కనిమొళికి ఆశీస్సులు
డీఎంకే అధినేత కరుణానిధి గారాల పట్టి కనిమొళి సోమవారం 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆమె మద్దతుదారులు, డీఎంకే వర్గాలు బర్త్‌డేను ఘనంగా జరుపుకున్నారు. తండ్రి కరుణానిధి, తల్లి రాజాత్తి అమ్మాల్, సోదరుడు స్టాలిన్‌కు కనిమొళి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు.
సాక్షి, చెన్నై: కరుణానిధికి గారాలపట్టి కనిమొళి. చిన్న కూతురు అంటే ఎంతో అభిమానం. తన అడుగు జాడల్లో ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందలం ఎక్కించే యత్నం చేసినా, వారసులు అడ్డుపడడంతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన తన గారాలపట్టిని మళ్లీ రాజ్యసభలో కూర్చోబెట్టేందుకు కరుణానిధి తీవ్రంగానే యత్నించారు. ఎట్టకేలకు ఆమె గెలవడంతో డీఎంకే రాజ్యసభ నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పరంగా ఆమెను అందలం ఎక్కించాలన్న కాంక్షతో ఉంటున్న కరుణానిధి సోమవారం తన గారాల పట్టికి ఆశీస్సులు అందించారు.
ఆశీస్సులు: 2జీ స్పెక్ట్రమ్ కేసులో కనిమొళి జైలు జీవి తాన్ని అనుభవించిన విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో గత ఏడాది తన బర్త్‌డేను ఆమె నిరాడంబరంగా జరుపుకున్నారు. 47వ వసంతంలోకి అడుగు పెట్టిన కనిమొళికి శుభాకాంక్షలు తెలియజేయడానికి సీఐటీ కాలనీకి పెద్ద ఎత్తున పార్టీ వర్గాలు, మద్దతు నాయకులు తరలి వచ్చారు. ఉదయాన్నే తండ్రి కరుణానిధి, తల్లి రాజాత్తి అమ్మాల్ పాదాలకు నమస్కరించి, కని మొళి ఆశీస్సులు అందుకున్నారు. తన గారాల పట్టిని ఆప్యాయంగా పలకరిస్తూ, తన ఆశీస్సుల్ని కరుణానిధి అందజేశారు.
తల్లిదండ్రుల సమక్షంలో ఆమె కేక్ కట్‌చేశారు. తండ్రి కరుణానిధికి తినిపించారు. అదే సమయంలో చిన్న అన్నయ్య స్టాలిన్ రావడంతో పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. కనిమొళికి స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె ఇంటి వద్ద పండుగ కోలాహలం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మద్దతుదారులు, డీఎంకే వర్గాలు అక్కడికి చేరుకుని బాణసంచాలు పేల్చుతూ, స్వీట్లు పంచారు. డీఎంకే నేతలు టీ ఆర్ బాలు, దయానిధి మారన్, కేపి రామలింగం, సద్గుణ పాండియన్, పుగలేంది, కేపి మునుస్వామి, తాము అన్భరసన్, వాసంతి స్టాన్లీ, అన్భళగన్, శేఖర్ బాబు, టీకేఎస్ ఇళంగోవన్ తదితరులు కనిమొళికి శుభాకాంక్షలు తెలియ జేశారు.