సాక్షి, చెన్నై: నగరంలోని కావేరీ ఆస్పత్రి వద్ద మీడియా ప్రతినిధులు, డీఎంకే కార్యకర్తలు భారీ సంఖ్యలో కనిపిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రముఖులు ఆస్పత్రికి చేరుకుంటున్నారు. డీఎంకే అధినేత ఎంకే కరుణానిధి తీవ్ర అస్వస్థతతో ఇదే ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. గత రాత్రి పరిస్థితి విషమించటంతో 94 ఏళ్ల కరుణానిధిని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఉదయం ఆయన కుమార్తె కనిమొళి ఆస్పత్రికి వెళ్లి తండ్రిని పరామర్శించారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు.
‘ప్రస్తుతం నాన్న ఆరోగ్యం కాస్త మెరుగుపడింది. బీపీ కంట్రోల్‌లోకి వచ్చింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రెండు రోజుల్లో పూర్తి ఆరోగ్యవంతంగా తిరిగొస్తారు. మరికాసేపట్లో వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తామని చెప్పారు’ అని కనిమొళి అన్నారు. ‘కరుణానిధి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు ఆరాతీస్తున్నాం. వైద్యులతో చర్చించి మెరుగైన చికిత్సలు అందిచాలని కోరాం. ప్రస్తుతం కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు’ అని తమిళనాడు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విజయ్ భాస్కర్ తెలిపారు.
పరామర్శల వెల్లువ... కాగా, కావేరి ఆస్పత్రికి వెళ్లిన తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్.. మాజీ సీఎం కరుణానిధిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు, తనయుడు స్టాలిన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆర్కే నగర్ ఎమ్మెల్యే దినకరన్, నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్, సీనియర్ నటుడు ప్రభు, పాండిచ్చేరి మాజీ సీఎం రంగస్వామి తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. మరోవైపు సీఎం పళనిస్వామి కూడా వైద్యులను ఫోన్ చేసి పరిస్థితి ఆరా తీశారు. అసరమైతే ప్రభుత్వం తరపున మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన కోరారు.
గుండెపోటుతో... కుటుంబ సభ్యులు, ముఖ్య నేతలు ధైర్యం చెబుతున్నప్పటికీ కార్యకర్తలు, అభిమానులు మాత్రం ఇంకా ఆందోళన చెందుతూనే ఉన్నారు. కరుణానిధి అస్వస్థత వార్త తట్టుకోలేక డీఎంకే కార్యకర్త ఒకరు గుండెపోటుతో మృతి చెందారు. మృతుడిని తిరువారూర్ ముత్తుపేటకు చెందిన తమీమ్‌గా గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment