ప్రశాంతం
- 75 శాతం పొలింగ్
- మొరయించిన ఈవీఎంలు
- ఓటు వేసిన జయ,కరుణ
- తారలు దిగివచ్చిన వేళ
చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు, పుదుచ్చేరీలలో గురువారం లోక్‌సభల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు ఒకే విడతగా పోలింగ్ జరిపారు. శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం కలగకున్నా పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు ఓటర్లను ఇబ్బందులకు గురిచేశారు.
మరికొన్ని చోట్ల ప్రజలు పోలింగ్‌కు హాజరుకాకుండా ఎన్నికలను బహిష్కరించారు. రాత్రి 7 గంటలకు అందిన అధికారిక సమాచారం ప్రకారం మొత్తం మీద 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. తమిళనాడు, పుదుచ్చేరీలను కలుపుకుని మొత్తం 40 లోక్‌సభ స్థానాలకు 845 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. వీరిలో 517 మంది స్వతంత్ర అభ్యర్థులు, 55 మంది మహిళలు ఉన్నారు.
5.5 కోట్ల మంది ఓటర్ల కోసం 60 వేల పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈ నెల 22వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రచారం ముగిసిన వెంటనే ఎన్నికల కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. పోలింగ్ సందర్భంగా గురువారం ఉదయం 6 గంటలకు 144 సెక్షన్‌ను ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది.
అనధికార సమాచారం ప్రకారం 72 శాతం పోలింగ్ నమోదైంది. ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రచారం చేయడం ద్వారా 100 శాతం పోలింగ్ నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. పోలింగ్ రోజున ఖచ్చితంగా సెలవు ప్రకటించాలని, ధిక్కరిస్తే చర్యలు తప్పవని ఈసీ చేసిన హెచ్చరికల ప్రభావం పోలింగ్‌లో కనపడింది. భారీ షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లే కాక చిన్నపాటి కిళ్లీకొట్టుకు సైతం తాళం వేసి ఓటింగ్‌లో పాల్గొన్నారు. అనేక ప్రాంతాల్లో ఉదయం 6.30 గంటలకే బారులు తీరారు.
అయితే కొన్ని చోట్ల 9 గంటల వరకు ఓటర్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఎండవేడిమితో ముందుజాగ్రత్త పాటించిన వృద్ధులు 8 గంటల్లోపే ఓటు వేసి వెళ్లిపోయారు. కొత్తగా ఓటు హక్కును పొందిన యువ ఓటర్లు మీడియాకు పోటీపడి ఫోజులిచ్చారు.
ప్రజలు ఈ స్థాయిలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ముందుకు రావడం ఆశ్చర్యంగా ఉందని అనేక చోట్ల అధికారులే వ్యాఖ్యానించారు. ఉదయం 9 గంటలకే 14.3 శాతం పోలింగ్ నమోదై మధ్యాహ్నం ఒంటి గంటకు 50 శాతానికి చేరింది.
మొరాయించిన ఈవీఎంలు
ఓటేసేందుకు ప్రజలు ఉత్సాహంగా ముందుకు వచ్చినా ఈవీఎంలు మొరాయించడంతో విసుగు చెందారు. రాష్ట్రం మొత్తం మీద 349 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించి ఓటర్ల సహనాన్ని పరీక్షించాయి. డీఎంకే అధినేత కరుణానిధి ఓటేయాల్సిన గోపాలపురంలోని పోలింగ్ కేంద్రంలో ఉదయం 7 గంటలకు ప్రారంభ దశలోనే ఈవీఎంలు పనిచేయలేదు.
దీంతో 40 నిమిషాలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. రాజా అన్నామలై పురం, కేకే నగర్, అశోక్‌నగర్, కొరటూరులో 30 నిమిషాలు, అంబత్తూరు, కల్లికుప్పంలలో గంట ఆలస్యమైంది. కొళత్తూరు, మడిపాక్కం, తిరువల్లిక్కేనీ తదితర 15 చోట్ల ఈవీఎంల కారణంగా జాప్యమైంది. విల్లుపురం సమీపంలోని నైవేలీలో 7.20 గంటలకు, తొండమేటలో 8.30 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
సెంగున్రం సమీపం పుదునగర్‌లో 6.30 గంటలకే ఓటర్లు సిద్ధమయ్యూరు. అయితే అక్కడి మహిళా బూత్‌లో ఆరంభంలోని ఈవీఎంలు పనిచేయలేదు. 8.15 గంటలకు అక్కడ పోలింగ్‌ను ప్రారంభించారు. పుదుక్కోట్టై పోస్‌నగర్ మునిసిపల్ స్కూల్ 60వ నెంబర్ బూత్‌లో ఒక్క ఓటు కూడా పడకుండానే ఈవీఎంలు పనిచేయలేదు. కొద్దిసేపు ప్రయత్నించిన అధికారులు ఆ తరువాత లోపలివైపు తాళం వేసుకున్నారు.
ఓటేసేందుకు ఎండలో క్యూలో ఉన్న ఉన్న ఓటర్లు గొడవకు దిగారు. గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ధర్మపురిలో అత్యధికంగా 80 శాతం, ద్వితీయ స్థానంలో కృష్ణగిరి, తిరువన్నామలై, కల్లకురిచ్చీ, సేలం, కడలూరులలో 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. మిగిలిన స్థానాల్లో 65 నుంచి 70 శాతం పోలింగ్ నమోదైంది.
పోలింగ్ బహిష్కరణ
తాంబరం, పల్లడం, ఓవేలీ తదితర ప్రాంతాల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. తాగునీరు, రోడ్లు వంటి కనీస ప్రాథమిక సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించలేదని ఆరోపిస్తూ ఓటేసేందుకు నిరాకరించారు. మరుదూర్ ప్రాంతాల్లోని 300 మంది ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించడంతోపాటూ గ్రామ నడిబొడ్డుకు వచ్చి నిరసన నినాదాలు చేశారు.
దిండుగల్లు జిల్లా నేలకొట్టై సమీపం కారియం పట్టిలో పోలింగ్ బూత్ సిబ్బంది ఓటేసేవారు రాక ఖాళీగా కూర్చున్నారు. కులశేఖరం సమీపం పేచ్చివారై నదికి ఆవలి ఉన్న కొండగ్రామాల ప్రజలు పోలింగ్‌ను బహిష్కరించారు. అయితే అధికారులు వెళ్లి నచ్చజెప్పడంతో పడవపై నదిని దాటివచ్చి ఓటేశారు.
ఓటేసిన ప్రముఖులు
రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత తన ఇంటికి సమీపంలోని స్టెల్లామెరీస్ కాలేజీలో 9.10 గంటలకు తన నెచ్చెలి శశికళతో పాటు వచ్చి ఓటేశారు.
డీఎంకే అధినేత కరుణానిధి, కోశాధికారి స్టాలిన్ గోపాలపురంలో, కరుణ కుమార్తె కనిమొళి సీఐటీ కాలనీలో 11గంటల సమయంలో ఓటు వేశారు. కరుణ ప్రయాణిస్తున్న కారు పోలింగ్ బూత్ వద్ద ఉన్న జయంతి (4) అనే మహిళ కాలుపై ఎక్కడంతో కొద్దిసేపు కలకలం రేగింది. డీఎండీకే అధినేత విజయకాంత్ 11.30 గంటలకు సాలిగ్రామంలో ఓటేశారు. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా జయ ఓటేసిన స్టెల్లామెరీస్ కాలేజీలోనే 7.10 గంటలకే ఓటేసి వెళ్లిపోయారు.
కమల్‌హాసన్, గౌతమి కలిసి ఆళ్వారుపేటలో ఓటేశారు. హీరోలు సూర్య, కార్తి, వారి తండ్రి సీనియర్ నటులు శివకుమార్ ఒకేసారి ఓటేశారు. హీరో అజిత్, షాలిని దంపతులు, హీరోలు విజయ్, జీవా, హీరోయిన్లు ఖుష్బు, స్నేహ తదితరులు ఓటువేశారు.