అనిత, స్వామి అవుట్
డీఎంకే అధిష్టానం నిర్ణయం
అమ్మ జపం దెబ్బ
సాక్షి, చెన్నై : తన పార్టీలో ఉంటూ, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులపై డీఎంకే అధినేత కరుణానిధి కన్నెర్ర చేశారు. ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్, మాజీ మంత్రి కరుప్పుస్వామి పాండియన్‌లకు ఉద్వాసన పలికారు. ఆ ఇద్దరిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నామని డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ గురువారం ప్రకటించారు. తూత్తుకుడి జిల్లా రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపును కల్గిన నాయకుడు అనితా రాధాకృష్ణన్, తిరునల్వేలి జిల్లాలో తన కంటూ బలగాన్ని కల్గిన నేత కరుప్పుస్వామి పాండియన్.
ఈ ఇద్దరు ఒకప్పుడు అన్నాడీఎంకే నాయకులే. ఆ పార్టీ ప్రభుత్వ పాలనలో మంత్రులుగా కూడా పనిచేశారు. పార్టీలో ఏర్పడ్డ విబేధాలతో బయటకు వచ్చిన ఈ ఇద్దరు డీఎంకే గొడగు నీడన ఆశ్రయం పొందారు. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచెందూరు నియోజకవర్గం నుంచి అనితా రాధాకృష్ణన్ విజయ కేతనం ఎగుర వేశారు. ఇక, తిరునల్వేలిలో కరుప్పు స్వామి పాండియన్ ఓటమి చవి చూశారు. డీఎంకే జిల్లా కార్యదర్శిగా పనిచేసిన ఆయనకు ఇటీవలి సంస్థాగత ఎన్నికలు ఆ పదవి దూరం చేశాయి. కొంత కాలంగా డీఎంకేతో అంటి ముట్టనట్టుగా ఈ ఇద్దరు వ్యవహరిస్తూ వచ్చారు. తిరునల్వేలిలో డీఎంకే మాజీ స్పీకర్ అవుడయప్పన్‌తో పెరిగిన వైర్యం కరుప్పు స్వామి పాండియన్‌కు పార్టీలో గడ్డు పరిస్థితులు సృష్టించాయి. ఇక డీఎంకేలో ఇమడ లేమన్న నిర్ణయానికి వచ్చిన ఈ నేతలు మళ్లీ సొంత గూటికి వెళ్లేందుకు తమ తమ ప్రయత్నాల్లో పడ్డారు. ఇందుకు అదునైన సమయం కోసం వేచి చూశారు.
అమ్మకు అభినందన : అన్నాడీఎంకేలోకి ఎలా వెళ్లాలో ఎదురు చూసిన ఈ నేతలకు ఆ పార్టీ అధినేత్రి జయలిత విడుదల తీర్పు మార్గాన్ని చూపించింది. ఇదే అదనుగా భావించిన అనితా రాధాకృష్ణన్ ఏకంగా నాలుగు అడుగులు ముందుకు వేశారు. అమ్మకు శుభాకాంక్షలు తెలపడమే కాకుండా, అమ్మ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అయితే, తన పదవికి రాజీనామా చేయడానికి రెడీ అని ప్రకటించారు. తిరుచెందూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని విన్నవించారు. తానేమి తక్కువ తిన్నానా అన్నట్టుగా కరుప్పు స్వామి పాండియన్ మరింతగా రెచ్చి పోయారు. తన ఇంటి ముందు పెద్ద ఎత్తున బాణ సంచాలు పేల్చుతూ, అమ్మ విడుదల ఆనందాన్ని అందరితో భారీ సంబరాలతో పంచుకున్నారు.
ఉద్వాసన : వీరి చర్యలు డీఎంకే అధినేత కరుణానిధికి ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ఆ ఇద్దరిపై చర్యకు సిద్ధం అయ్యారు. డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ ద్వారా ఆ ఇద్దరికి ఉద్వాసన పలుకుతూ ఆదేశాలు ఇప్పించారు. పార్టీ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆ ఇద్దర్ని తాత్కాలికంగా బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.
అన్ని పదవుల నుంచి వారిని సస్పెండ్ చేసినట్టు, ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా వారి పేర్లను తొలగించినట్టుగా వెల్లడించారు. తమను ఎప్పుడెప్పుడు బయటకు పంపిస్తారా..? అన్న ఎదురు చూపుల్లోనూ ఆ ఇద్దరు నేతలు ఉండడం గమనార్హం. ఇక ఆ ఇద్దర్నీ మళ్లీ పార్టీలోకి జయలలిత ఆహ్వానిస్తారా..? అన్నది వేచి చూడాల్సిందే. ఎందుకంటే, ఆ ఇద్దరు గతంలో ఏకంగా జయలలితతో ఢీకొట్టి బయటకు రావడమే. ఇది వరకు ఓ మారు అన్నాడీఎంకేలోకి మళ్లీ వెళ్లేందుకు అనిత యత్నించినా, అందుకు ఆస్కారం లభించకపోవడం గమనించాల్సిన విషయం.
ఉద్వాసన
Published Fri, May 15 2015 1:50 AM | Last Updated on Sun, Sep 3 2017 2:02 AM
Advertisement
Advertisement