DMK chief Karunanidhi
-
కరుణ అందుకే శాకాహారి అయ్యారు!
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత దివంగత కరుణానిధి ఒకప్పుడు మాంసాహారి. అయితే, ఒకే ఒక్క ఘటన ఆయన్ను పూర్తి శాకాహారిగా మార్చి వేసింది. శాకాహారిగా మారడం వెనుక ఉన్న నేపథ్యాన్ని డీఎంకే ఎంపీ, ఆయన కూతురు కనిమొళి శనివారం మీడియాతో చెప్పారు. ‘కరుణానిధి మాంసాహారి. ఆయన ఇంట్లో ఉన్నంతసేపూ నల్ల రంగు పెంపుడు కుక్క వెన్నంటే ఉండేది. తాను తినే ప్రతీదాన్ని ఆ కుక్కకు ఆయన పెట్టేవారు. అయితే, తనకు ఎంతో ఇష్టమైన ఆ కుక్క మరణంతో కరుణానిధి మారిపోయారు. మాంసాహారాన్ని మానేసి పూర్తి శాకాహారి అయ్యారు. ఆ కుక్క కళేబరాన్ని మా ఇంటి వెనుక ఖాళీ స్థలంలో పూడ్చి పెట్టి, ఓ మొక్క నాటారు. ఆనాటి మొక్క నేడు పెద్ద చెట్టుగా ఎదిగింది’ అని కనిమొళి గతాన్ని గుర్తుచేసుకున్నారు. -
కావేరి ఆస్పత్రి వద్ద టెన్షన్
-
కావేరీ ఆస్పత్రి వద్ద విషాద ఛాయలు
సాక్షి, చెన్నై: ‘కలైంగర్’ కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించటంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది. 24 గంటలు గడిస్తేగానీ ఏం చెప్పలేమంటూ వైద్యులు ప్రకటించటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. గత రాత్రి నుంచి కావేరీ ఆస్పత్రి వద్దకు క్యూ కట్టిన కార్యకర్తలు.. ఈ ఉదయం నుంచి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. కార్యకర్తల రోదనలతో అక్కడంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ఆస్పత్రి వద్ద వెయ్యి మంది పోలీసులతో ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. మరోవైపు నగరంలోకి పలుచోట్లా పోలీసులు భారీగా మోహరించారు. ఇదిలా ఉంటే భార్య దయాళు అమ్మల్ , కూతురు కనిమొళిలు ఆస్పత్రికి చేరుకుని కరుణను పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన కనిమొళి.. ఆందోళన వద్దంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పే యత్నం చేశారు. ‘వచ్చే 24 గంటలపాటు వైద్య సేవలకు ఆయన శరీరం ఎలా సహకరిస్తుందనేదే కీలకం’ నిన్న వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు సీరియస్ కథనాల నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఆయన చనిపోయారంటూ ఫేక్ పోస్టర్లు నిన్నంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే డీఎంకే కార్యకర్తలు శ్రద్ధాంజలి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం కలవరపాటుకు గురి చేసింది. వయో భారం సమస్యలతో బాధపడుతున్న కరుణానిధిని.. జూలై 27 అర్ధరాత్రి ఆరోగ్యం విషమించటంతో కుటుంబ సభ్యులు కావేరీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రముఖులంతా ఒక్కోక్కరిగా ఆస్పత్రికి వెళ్లి కలైంగర్‌ను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటిదాకా నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా మారిపోయింది. జాండీస్ సోకటం, దానికితోడు నిన్నటి నుంచి ఆయన ఊపిరి పీల్చుకోవటం కష్టంగా మారిందని వైద్యులు వెల్లడించారు. ఆయనకు చికిత్స కొనసాగుతుండగా.. ఈ సాయంత్రం కల్లా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసే ఛాన్స్ ఉంది. -
కరుణానిధి హెల్త్ బులిటెన్ విడుదల
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయనకు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పల్స్ రేటులో మార్పులు రావటంతో ఆయన్ని కావేరి ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. వదంతులు నమ్మొద్దని, ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందంటూ తనయుడు స్టాలిన్ ప్రకటన చేసిన కొద్దిగంటలకే ఈ పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. గత కొంతకాలంగా వయసురీత్యా సమస్యలతో కరుణానిధి(94) బాధపడుతున్నారు. గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్ మార్పిడి కారణంగా కరుణకు స్వల్పంగా జ్వరం, ఆపై ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో గోపాలపురంలోని ఆయన ఇంటిలోనే శుక్రవారం వైద్యులు చికిత్స అందించారు. వార్త తెలియగానే పలువురు ప్రముఖులు కూడా ఆయన్ని పరామర్శించారు. పరిస్థితి మెరుగవుతున్న క్రమంలో ఒక్కసారిగా బీపీ పడిపోవటంతో పరిస్థితి విషమించింది. దీంతో అర్ధరాత్రి హుటాహుటిన కుటుంబ సభ్యులు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూకి తరలించి వెంటిలేటర్ల సాయంతో ఆయనకు చికిత్స అందించారు. అయితే కాసేపటికే కరుణానిధి పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు డీఎంకే నేత డీ రాజా వెల్లడించారు. ఆపై వైద్యులు కూడా బులిటెన్ విడుదల చేశారు. ఇదిలా ఉంటే ‘కలైగ్నర్’ ఆరోగ్యంపై వదంతులు రావటంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు ఆస్పత్రి వద్దకు దూసుకొచ్చారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర కార్యకర్తలతో రోడ్డు నిండిపోవటంతో భారీ ఎత్తున్న పోలీసులు మోహరించారు. ప్రస్తుతం కావేరీ ఆస్పత్రి వద్దకు భారీ ఎత్తున్న కార్యకర్తలు, అభిమానులు చేరుకుంటున్నారు. -
కరుణానిధి ఆరోగ్యం మరింత విషమం
-
మెరుగవుతున్న కరుణ ఆరోగ్యం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ద్రావిడ మున్నేట్ర కజగం(డీఎంకే) అధినేత ఎంకే కరుణానిధి(94) ఆరోగ్యం ప్రస్తుతం మెరుగుపడుతోందని ఆయన కొడుకు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ స్పష్టంచేశారు. గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్ మార్పిడి కారణంగా కరుణకు స్వల్పంగా జ్వరం, ఇన్ఫెక్షన్ సోకిందన్నారు. ప్రస్తుతం జ్వరంతో పాటు శరీరంలోని ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పడుతోందన్నారు. కరుణానిధి ఆరోగ్యంపై వస్తున్న వదంతుల్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యుత్తమ వైద్యుల బృందం 24 గంటల పాటు కరుణకు చికిత్స అందజేస్తోందని స్టాలిన్ తెలిపారు. కలైంజర్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నందున గోపాలపురంలోని ఆయన నివాసానికి రావొద్దని పార్టీ నేతలు, కార్యకర్తలు, సాధారణ ప్రజలను స్టాలిన్ కోరారు. పరామర్శల వెల్లువ.. కరుణ ఆరోగ్యం క్షీణించిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రపతి కోవింద్, ప్రధాని∙మోదీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ తదితరులు స్టాలిన్, కుమార్తె కణిమొళికి ఫోన్ చేసి కరుణ∙ఆరోగ్యంపై వాకబు చేశారు. తండ్రి అనారోగ్యం నేపథ్యంలో కరుణ పెద్ద కుమారుడు అళగిరి తన కుమారుడు దురై దయానిధిని వెంటపెట్టుకుని గోపాలపురంలోని ఇంటికి శుక్రవారం చేరుకున్నారు. డీఎంకే అధినేతగా కరుణానిధి శుక్రవారంతో 50వ వసంతంలోకి అడుగుపెట్టిన వేళ ఆయన కుమారుడు స్టాలిన్ స్పందించారు.‘ సవాళ్లను విజయాలుగా మార్చుకునే మన నాయకుడు గత 50 సంవత్సరాలుగా తమిళనాడు రాజకీయాల్లో దృఢమైన శక్తిగా ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. కొనసాగిన ఉత్కంఠ.. కరుణ ఆరోగ్యం స్వల్పంగా క్షీణించిందని కావేరీ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించడంతో డ్రామా మొదలైంది. డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం, తోటి మంత్రులు కరుణ ఇంటికి వెళ్లి స్టాలిన్‌ను కలవడం, ఇంటివద్ద పెద్ద సంఖ్యలో పోలీసుల్ని మోహరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో టెన్షన్ పెరిగింది. మెరీనా బీచ్‌లోని అన్నాదురై సమాధి దగ్గర ప్రభుత్వం స్థల పరిశీలన చేస్తోందని వార్తలొచ్చాయి. చివరకు కరుణ ఆరోగ్యం మెరుగుపడుతోందని స్టాలిన్ ప్రకటించినప్పటికీ ఆయన ఇంటివద్ద నేతలు, కార్యకర్తల్లో ఆందోళన తగ్గలేదు. కాగా, కరుణకు పూర్తి విశ్రాంతి అవసరమని డీఎంకే వర్గాలు తెలిపాయి. ముందస్తుగా ఖరారైన పర్యటన నేపథ్యంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆదివారం చెన్నైకి చేరుకోనున్నారు. -
రాజకీయాలు, పాలనలో మార్పు రావాలి
-
ఫెడరల్.. టూర్!
సాక్షి, చెన్నై/హైదరాబాద్ : దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం అనుసరించాల్సిన వ్యూహంపై వివిధ రాజకీయ పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం చెన్నైలో డీఎంకే అధినేత ఎం.కరుణానిధితో భేటీ అయ్యారు. ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌తోనూ సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఇది ఆది కాదు.. అంతం కాదు.. దేశ రాజకీయాల్లో, పాలనలో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరం ఉంది. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దేశ ప్రగతి, ఆర్థిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కోసం వివిధ రాష్ట్రాల్లోని అనుభవజ్ఞులు, అన్ని పార్టీల నాయకులతో చర్చలు కొనసాగుతాయి..’’అని చెప్పారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండొద్దని వ్యాఖ్యానించారు. తమది థర్డ్ ఫ్రంట్.. నాలుగో ఫ్రంట్.. ఐదో ఫ్రంట్ కాదని, ప్రజాఫ్రంట్ అని స్పష్టంచేశారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జేడీఎస్ అధినేత దేవెగౌడలతో చర్చలు జరిపిన కేసీఆర్.. కరుణానిధిని కలిసేందుకు ఆదివారం చెన్నైకి వెళ్లారు. నేరుగా గోపాలపురంలోని కరుణ నివాసానికి వెళ్లి పది నిమిషాల పాటు ఆయనతో భేటీ అయ్యారు. అక్కడ్నుంచి కేసీఆర్, స్టాలిన్, ఎంపీ కె.కేశవరావు ఒకే కారులో ఆళ్వార్‌పేటకు బయలుదేరి వెళ్లారు. స్టాలిన్ నివాసానికి చేరుకొని అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం స్టాలిన్, కేంద్ర మాజీ మంత్రులు ఎ.రాజా, బాలులతో రెండు గంటల పాటు చర్చించారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలను సీఎం వారికి వివరించారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాష్ట్రాలకు దక్కాల్సిన అధికారాలు, హక్కులపై చర్చించారు. డీఎంకే నాయకులతో జరిగిన చర్చలో ఎంపీ కేకేతోపాటు మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్ కుమార్ పాల్గొన్నారు. చర్చల అనంతరం కేసీఆర్ చెన్నైలోని కపాలేశ్వర దేవాలయాన్ని సందర్శించారు. చెన్నై పర్యటనలో సీఎం వెంట హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మెహన్, ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, ఎండీసీ చైర్మన్ శేరి సుభాష్ రెడ్డి, టీఎస్ఐఐసీ చైర్మన్ బాలమల్లు, టీఆర్ఎస్ నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు. దక్షిణాదికి అన్యాయమే.. చర్చల అనంతరం కేసీఆర్, స్టాలిన్ కలిసి మీడియాతో మాట్లాడారు. డీఎంకేతో కలిసి యూపీఏ–1లో పనిచేశామని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రాల ప్రయోజనం, దేశ శ్రేయస్సు, ప్రగతిని కాంక్షించేలా చర్చ సాగిందన్నారు. ‘‘దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉంది. ఆ లక్ష్య సాధనలో భాగంగా నా ప్రయాణం సాగుతుంది. ఏకాభిప్రాయం వచ్చేదాకా అందరితో చర్చలు జరుపుతాం. రాష్ట్రాలకు కేంద్రం మరిన్ని అధికారాలు ఇవ్వాలి. కేంద్రానికి సంబంధం లేని అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలి. విద్య, వైద్య, తాగు, సాగునీరు వంటి అంశాలతోపాటు ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్రం విఫలమైంది’’అని అన్నారు. ప్రస్తుత పరిస్థితులు దేశాభివృద్ధికి దోహదం చేసేలా లేవని, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిసి రావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఉండకూడదన్నదే తమ అభిమతమని స్పష్టంచేశారు. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేస్తోందని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అందులో అనుమానం ఏముంది?’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. స్టాలిన్‌తో అనేక అంశాలపై చర్చించామని, మున్ముందు మరిన్ని చర్చలు జరుగుతాయని వివరించారు. తెలంగాణలో మే 10 నుంచి రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టనున్నామని, ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా స్టాలిన్‌ను ఆహ్వానించినట్టు తెలిపారు. చాలాకాలం తర్వాత చెన్నైకి రావడం ఆనందంగా ఉందని, కరుణానిధి తనకు మంచి పుస్తకాలను కానుకగా ఇచ్చారన్నారు. థర్డ్ ఫ్రంట్ అని ఎక్కడా చెప్పలేదు తాను ఎప్పుడూ, ఎక్కడా థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెప్పలేదని, ఇదంతా మీడియా సృష్టే అని కేసీఆర్ చెప్పారు. ‘మా ప్రయత్నం కేవలం రాజకీయ పార్టీల ఏకీకరణ కాదు.. దేశ ప్రజలు, యువత, నిరుద్యోగుల ఏకీకరణ’అని అన్నారు. తాము ఎవరితో కలిసి పనిచేస్తామన్నది భవిష్యత్ నిర్ణయిస్తుందన్నారు. ఏపీ సీఎం చంద్రబాబును కలుస్తారా అని విలేకరులు అడగ్గా.. ‘‘ఆయన నాకు మంచి మిత్రుడు. ఆయన్ను కూడా కలిసి చర్చలు జరుపుతా’’అని చెప్పారు. అన్ని అంశాలపై మాట్లాడాం: స్టాలిన్ రాజకీయంగా అనేక అంశాలపై కేసీఆర్‌తో చర్చించినట్టు స్టాలిన్ చెప్పారు. ‘‘మాతో ఏకాభిప్రాయం కల్గిన పార్టీలు అనేకం ఉన్నాయి. వారితో ఈ అంశాలపై చర్చించాల్సి ఉంది’’అని తెలిపారు. డీఎంకే ఉన్నత స్థాయి, సర్వసభ్యం, కార్యవర్గ సమావేశంలో తీసుకునే నిర్ణయమే కీలకం అని పేర్కొన్నారు. నేడు మరికొందరు నేతలతో భేటీ స్టాలిన్‌తో భేటీ తర్వాత సాయంత్రం ఆళ్వార్ పేట నుంచి గిండిలోని స్టార్ హోటల్‌కు చేరుకున్న కేసీఆర్.. అక్కడ పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం మరికొన్ని పార్టీల నేతలతో భేటీ అయ్యే అవకాశం ఉంది. సోమవారం మధ్యాహ్నం ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కు బయల్దేరుతారు. -
కొడుకు బాటలో తండ్రి.. జయపై కరుణ ఫైర్
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి కూడా తన కుమారుడు స్టాలిన్ బాటలో నడిచారు. పెద్ద నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి జయలలిత ఎందుకు స్పందించలేదని, స్టాలిన్ వేసిన ప్రశ్నకు ఎందుకు సమాధానం ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో ఉప ఎన్నికల్లో తమ పార్టీకి విజయం కట్టబెట్టాలని జయ కోరారే తప్ప డబ్బులు చేతిక రాక జనాలు పడుతున్న అవస్థల గురించి ఆమె ఎందుకు ప్రకటన చేయలేదని మండిపడ్డారు. కనీసం ప్రజలను ఇబ్బందుల నుంచి పడేసే చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కాకపోయినా ఆ పార్టీలో ఒక్క వ్యక్తికి కూడా పెద్ద నోట్లు రద్దు విషయంలో ప్రకటన చేసే తీరిక లేకుండా పోయిందా అని ప్రశ్నించారు. ఉప ఎన్నికలు జరిగే ప్రాంతాలకు తన అనారోగ్యం కారణం దృష్ట్యా వెళ్లలేనని, తమ అభ్యర్థులనే ప్రజలు గెలిపించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. -
కరుణానిధి సంచలన వ్యాఖ్యలు
-
కరుణానిధి సంచలన వ్యాఖ్యలు
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నిర్వహిస్తోన్న శాఖలను ఆర్థిక మంత్రి ఓ. పన్నీర్ సెల్వంకు అప్పగించడంపై డీఎంకే చీఫ్ కరుణానిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. సెల్వంకు కొత్త బాధ్యతలు కట్టబెడుతూ మంగళవారం రాత్రి రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలోని అంశాలపై విస్మయం వ్యక్తం చేశారు. బుధవారం చెన్నైలో మాట్లాడిన కరుణానిధి.. 'సీఎం జయలలిత సూచన మేరకు మంత్రి పన్నీర్ సెల్వంకు అదనపు బాధ్యతలు ఇస్తున్నామని గవర్నర్ ప్రకటనలో పేర్కొన్నారు. గడిచిన 19 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమెను దూరంగానైనా చూసేందుకు ఏఒక్కరినీ అనుమతించడం లేదు. అలాంటిది 'సీఎం సూచన మేరకు'అని గవర్నర్ ఎలా చెబుతారు? ఇన్ చార్జి గవర్నర్ జారీచేసిన ఆదేశాలు చదివిన ఏఒక్కరికైనా ఇలాంటి సందేహాలు రావని అనుకోను' అని అన్నారు. (చదవండి.. అమ్మ నిర్ణయం: తమిళనాడులో కీలక పరిణామం) సీఎం జయలలితను పరామర్శించిన ఇన్ చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు, కేరళ సీఎం పినరయి విజయ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సహా ఇతరులు ఎవ్వరు కూడా కనీసం ఆమెను చూడలేదని, కేవలం వైద్యులతో మాట్లాడివచ్చారని కరుణానిధి అన్నారు. సీఎం ఆరోగ్యంపై స్పష్టత ఇవ్వాలని మొదటి నుంచీ తాను డిమాండ్ చేస్తున్నట్లు గుర్తుచేశారు. -
మాటల యుద్ధం
తమిళనాడు ఎన్నికలు మద్య నిషేధం చుట్టూ పరిభ్రమిస్తుండగా ప్రధాన ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. ప్రచార వేదికలపై పరస్పర విమర్శలతో ప్రసంగాల పోరు సాగుతోంది. చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్యం నిషేధం వాగ్దానాన్ని మెప్పించిన వారికే ప్రజలకు పట్టం కట్టనున్నారని ఈ రెండు పార్టీలూ విశ్వసిస్తున్న కారణంగా ప్రతి వేదికపైనా ప్రధాన అంశంగా మారింది. ఎన్నికల వాతావరణం ఆరంభానికి ముందే డీఎంకే అధినేత కరుణానిధి సంపూర్ణ మద్య నిషేధం వాగ్దానం చేసి ముందు వరుసలో నిలిచారు. ఎన్నికల ప్రచార తొలి సభలో అన్నాడీఎంకే అధినేత్రి సైతం అధికారంలోకి వస్తే దశలవారీ మద్య నిషేధం ఖాయమని వాగ్దానం చేశారు. అంతేగాక మద్యంపై నిషేధాన్ని ఎత్తివేసిన డీఎంకే నేడు మరలా నిషేధం మాట ఎత్తడం చోద్యమని సోమవారం రాత్రి కాంచీపురంలో నిర్వహించిన ఎన్నికల సభలో ఎద్దేవా చేశారు. కరుణానిధి వాగ్దానమే నిజమైతే మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధం అనకుండా మద్య నిషేధం అని మాత్రమే అని ఎందుకు పేర్కొన్నారని జయ నిలదీశారు. సంపూర్ణ అనే పదాన్ని ఎందుకు చేర్చలేదు, అలాంటి పదం ఒకటి ఉందని కరుణానిధి మరిచిపోయారా అంటూ వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే తొలి సంతకం మద్య నిషేధం పైనే అని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసే ఉద్దేశమే ఆయనకు, ఆ పార్టీకి లేదని జయ వ్యాఖ్యానించారు. సంపూర్ణ మద్య నిషేధం కరుణానిధికి సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే దశలవారీ మద్య నిషేధం సాధించి చూపుతానని హామీ ఇచ్చారు. డీఎంకే కోశాధికారి స్టాలిన్ పెరంబలూరు జిల్లాలో మంగళవారం నిర్వహించిన ప్రచార సభల్లో జయలలిత వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు. కాంచీపురంలో జయలలిత చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు. నిషేధం అంటే సంపూర్ణ మద్య నిషేధం అంటే అన్న సంగతి జయలలితకు తెలియక పోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. మద్య నిషేధంపై చట్టాన్ని తీసుకువస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నాం, రాజాజీ ముఖ్యమంత్రిగా ఉండగా సైతం ‘తమిళనాడు మద్య నిషేధ చట్టం-1937’ అని తెచ్చారని గుర్తుచేశారు. తమిళనాడులో ప్రభుత్వం వస్తే ఒక్క బొట్టు మద్యం కూడా ఉండదని హామీ ఇచ్చారు. పీఎంకే ఎద్దేవా ప్రధాన ప్రత్యర్థుల పోరు ఇలా ఉండగా, మద్య నిషేధం తేవడంలో అన్నాడీఎంకే, డీఎంకే దొందూ దొందే అంటూ పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ ఎద్దేవా చేస్తూ ప్రచారాలు సాగిస్తున్నారు. మద్య నిషేధంపై ఇప్పటికే ఐదుసార్లు వాగ్దానం చేసిన డీఎంకే ఆరోసారి సిద్ధమైందని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఇన్నాళ్లు మిన్నకుండి మరో ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే మద్య నిషేధం తెస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. మద్య నిషేధం హామీలు ఇచ్చే ముందు తమ పార్టీల వారి లిక్కర్ ఫ్యాక్టరీలను ఎత్తివేయాలని హితవు పలికారు. పార్టీ నేతలతో మద్యం వ్యాపారం చేయిస్తూ నిషేధం మాటలు చెబితే ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్బుమణి పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం ప్రవాహంలా ఎన్నికల్లో పార్టీల మధ్య సాగుతున్న మాటల ప్రవాహం ప్రజలకు వినోదాన్ని కలిగిస్తోంది. -
కెప్టెన్ మా వెంటే!
►మద్దతు ఇస్తాడన్న నమ్మకం ఉంది ► పెదవి విప్పిన కరుణ ► రెండు రోజుల్లో మేనిఫెస్టో ► కొళత్తూరు బరిలో మళ్లీ స్టాలిన్ ► ఇంటర్వ్యూకు హాజరు సాక్షి, చెన్నై : డీఎండీకే పొత్తు వ్యవహారాలపై వస్తున్న ఊహాజనిత కథనాలకు ముగింపు పలికే విధంగా డీఎంకే అధినేత కరుణానిధి స్పందించారు. కెప్టెన్ మా వెంటే అన్నట్టు ఆయన చేసిన వ్యాఖ్య, పండు పక్వానికి వచ్చింది...ఇక పాలల్లో పడాల్సిందే అని సామెతను వళ్లించి అటు కమలనాథులకు, ఇటు ప్రజా కూటమికి షాక్ ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో మేనిఫెస్టోను సైతం ప్రకటించబోతున్నట్టు కరుణానిధి వెల్లడించారు. అధికారం లక్ష్యంగా వ్యూహ రచనలతో డీఎంకే అధినేత కరుణానిధి ముందుకు సాగుతూ వస్తున్నారు. ఇప్పటికే ఆ కూటమిలోకి కాంగ్రెస్ చేరింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎప్పటి నుంచో డీఎంకేతో పయనం సాగిస్తూనే ఉంది. ఇక, పది శాతం మేరకు ఓటు బ్యాంక్ కల్గిన డీఎండీకే అధినేత విజయకాంత్ తమ వెంట ఉంటే చాలు, అన్నాడీఎంకేను పతనం అంచుకు చేర్చినట్టే అన్న భావనలో డీఎంకే వర్గాలు పడ్డాయి. అయితే, విజయకాంత్ ఎక్కడా, ఎవరికీ చిక్కకుండా నాన్చుడు ధోరణితో ముందుకు సాగుతున్నారు. ఈ సమయంలో ఊహాజనిత కథనాలెన్నో పుట్టుకొచ్చాయి. బీజేపీ వైపు వెళుతున్నారంటూ కొన్ని మీడియాలు, ప్రజా కూటమి వైపు అంటూ మరికొన్ని మీడియాలు కోడై కూసినా, డీఎంకే అధినేత కరుణానిధి మాత్రం పొత్తు విషయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆశావహుల ఇంటర్వ్యూల మీదే తన దృష్టిని అంతా పెట్టారు. ఈ పర్వం సోమవారం పొద్దు పోయే వరకు సాగింది. 4,433 మందిని గత నెల 22వ తేదీ నుంచి కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ఇంటర్వ్యూలు చేయడం విశేషం. ఇక, చివరగా కరుణానిధి ఇంటర్వ్యూకు స్టాలిన్ సైతం హాజరు కాక తప్పలేదు. కొళత్తూరు బరిలో మళ్లీ ఆయన నిలబడాలంటూ దరఖాస్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చాయి. దీంతో ఆ స్థానం తనదేనని సీటును రిజర్వు చేసుకుంటూ ఇంటర్వ్యూకు దళపతి స్టాలిన్ సైతం హాజరు కాక తప్పలేదు. కరుణానిధి సంధించిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు సైతం ఇచ్చారు. ఈ దరఖాస్తుల పర్వం ముగియడంతో మంగళవారం మీడియా ముందుకు వచ్చిన కరుణానిధి ఊహాజనిత కథనాలకు ముగింపు పలికే విధంగా వ్యాఖ్యల్ని , సామెతల్ని సంధించారు. కెప్టెన్ మా వెంటే : అన్నా అరివాలయంలో పొత్తు వ్యవహారాలపై కరుణానిధి స్పందించారు. డి ఎంకే కూటమిలోకి డిఎండికే వస్తుందా..? అని ప్రశ్నించగా, పండు పక్వానికి వచ్చిందని, ఇక పాలల్లో పడాల్సిందేనని సామెతను వళ్లించారు. పొత్తు వ్యవహారాల్లో జాప్యం ఏమిటో..? అని ప్రశ్నించగా, జాప్యం ఏమీ లేదు, ఇతర వివరాలు చెప్పలేను అంటూ దాట వేశారు. విజయకాంత్ వస్తారన్న నమ్మకం ఉందా..? అని ప్రశ్నించగా, తప్పకుండా వస్తారని వ్యాఖ్యానించడం విశేషం. డీఎంకే మేనిఫెస్టో సిద్ధమా..? అని ప్రశ్నించగా, రెండు మూడు రోజుల్లో విడుదల చేయబోతున్నామన్నారు. ఇతర పార్టీల్ని కూటమిలోకి ఆహ్వానిస్తున్నారా..? అని ప్రశ్నించగా, ఇతరులెవ్వరినీ ఆహ్వానించ లేదు, ఆహ్వానించబోమని వ్యాఖ్యానించారు. ఇక, విజయకాంత్ తమ వెంటనే అన్నట్టుగా కరుణానిధి స్పందించడంతో కమలం వర్గాలు, ప్రజా కూటమి వర్గాలకు షాక్ తగిలినట్టు అయ్యాయి. ఇక, విజయకాంత్ చేజారినట్టేనా..అన్న భావనలో ఆ రెండు వర్గాలు పడ్డాయి. -
కరుణానిధికి నడిగర్ సంఘం సభ్యత్వం
తమిళసినిమా: డీఎంకే అధినేత కరుణానిధికి నడిగర్ సంఘం(దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం)లో జీవిత కాల సభ్యత్వాన్ని కల్పించారు. నడిగర్ సంఘం కార్యవర్గ సమావేశాన్ని బుధవారం సాయంత్రం టీ.నగర్, అబిబుల్లా రోడ్డులోని సంఘం ఆవ రణకు ఎదురుగా ఉన్న నందా అపార్ట్మెంట్లో నిర్వహించారు. సంఘం కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పొన్వన్నన్, కరుణాస్లతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాగా సంఘ భవన నిర్మాణంలో భాగంగా ఎస్పీఐ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడానికి 2.48 కోట్లు చెల్లించి సహకరించిన పూచ్చి మురుగన్, ఐసరి గణేశ్‌లకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. 1989లో నటుడు రాధారవి సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో డీఎంకే అధినేత కరుణానిధికి సంఘంలో జీవితకాల సభ్యత్వం కల్పించారు. అయితే 2015తో ఆయన్ని ఆ సభ్యత్వం నుంచి తొలగించి గౌరవ సభ్యత్వ పదవిని ఇచ్చారు. ఇందుకు పలువురి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. సంఘ నూతన కార్యవర్గం ఏర్పడిన తరువాత ఇప్పుడు కరుణానిధికి సంఘంలో జీవితకాల సభ్యత్వం కల్పిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అదే విధంగా సంఘం భవన నిర్మాణ నిధి కోసం ఏప్రిల్ 10న చెన్నైలో స్టార్స్ క్రికెట్ నిర్వహించాలని నిర్ణయించారు. -
తగ్గిన అనిత
- కరుణతో భేటీ - శ్రమిస్తానని హామీ సాక్షి, చెన్నై: డీఎంకే తూత్తుకుడి జిల్లా నేత అనితా ఆర్ రాధాకృష్ణన్ పట్టువీ డారు. జిల్లా కార్యదర్శి పెరియస్వామి తో కలిసి పార్టీ కోసం శ్రమించేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు గురువా రం అధినేత కరుణానిధి, దళపతి స్టాలి న్ను కలిశారు. తూత్తుకుడి జిల్లాలో తన కంటూ వ్యక్తిగత బలం కల్గిన నేత అనితా రాధాకృష్ణన్. తొలుత అన్నాడీఎంకేలో ఆ జిల్లా నేతగా, మాజీ మంత్రిగా చక్రం తిప్పిన ఘనత ఆయనది. అన్నాడీఎంకేలో ఏర్ప డ్డ విభేదాలతో డీఎంకేలోకి వచ్చారు. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక మనసు మార్చుకునే యత్నం చేశారు. డీఎంకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాకైనా, తన మనసు అంతా అన్నాడీఎంకే చుట్టూ తిరుగుతున్నట్టు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. సీఎం జయలలిత సమక్షంలో ఆ పార్టీలో చేరడానికి తీవ్రంగానే ప్రయత్నించినా, తలుపులు మాత్రం తెరచుకోలేదు. ఎట్టకేలకు తీవ్ర ప్రయత్నంతో ఓమారు కలిసే అవకాశం వచ్చినా, పార్టీలోకి ఆహ్వానం మాత్రం దక్కలేదు. దీంతో డీఎంకేలో ఉంటూనే, అన్నాడీఎంకేకు విధేయత చాటుకునే రీతిలో వ్యవహరించడం మొదలెట్టారు. దీన్ని గుర్తించిన కరుణానిధి అనితా రాధాకృష్ణన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే అన్న బో ర్డును మాత్రం తగిలించుకుని రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండడం మొదలెట్టారు. అదే సమయంలో తూత్తుకుడి డీఎంకే జిల్లా పగ్గాలు మరో మంత్రి పెరియస్వామి చేతికి చేరాయి. దీంతో రాజకీయాలకు ఇక అనిత దూరం అన్నప్రచారం ఆ జిల్లాలో బయల్దేరింది. తగ్గిన అనిత: డీఎంకేలో తనకు ఇక గుర్తింపు లేదన్న నిర్ణయానికి అనిత ఆర్ రాధాకృష్ణన్ వచ్చేశారని చెప్పవచ్చు. పార్టీకి, ప్రజలకు దూరంగా ఉండడం మొదలెట్టిన ఆయనకు అన్నాడీఎంకే నుంచి చివరి క్షణం వరకు ఆహ్వానం, పిలుపు మాత్రం రాలేదు. దీంతో వెనక్కు తగ్గారు. మనసు మార్చుకుని తనను సంక్లిష్ట పరిస్థితుల్లో అక్కున చేర్చుకుని ఎమ్మెల్యేగా నిలబెట్టిన కరుణానిధి పక్షానే ఉండడం మంచిదన్న భావనకు వచ్చేసినట్టున్నారు. దీంతో ఉదయాన్నే చెన్నైలోని గోపాలపురం మెట్లు ఎక్కేశారు. అధినేత ఎం కరుణానిధి, దళపతి స్టాలిన్లను కలుసుకున్నారు. జిల్లా కార్యదర్శి పెరియస్వామితో కలిసి, తానూ పార్టీ కోసం జిల్లాలో సేవల్ని అందిస్తానని కరుణానిధికి హామీ ఇచ్చి బయటకు వచ్చేశారు. వెలుపల మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించగా, గడిచిన కా లం చీకటి రోజులుగా పేర్కొంటూ స మాధానాలు దాట వేశారు. ఇక తన కర్తవ్యం పెరియస్వామితో కలసి పార్టీని జి ల్లాలో బలపేతం చేయడమేనని స్ప ష్టం చేసి ముందుకు సాగారు. మద్దతు ప్లీజ్ : కరుణానిధితో అనితా భేటీ అనంతరం జానపద కళాకారుడు కోవన్‌తో కలిసి మక్కల్ కలై ఇయక్కం వర్గాలు గోపాలపురానికి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల సీఎం జయలలితకు వ్యతిరేకంగా వివాదాస్పద పాటలను పాడి కోవన్ జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. కరుణానిధితో భేటీ అనంతరం బయటకు వచ్చిన కోవన్ మీడియాతోమాట్లాడుతూ డిసెంబర్లో మద్యానికి వ్యతిరేకంగా తాము చేపట్ట దలచిన మహానాడుకు మద్దతు ఇవ్వాలని కరుణానిధిని విజ్ఞప్తి చేశామన్నారు. అన్నాడీఎంకే, బీజేపీ మినహా తక్కిన అన్నిపార్టీల నాయకుల్ని కలిసి మద్దతు కోరనున్నామన్నారు. -
