సాక్షి, చెన్నై: ప్రజాకర్షణ లక్ష్యంగా గ్రామసభలకు డీఎంకే బుధవారం శ్రీకారం చుట్టింది. శ్రీపెరంబదూరు సమీపంలోని కున్నం గ్రామంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పర్యటించారు. గ్రామాల్లో తిరుగుతూ అన్నాడీఎంకేను వ్యతిరేకిద్దాం అనే కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.2021లో అధికారం లక్ష్యంగా వ్యూహాలకు డీఎంకే పదును పెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో గ్రామసభలకు నిర్ణయించారు. జనవరి 10వ తేదీ వరకు 16 వేల గ్రామాల్లో ఈ సభల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. ప్రజలతో మమేకం అయ్యే రీతిలో, అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ, స్థానిక సమస్యలపై దృష్టి అంశాలను పరిగణించి బుధవారం ఈ గ్రామసభలకు శ్రీకారం చుట్టారు. డీఎంకే ముఖ్యనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లాల కార్యదర్శుల నేతృత్వంలో ఆయా గ్రామాల్లో సభలు సాగాయి. ప్రజలతో కలిసి నేలపై కూర్చుని వారితో మాట్లాడడం, వారి సమస్యలను ఆలకించడం, అన్నాడీఎంకే సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపించే విధంగా ఈ సభలు సాగాయి. చదవండి: రజనీకాంత్ జోష్‌కి బ్రేక్
స్టాలిన్ పర్యటన..
కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు సమీపంలోని కున్నంలో గ్రామసభకు స్టాలిన్ హాజరయ్యారు. ప్రజలకు మరింత చేరువయ్యే రీతిలో ఆయన పర్యటన ఆ గ్రామంలో సాగింది. గ్రామంలో నడుచుకుంటూ వీధివీధిన నడుచుకుని తిరుగుతూ కరపత్రాలను స్టాలిన్ అందజేశారు. స్టాలిన్ మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావంతో అన్నా ఏళ్ల తరబడి ప్రజల కోసం శ్రమించారని గుర్తు చేశారు. అయితే, కొందరు పార్టీ ప్రకటించిన తర్వాత 24 గంటల్లో అధికారంలోకి రావాలని కలలు కంటున్నారని పరోక్షంగా దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. తానూ..రౌడీనే అన్నట్టుగా తానూ రైతు అని గొప్పలు చెప్పుకుంటు సీఎం పళనిస్వామి అదే రైతులకు ద్రోహం తలబెట్టే రీతిలో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. చదవండి: ప్రజలు మార్పు తీసుకురావాలి: కమల్
కేంద్ర వ్యవసాయ చట్టాల రూపంలో రైతులు తీవ్ర నష్టాల్ని, కష్టాల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందని, దీనిని వ్యతిరేకించకుండా మద్దతు పలుకుతున్న సీఎం పళనిస్వామి నేతృత్వంలోని ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నిబంధనల్లో సవరణలు చేస్తూ ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ డీఎంకే నేతృత్వంలో మద్రాసు హైకోర్టు బుధవారం ఓ పిటిషన్ దాఖలైంది. ఇక, పార్టీలో చేరే వారిని ఆహ్వానించే రీతిలో సభ్యత్వ నమోదుకు టోల్ ఫ్రీనంబర్‌ను డీఎంకే ప్రకటించింది. ఆ మేరకు 9171091710 నంబర్‌కు ఫోన్ చేసి తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవాలని ప్రజలకు స్టాలిన్ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment