కరుణానిధికి నడిగర్ సంఘం సభ్యత్వం
తమిళసినిమా: డీఎంకే అధినేత కరుణానిధికి నడిగర్ సంఘం(దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం)లో జీవిత కాల సభ్యత్వాన్ని కల్పించారు. నడిగర్ సంఘం కార్యవర్గ సమావేశాన్ని బుధవారం సాయంత్రం టీ.నగర్, అబిబుల్లా రోడ్డులోని సంఘం ఆవ రణకు ఎదురుగా ఉన్న నందా అపార్ట్‌మెంట్‌లో నిర్వహించారు. సంఘం కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ, ఉపాధ్యక్షులు పొన్‌వన్నన్, కరుణాస్‌లతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. కాగా సంఘ భవన నిర్మాణంలో భాగంగా ఎస్‌పీఐ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేయడానికి 2.48 కోట్లు చెల్లించి సహకరించిన పూచ్చి మురుగన్, ఐసరి గణేశ్‌లకు ముందుగా కృతజ్ఞతలు తెలిపారు.
1989లో నటుడు రాధారవి సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో డీఎంకే అధినేత కరుణానిధికి సంఘంలో జీవితకాల సభ్యత్వం కల్పించారు. అయితే 2015తో ఆయన్ని ఆ సభ్యత్వం నుంచి తొలగించి గౌరవ సభ్యత్వ పదవిని ఇచ్చారు. ఇందుకు పలువురి నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. సంఘ నూతన కార్యవర్గం ఏర్పడిన తరువాత ఇప్పుడు కరుణానిధికి సంఘంలో జీవితకాల సభ్యత్వం కల్పిస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. అదే విధంగా సంఘం భవన నిర్మాణ నిధి కోసం ఏప్రిల్ 10న చెన్నైలో స్టార్స్ క్రికెట్ నిర్వహించాలని నిర్ణయించారు.