దర్శకుడు చేరన్, కూతురికి సమన్లు
చెన్నై: సినీ దర్శకుడు చేరన్ ఆయన కుమార్తె నివేద ప్రియదర్శినులకు చెక్కు మోసం కేసులో పరమకుడి కోర్టు సమన్లు జారీ చేసింది. వివరాల్లోకెళితే దర్శకుడు చేరన్ సీ2హెచ్ పేరుతో కొత్త సినిమాలను సీడీల రూపంలో అందించే సంస్థను ప్రారంభించారు. దీనికి తన కూతురు నివేద ప్రియదర్శినిని నిర్మాత, డైరెక్టర్ గా నియమించారు. కాగా ఈసీ2 హెచ్ తరపున పరమకుడి, పార్తిపనూర్, ముదుకుళత్తూర్, కముది, అభిరామం ప్రాంతాలకు ఏజెంట్‌గా పరమకుడి, మాధవన్ నగర్‌కు చెందిన పళముత్తునాదన్‌ను నియమించారు. అందుకుగాను ఆయన డిపాజిట్‌గా 80 వేల రూపాయల్ని చేరన్‌కు ఇచ్చారు.
అయితే సీ2హెచ్ సంస్థ నిర్వాహణ అంత ఆశాజనకంగా లేకపోవడంతో పళముత్తునాథన్ డిపాజిట్ చేసిన డబ్బును లెక్క చూసి తిరిగి చెల్లించనున్నట్లు చేరన్,ఆయన కూతురు ఒప్పుకున్నారని సమాచారం. కాగా చెప్పినట్లుగానే ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో పళముత్తునాదన్‌కు వారు ఇచ్చారు. చెక్కును పళముత్తునాదన్ పరమకుడిలోని బ్యాంకులో వేయగా చెక్కు బౌన్స్ అయింది.
ఇలా పలుమార్లు చెక్కు బౌన్స్ అవడంతో పళముత్తునాథన్ పరమకుడి కోర్టును ఆశ్రయించారు. చెక్కు మోసం పేరుతో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తి ఇన్బకార్తికేయన్ దర్శకుడు చేరన్, ఆయన కుమార్తె నివేద ప్రియదర్శినులకు ఈ నెల 30న కోర్టుకు హాజరు కావలసిందిగా సమన్లు జారీ చేశారు.