈ మాదిరి బడ్జెట్‌ను రాందాసు, ఆ పార్టీ అధ్యక్షుడు జికే మణి, నాయకుడు ఏకే మూర్తి విడుదల చేశారు. ఇందులో రాష్ట్రంలో సాగుతున్న అవినీతిని ఎత్తి చూపుతూ, అవినీతి నిర్మూలన లక్ష్యంగా కొన్ని అంశాలను ప్రభుత్వం ముందు ఉంచే యత్నం చేశారు.
అవినీతి నిర్మూలనే లక్ష్యంగా 12 సూత్రాలను విడుదల చేశారు. ఇందులో ప్రధానమైనది అవినీతికి పాల్పడే అధికారికి యావజ్జీవ శిక్ష విధించే విధంగా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఒక్కో శాఖలో ఒక్కో ప్రత్యేక ఉన్నతాధికారిని నియమించడం, ఆ శాఖలో అవినీతి దొర్లి న పక్షంలో అందుకు ఆ అధికారి బాధ్యుడు అవుతాడన్న హెచ్చరికతో చట్టాన్ని కఠినం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఏడాదికా ఏడాది అప్పుల ఊబిలో కూరుకు పోతున్న దృష్ట్యా, అప్పుల బారి నుంచి బయట పడే రీతిలో కొత్త పథకాలతో ప్రజ ల్ని దరి చేరే విధంగా ముందుకు సాగాలని వివరించారు. మహిళలు, బాలికలపై సాగుతున్న లైంగిక దాడులకు అడ్డుకట్ట లక్ష్యంగా ప్రత్యేక విభాగం ఏర్పాటుకు డిమాండ్ చేశారు. మహిళా ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఆ విభాగం ఏర్పాటు కావాలని, అప్పుడే మహిళలకు న్యాయం జరుగుతుందని సూచించారు. అన్నదాతల జీవితాల్లో వెలుగు నింపే రీతిలో ఎరువులు, విత్తనాలు, ఉచితంగా అందించాలని సూచించారు.
మేఘదాతులో కర్ణాటక డ్యాముల కుట్రను భగ్నం చేయడం లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడికి సన్నద్ధం కావాలని డిమాండ్ చేశారు. ముల్లై పెరియార్ డ్యాం నీటిని 152 అడుగులకు చేర్చడం, జాతీయ రహదారుల్లో టోల్ ట్యాక్స్ 60 శాతం మేరకు తగ్గించడం లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని పేర్కొన్నారు. రాష్ర్టంలో అన్ని తరగతుల్లో తమిళం తప్పని సరి చేస్తూ, దశల వారీగా ఉన్నత విద్య, పరిశోధనా రంగాల్లోనూ తమిళానికి చోటు కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఐదేళ్లలో అందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందే విధంగా తాగు నీటి హక్కు చట్టం తీసుకు రావాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. తమ మాదిరి బడ్జెట్లో పేర్కొన్న అంశాలను ప్రభుత్వం పరిగణించాలని, లేని పక్షంలో తాము అధికారంలోకి వస్తే ఇవన్నీ అమలై తీరుతాయని స్పష్టం చేశారు.