సాక్షి, చెన్నై: ‘కలైంగర్’ కరుణానిధి ఆరోగ్యం మరింత విషమించటంతో అభిమానుల్లో ఆందోళన పెరిగిపోతోంది. 24 గంటలు గడిస్తేగానీ ఏం చెప్పలేమంటూ వైద్యులు ప్రకటించటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. గత రాత్రి నుంచి కావేరీ ఆస్పత్రి వద్దకు క్యూ కట్టిన కార్యకర్తలు.. ఈ ఉదయం నుంచి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. కార్యకర్తల రోదనలతో అక్కడంతా విషాదఛాయలు అలుముకున్నాయి. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు ఆస్పత్రి వద్ద వెయ్యి మంది పోలీసులతో ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేసింది. మరోవైపు నగరంలోకి పలుచోట్లా పోలీసులు భారీగా మోహరించారు.
ఇదిలా ఉంటే భార్య దయాళు అమ్మల్ , కూతురు కనిమొళిలు ఆస్పత్రికి చేరుకుని కరుణను పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన కనిమొళి.. ఆందోళన వద్దంటూ కార్యకర్తలకు ధైర్యం చెప్పే యత్నం చేశారు. ‘వచ్చే 24 గంటలపాటు వైద్య సేవలకు ఆయన శరీరం ఎలా సహకరిస్తుందనేదే కీలకం’ నిన్న వైద్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు సీరియస్ కథనాల నేపథ్యంలో నిన్న అర్ధరాత్రి ఆయన చనిపోయారంటూ ఫేక్ పోస్టర్లు నిన్నంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే డీఎంకే కార్యకర్తలు శ్రద్ధాంజలి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం కలవరపాటుకు గురి చేసింది.
వయో భారం సమస్యలతో బాధపడుతున్న కరుణానిధిని.. జూలై 27 అర్ధరాత్రి ఆరోగ్యం విషమించటంతో కుటుంబ సభ్యులు కావేరీ ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రముఖులంతా ఒక్కోక్కరిగా ఆస్పత్రికి వెళ్లి కలైంగర్‌ను పరామర్శిస్తున్నారు. ఈ క్రమంలో నిన్నటిదాకా నిలకడగా ఉన్న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా మారిపోయింది. జాండీస్ సోకటం, దానికితోడు నిన్నటి నుంచి ఆయన ఊపిరి పీల్చుకోవటం కష్టంగా మారిందని వైద్యులు వెల్లడించారు. ఆయనకు చికిత్స కొనసాగుతుండగా.. ఈ సాయంత్రం కల్లా హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment