మాటల యుద్ధం
తమిళనాడు ఎన్నికలు మద్య నిషేధం చుట్టూ పరిభ్రమిస్తుండగా ప్రధాన ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధమే సాగుతోంది. ప్రచార వేదికలపై పరస్పర విమర్శలతో ప్రసంగాల పోరు సాగుతోంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: మద్యం నిషేధం వాగ్దానాన్ని మెప్పించిన వారికే ప్రజలకు పట్టం కట్టనున్నారని ఈ రెండు పార్టీలూ విశ్వసిస్తున్న కారణంగా ప్రతి వేదికపైనా ప్రధాన అంశంగా మారింది. ఎన్నికల వాతావరణం ఆరంభానికి ముందే డీఎంకే అధినేత కరుణానిధి సంపూర్ణ మద్య నిషేధం వాగ్దానం చేసి ముందు వరుసలో నిలిచారు. ఎన్నికల ప్రచార తొలి సభలో అన్నాడీఎంకే అధినేత్రి సైతం అధికారంలోకి వస్తే దశలవారీ మద్య నిషేధం ఖాయమని వాగ్దానం చేశారు.
అంతేగాక మద్యంపై నిషేధాన్ని ఎత్తివేసిన డీఎంకే నేడు మరలా నిషేధం మాట ఎత్తడం చోద్యమని సోమవారం రాత్రి కాంచీపురంలో నిర్వహించిన ఎన్నికల సభలో ఎద్దేవా చేశారు. కరుణానిధి వాగ్దానమే నిజమైతే మేనిఫెస్టోలో సంపూర్ణ మద్య నిషేధం అనకుండా మద్య నిషేధం అని మాత్రమే అని ఎందుకు పేర్కొన్నారని జయ నిలదీశారు. సంపూర్ణ అనే పదాన్ని ఎందుకు చేర్చలేదు, అలాంటి పదం ఒకటి ఉందని కరుణానిధి మరిచిపోయారా అంటూ వ్యాఖ్యానించారు.
అధికారంలోకి వస్తే తొలి సంతకం మద్య నిషేధం పైనే అని ఎందుకు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. ఎందుకంటే సంపూర్ణ మద్య నిషేధం అమలు చేసే ఉద్దేశమే ఆయనకు, ఆ పార్టీకి లేదని జయ వ్యాఖ్యానించారు. సంపూర్ణ మద్య నిషేధం కరుణానిధికి సాధ్యం కాదని ఆమె పేర్కొన్నారు. అన్నాడీఎంకే అధికారంలోకి వస్తే దశలవారీ మద్య నిషేధం సాధించి చూపుతానని హామీ ఇచ్చారు. డీఎంకే కోశాధికారి స్టాలిన్ పెరంబలూరు జిల్లాలో మంగళవారం నిర్వహించిన ప్రచార సభల్లో జయలలిత వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు.
కాంచీపురంలో జయలలిత చేసిన వ్యాఖ్యలపై ఎదురుదాడికి దిగారు. నిషేధం అంటే సంపూర్ణ మద్య నిషేధం అంటే అన్న సంగతి జయలలితకు తెలియక పోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. మద్య నిషేధంపై చట్టాన్ని తీసుకువస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నాం, రాజాజీ ముఖ్యమంత్రిగా ఉండగా సైతం ‘తమిళనాడు మద్య నిషేధ చట్టం-1937’ అని తెచ్చారని గుర్తుచేశారు. తమిళనాడులో ప్రభుత్వం వస్తే ఒక్క బొట్టు మద్యం కూడా ఉండదని హామీ ఇచ్చారు.
పీఎంకే ఎద్దేవా
ప్రధాన ప్రత్యర్థుల పోరు ఇలా ఉండగా, మద్య నిషేధం తేవడంలో అన్నాడీఎంకే, డీఎంకే దొందూ దొందే అంటూ పీఎంకే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్బుమణి రాందాస్ ఎద్దేవా చేస్తూ ప్రచారాలు సాగిస్తున్నారు. మద్య నిషేధంపై ఇప్పటికే ఐదుసార్లు వాగ్దానం చేసిన డీఎంకే ఆరోసారి సిద్ధమైందని వ్యాఖ్యానించారు. గత ఐదేళ్లుగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఇన్నాళ్లు మిన్నకుండి మరో ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే మద్య నిషేధం తెస్తామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. మద్య నిషేధం హామీలు ఇచ్చే ముందు తమ పార్టీల వారి లిక్కర్ ఫ్యాక్టరీలను ఎత్తివేయాలని హితవు పలికారు. పార్టీ నేతలతో మద్యం వ్యాపారం చేయిస్తూ నిషేధం మాటలు చెబితే ప్రజలు నమ్మేస్థితిలో లేరని అన్బుమణి పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం ప్రవాహంలా ఎన్నికల్లో పార్టీల మధ్య సాగుతున్న మాటల ప్రవాహం ప్రజలకు వినోదాన్ని కలిగిస్తోంది.