
చెన్నై: శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి అద్భుత కానుకను అందించారు. తమిళనాడులోని రామేశ్వరంలో కొత్తగా నిర్మించిన పంబన్ రైలు వంతెన(Pamban Railway Bridge)ను ప్రధాని మోదీ దేశానికి అంకితం చేశారు. ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమానికి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ హాజరుకాలేదు. దీని వెనుక కారణం ఏమై ఉంటుందా? అని పలువురు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. దీనికి సీఎం స్టాలిన్ స్వయంగా సమాధానమిచ్చారు.
2019లో రూ.700 కోట్ల వ్యయంతో పంబన్ వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. నేడు ప్రధాని మోదీ పంబన్ వంతెనను ప్రారంభించడంతో పాటు, రామేశ్వరం-తాంబరం (చెన్నై) మధ్య నడిచే నూతన రైలు సర్వీసుకు కూడా పచ్చ జెండా చూపారు. తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్(Railway Minister Ashwini Vaishnav), తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగం తేనరసు తదితరులు పాల్గొన్నారు.
తాజాగా ముఖ్యమంత్రి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, ‘రామేశ్వరంలో జరిగే పంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమానికి తాను హాజరు కాలేనని ముందుగానే ప్రధాని నరేంద్ర మోదీకి తెలియజేశానని, రాష్ట్రంలోని నీలగిరిలో ఇంతకు ముందే నిర్ణయించిన కార్యక్రమాలకు తాను హాజరు కావాల్సి ఉందని వివరించానన్నారు. అందుకే తాను వంతెన ప్రారంభోత్సవానికి రాలేనని తెలియజేశానన్నారు. అయితే తమ ప్రభుత్వం తరపున మంత్రులు తంగం తెన్నరసు, రాజకన్నప్పన్ ప్రధానమంత్రిని స్వాగతిస్తారని ముందుగానే తెలియజేశానని సీఎం స్టాలిన్ పేర్కొన్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్(Tamil Nadu CM Stalin) ఆదివారం (ఏప్రిల్ 6) ఉదగమండలంలో రూ.494.51 కోట్లతో నిర్మించిన 1,703 ప్రభుత్వ నిర్మాణాలను ప్రారంభించారు. ఇందులో కొత్తగా నిర్మించిన ఉదగమండలం ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రి కూడా ఉంది. దీనితో పాటు, నీలగిరి జిల్లాలో రూ. 130.35 కోట్ల విలువైన 56 కొత్త ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు.
ఇది కూడా చదవండి: ఫేర్‌వెల్‌లో స్పీచ్ ఇస్తూ.. గుండెపోటుతో 20 ఏళ్ల విద్యార్థిని మృతి