2016లో స్టాలినే ముఖ్యమంత్రి!
పళ్లిపట్టు : 2016లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్టాలిన్ పదవీ బాధ్యతలు చేపట్టడం ఖాయమని దిండుగల్ లియోని పేర్కొన్నారు. డీఎంకే నేత విభాగం ఆధ్వర్యంలో పళ్లిపట్టు సమీపంలోని పొదటూరుపేటలో డీఎంకే అధినేత కరుణానిధి 92వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. రాష్ట్ర నేత విభాగ ఉపాధ్యక్షుడు నాగలింగం అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఆ పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి గుమ్మిడిపూండి వేణు, మాజీ మంత్రి సుందరం తదితరులు పాల్గొని మొక్కలు నాటి జూన్ 3న జన్మించిన వారికి రూ.పది వేల చొప్పున ఆర్థిక సహాయకాలు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో దిండుగల్ లియోని ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. వేడుకల్లో భాగంగా నేత విభాగ రాష్ట్ర అధ్యక్షుడు షణ్ముగం, కార్యదర్శి సచ్చితానందనం,అన్బళగన్, శివశక్తివేల్, అన్నామలై పాల్గొన్నారు. -
ఉద్వాసన
అనిత, స్వామి అవుట్ డీఎంకే అధిష్టానం నిర్ణయం అమ్మ జపం దెబ్బ సాక్షి, చెన్నై : తన పార్టీలో ఉంటూ, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులపై డీఎంకే అధినేత కరుణానిధి కన్నెర్ర చేశారు. ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్, మాజీ మంత్రి కరుప్పుస్వామి పాండియన్‌లకు ఉద్వాసన పలికారు. ఆ ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ గురువారం ప్రకటించారు. తూత్తుకుడి జిల్లా రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపును కల్గిన నాయకుడు అనితా రాధాకృష్ణన్, తిరునల్వేలి జిల్లాలో తన కంటూ బలగాన్ని కల్గిన నేత కరుప్పుస్వామి పాండియన్. ఈ ఇద్దరు ఒకప్పుడు అన్నాడీఎంకే నాయకులే. ఆ పార్టీ ప్రభుత్వ పాలనలో మంత్రులుగా కూడా పనిచేశారు. పార్టీలో ఏర్పడ్డ విబేధాలతో బయటకు వచ్చిన ఈ ఇద్దరు డీఎంకే గొడగు నీడన ఆశ్రయం పొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచెందూరు నియోజకవర్గం నుంచి అనితా రాధాకృష్ణన్ విజయ కేతనం ఎగుర వేశారు. ఇక, తిరునల్వేలిలో కరుప్పు స్వామి పాండియన్ ఓటమి చవి చూశారు. డీఎంకే జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయనకు ఇటీవలి సంస్థాగత ఎన్నికలు ఆ పదవి దూరం చేశాయి. కొంత కాలంగా డీఎంకేతో అంటి ముట్టనట్టుగా ఈ ఇద్దరు వ్యవహరిస్తూ వచ్చారు. తిరునల్వేలిలో డీఎంకే మాజీ స్పీకర్ అవుడయప్పన్తో పెరిగిన వైర్యం కరుప్పు స్వామి పాండియన్‌కు పార్టీలో గడ్డు పరిస్థితులు సృష్టించాయి. ఇక డీఎంకేలో ఇమడ లేమన్న నిర్ణయానికి వచ్చిన ఈ నేతలు మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు తమ తమ ప్రయత్నాల్లో పడ్డారు. ఇందుకు అదునైన సమయం కోసం వేచి చూశారు. అమ్మకు అభినందన : అన్నాడీఎంకేలోకి ఎలా వెళ్లాలో ఎదురు చూసిన ఈ నేతలకు ఆ పార్టీ అధినేత్రి జయలిత విడుదల తీర్పు మార్గాన్ని చూపించింది. ఇదే అదనుగా భావించిన అనితా రాధాకృష్ణన్ ఏకంగా నాలుగు అడుగులు ముందుకు వేశారు. అమ్మకు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, అమ్మ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అయితే, తన పదవికి రాజీనామా చేయడానికి రెడీ అని ప్రకటించారు. తిరుచెందూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని విన్నవించారు. తానేమి తక్కువ తిన్నానా అన్నట్టుగా కరుప్పు స్వామి పాండియన్ మరింతగా రెచ్చి పోయారు. తన ఇంటి ముందు పెద్ద ఎత్తున బాణ సంచాలు పేల్చుతూ, అమ్మ విడుదల ఆనందాన్ని అందరితో భారీ సంబరాలతో పంచుకున్నారు. ఉద్వాసన : వీరి చర్యలు డీఎంకే అధినేత కరుణానిధికి ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ఆ ఇద్దరిపై చర్యకు సిద్ధం అయ్యారు. డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ద్వారా ఆ ఇద్దరికి ఉద్వాసన పలుకుతూ ఆదేశాలు ఇప్పించారు. పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ ఇద్దర్ని తాత్కాలికంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. అన్ని పదవుల నుంచి వారిని సస్పెండ్ చేసినట్టు, ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా వారి పేర్లను తొలగించినట్టుగా వెల్లడించారు. తమను ఎప్పుడెప్పుడు బయటకు పంపిస్తారా..? అన్న ఎదురు చూపుల్లోనూ ఆ ఇద్దరు నేతలు ఉండడం గమనార్హం. ఇక ఆ ఇద్దర్నీ మళ్లీ పార్టీలోకి జయలలిత ఆహ్వానిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే. ఎందుకంటే, ఆ ఇద్దరు గతంలో ఏకంగా జయలలితతో ఢీకొట్టి బయటకు రావడమే. ఇది వరకు ఓ మారు అన్నాడీఎంకేలోకి మళ్లీ వెళ్లేందుకు అనిత యత్నించినా, అందుకు ఆస్కారం లభించకపోవడం గమనించాల్సిన విషయం. -
కనిమొళికి ఆశీస్సులు
డీఎంకే అధినేత కరుణానిధి గారాల పట్టి కనిమొళి సోమవారం 47వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఆమె మద్దతుదారులు, డీఎంకే వర్గాలు బర్త్‌డేను ఘనంగా జరుపుకున్నారు. తండ్రి కరుణానిధి, తల్లి రాజాత్తి అమ్మాల్, సోదరుడు స్టాలిన్‌కు కనిమొళి పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నారు. సాక్షి, చెన్నై: కరుణానిధికి గారాలపట్టి కనిమొళి. చిన్న కూతురు అంటే ఎంతో అభిమానం. తన అడుగు జాడల్లో ఆమెను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. అందలం ఎక్కించే యత్నం చేసినా, వారసులు అడ్డుపడడంతో వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి. జైలు జీవితం నుంచి బయటకు వచ్చిన తన గారాలపట్టిని మళ్లీ రాజ్యసభలో కూర్చోబెట్టేందుకు కరుణానిధి తీవ్రంగానే యత్నించారు. ఎట్టకేలకు ఆమె గెలవడంతో డీఎంకే రాజ్యసభ నేతగా వ్యవహరిస్తున్నారు. పార్టీ పరంగా ఆమెను అందలం ఎక్కించాలన్న కాంక్షతో ఉంటున్న కరుణానిధి సోమవారం తన గారాల పట్టికి ఆశీస్సులు అందించారు. ఆశీస్సులు: 2జీ స్పెక్ట్రమ్ కేసులో కనిమొళి జైలు జీవి తాన్ని అనుభవించిన విషయం తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలో గత ఏడాది తన బర్త్‌డేను ఆమె నిరాడంబరంగా జరుపుకున్నారు. 47వ వసంతంలోకి అడుగు పెట్టిన కనిమొళికి శుభాకాంక్షలు తెలియజేయడానికి సీఐటీ కాలనీకి పెద్ద ఎత్తున పార్టీ వర్గాలు, మద్దతు నాయకులు తరలి వచ్చారు. ఉదయాన్నే తండ్రి కరుణానిధి, తల్లి రాజాత్తి అమ్మాల్ పాదాలకు నమస్కరించి, కని మొళి ఆశీస్సులు అందుకున్నారు. తన గారాల పట్టిని ఆప్యాయంగా పలకరిస్తూ, తన ఆశీస్సుల్ని కరుణానిధి అందజేశారు. తల్లిదండ్రుల సమక్షంలో ఆమె కేక్ కట్‌చేశారు. తండ్రి కరుణానిధికి తినిపించారు. అదే సమయంలో చిన్న అన్నయ్య స్టాలిన్ రావడంతో పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకున్నారు. కనిమొళికి స్టాలిన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆమె ఇంటి వద్ద పండుగ కోలాహలం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మద్దతుదారులు, డీఎంకే వర్గాలు అక్కడికి చేరుకుని బాణసంచాలు పేల్చుతూ, స్వీట్లు పంచారు. డీఎంకే నేతలు టీ ఆర్ బాలు, దయానిధి మారన్, కేపి రామలింగం, సద్గుణ పాండియన్, పుగలేంది, కేపి మునుస్వామి, తాము అన్భరసన్, వాసంతి స్టాన్లీ, అన్భళగన్, శేఖర్ బాబు, టీకేఎస్ ఇళంగోవన్ తదితరులు కనిమొళికి శుభాకాంక్షలు తెలియ జేశారు.