విక్రవాండికి.. ఉదయనిధి
రెండు రోజుల పాటు ప్రచారం
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
సాక్షి, చైన్నె: విక్రవాండి ఉప ఎన్నికల్లో నేతల ప్రచారం హోరెత్తుతోంది. ఈ నేపథ్యంలో డీఎంకే యువజన నేత, మంత్రి ఉదయ నిధి రెండు రోజుల పాటుగా నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఎన్నికల ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం వేగవంతం చేసింది. ఈవీఎంలలో చిహ్నాలను పొందు పరిచే కార్యక్రమంతో పాటు, పోలీసుల తపాల్ ఓట్ల నమోదు ప్రక్రియను గురువారం ఆ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి పళణి పర్యవేక్షించారు.
వివరాలు.. విక్రవాండి అసెంబ్లీ స్థానానికి ఈనెల 10వ తేదీన ఉప ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. డీఎంకే అభ్యర్థి అన్నియూరు శివాకు మద్దతుగా మంత్రులు ఆ నియోజకవర్గంలో తిష్ట వేశారు. గ్రామగ్రామానా తిరుగుతూ ఓట్ల వేటలో దూసుకెళ్తున్నారు. పీఎంకే అభ్యర్థి సి. అన్బుమణికి మద్దతుగా ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాసు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. నామ్ తమిళర్ కట్చి అభ్యర్థి అభినయకు మద్దతుగా ఆ పార్టీ నేత సీమాన్ ఓట్ల వేటలో ఉన్నారు.
ఈ పరిస్థితుల్లో డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రచార ప్రయాణానికి డీఎంకే యువజన ప్రధాన కార్యదర్శి, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సిద్ధమయ్యారు. ఈనెల 7,8 తేదీలలో ఆయన నియోజకవర్గంలో పర్యటించనున్నారు. 8 గ్రామాలలో ఆయన ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించే విధంగా డీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేపట్టాయి.
పోస్టల్ ఓట్ల నమోదు..
ప్రచారం ఓ వైపు ఉధృతంగా సాగుతుంటే, మరోవైపు ఎన్నికల సమయం సమీపించడంతో ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ విషయంపై ఆ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పళణి మాట్లాడుతూ, పోలీసులకు తపాల (పోస్టల్) ఓట్ల నమోదు తాలుకా కార్యాలయంలో శనివారం వరకు జరగనున్నట్లు వివరించారు. 370 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారని పేర్కొన్నారు.
సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు 574 మంది తమ తపాల్ ఓట్లను నమోదు చేశారని తెలిపారు. ఈవీఎంలలో చిహ్నాలు, అభ్యర్థుల పేర్లను పొందు పరిచే పనులు శరవేగంగా జరుగుతున్నట్టు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 276 పోలింగ్ బూత్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, 140 పోలింగ్ బూత్‌లలో వెలుపలు, పరిసరాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
44 సమస్యాత్మక పోలింగ్ బూత్‌లను గుర్తించామని, ఇక్కడ పారా మిలటరీ భద్రతకు నిర్ణయించామన్నారు. ఈనెల 10 వ తేదీ విక్రవాండికి లోక్‌ల్ హాలిడే ప్రకటించనున్నామని, రెండు రోజులు టాస్మాక్ దుకాణాల మూతకు ఆదేశాలు ఇవ్వానున్నామన్నారు. తమకు ఇప్పటి వరకు 41 ఫిర్యాదులు వచ్చాయని, వీటిని పరిశీలించి చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment