డీఎంకే అధినేత కరుణానిధితో సీఎం కేసీఆర్
సాక్షి, చెన్నై/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం చెన్నైలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధితో భేటీ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇది ఆది కాదు.. అంతం కాదు.. దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశ ప్రగతి, ఆర్థిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కోసం వివిధ రాష్ట్రాల్లోని అనుభవజ్ఞులు, అన్ని పార్టీల నాయకులతో చర్చలు కొనసాగుతాయి..’’అని చెప్పారు.
రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండొద్దని వ్యాఖ్యానించారు. తమది థర్డ్ ఫ్రంట్.. నాలుగో ఫ్రంట్.. ఐదో ఫ్రంట్ కాదని, ప్రజాఫ్రంట్ అని స్పష్టంచేశారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ అధినేత దేవెగౌడలతో చర్చలు జరిపిన కేసీఆర్.. కరుణానిధిని కలిసేందుకు ఆదివారం చెన్నైకి వెళ్లారు. నేరుగా గోపాలపురంలోని కరుణ నివాసానికి వెళ్లి పది నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. అక్కడ్నుంచి కేసీఆర్, స్టాలిన్, ఎంపీ కె.కేశవరావు ఒకే కారులో ఆళ్వార్‌పేటకు బయలుదేరి వెళ్లారు.
స్టాలిన్ నివాసానికి చేరుకొని అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రులు ఎ.రాజా, బాలులతో రెండు గంటల పాటు చర్చించారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలను సీఎం వారికి వివరించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రాలకు దక్కాల్సిన అధికారాలు, హక్కులపై చర్చించారు. డీఎంకే నాయకులతో జరిగిన చర్చలో ఎంపీ కేకేతోపాటు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. చర్చల అనంతరం కేసీఆర్ చెన్నైలోని కపాలేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. చెన్నై పర్యటనలో సీఎం వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మెహన్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, టీఆర్‌ఎస్ నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.
దక్షిణాదికి అన్యాయమే..
చర్చల అనంతరం కేసీఆర్, స్టాలిన్ కలిసి మీడియాతో మాట్లాడారు. డీఎంకేతో కలిసి యూపీఏ–1లో పనిచేశామని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రాల ప్రయోజనం, దేశ శ్రేయస్సు, ప్రగతిని కాంక్షించేలా చర్చ సాగిందన్నారు. ‘‘దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్య సాధనలో భాగంగా నా ప్రయాణం సాగుతుంది. ఏకాభిప్రాయం వచ్చేదాకా అందరితో చర్చలు జరుపుతాం. రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని అధికారాలు ఇవ్వాలి. కేంద్రానికి సంబంధం లేని అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలి. విద్య, వైద్య, తాగు, సాగునీరు వంటి అంశాలతోపాటు ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైంది’’అని అన్నారు.
ప్రస్తుత పరిస్థితులు దేశాభివృద్ధికి దోహదం చేసేలా లేవని, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండకూడదన్నదే తమ అభిమతమని స్పష్టంచేశారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అందులో అనుమానం ఏముంది?’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. స్టాలిన్‌తో అనేక అంశాలపై చర్చించామని, మున్ముందు మరిన్ని చర్చలు జరుగుతాయని వివరించారు. తెలంగాణలో మే 10 నుంచి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టనున్నామని, ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా స్టాలిన్‌ను ఆహ్వానించినట్టు తెలిపారు. చాలాకాలం తర్వాత చెన్నైకి రావడం ఆనందంగా ఉందని, కరుణానిధి తనకు మంచి పుస్తకాలను కానుకగా ఇచ్చారన్నారు.
థర్డ్ ఫ్రంట్ అని ఎక్కడా చెప్పలేదు
తాను ఎప్పుడూ, ఎక్కడా థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పలేదని, ఇదంతా మీడియా సృష్టే అని కేసీఆర్ చెప్పారు. ‘మా ప్రయత్నం కేవలం రాజకీయ పార్టీల ఏకీకరణ కాదు.. దేశ ప్రజలు, యువత, నిరుద్యోగుల ఏకీకరణ’అని అన్నారు. తాము ఎవరితో కలిసి పనిచేస్తామన్నది భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తారా అని విలేకరులు అడగ్గా.. ‘‘ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయన్ను కూడా కలిసి చర్చలు జరుపుతా’’అని చెప్పారు.
అన్ని అంశాలపై మాట్లాడాం: స్టాలిన్
రాజకీయంగా అనేక అంశాలపై కేసీఆర్‌తో చర్చించినట్టు స్టాలిన్ చెప్పారు. ‘‘మాతో ఏకాభిప్రాయం కల్గిన పార్టీలు అనేకం ఉన్నాయి. వారితో ఈ అంశాలపై చర్చించాల్సి ఉంది’’అని తెలిపారు. డీఎంకే ఉన్నత స్థాయి, సర్వసభ్యం, కార్యవర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయమే కీలకం అని పేర్కొన్నారు.
నేడు మరికొందరు నేతలతో భేటీ
స్టాలిన్‌తో భేటీ తర్వాత సాయంత్రం ఆళ్వార్ పేట నుంచి గిండిలోని స్టార్ హోటల్‌కు చేరుకున్న కేసీఆర్.. అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం మరికొన్ని పార్టీల నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment