♦ సీఎం కేజ్రీవాల్ నివాసం వద్ద ధర్నా
♦ నిరసనకారులను నియంత్రించేందుకు
♦ వాటర్ కేనన్ల ప్రయోగించిన పోలీసులు
♦ గూండాలకు కొమ్ముకాస్తే సహించేదిలేదు: సతీశ్ ఉపాధ్యాయ
♦ ఈ కేసుతో మంత్రి అసీమ్‌కు సంబంధం ఉందని ఆరోపణ
♦ అసీం కేబినెట్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్
సాక్షి, న్యూఢిల్లీ : తుర్క్‌మాన్ గేట్ ‘రోడ్ రేజ్’ కేసు విషయంలో ఆప్ ప్రభుత్వం మెతకగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు గురువారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు ధర్నా జరిపారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షడు సతీష్ ఉపాధ్యాయ నేతృత్వంలో కార్యకర్తలు బారికేడ్లను దాటడానికి ప్రయత్నించారు. దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. నిరసనకారులను చెల్లాచెదురు చేయడం కోసం పోలీసులు వాటర్ కేనన్లను ప్రయోగించారు.
శాంతిభద్రతలను పరిరక్షిస్తానని ఇచ్చిన హామీని గాలికి వదిలేసిన ప్రభుత్వం.. ఇప్పుడు నేరగాళ్లకు కొమ్ముకాస్తోందని బీజేపీ ఆరోపించింది. కారును ఢీకొట్టాడన్న కోపంతో మోటారుసైక్లిస్టును కొట్టి చంపిన కేసులో ప్రధాన నిందితుడైన అమీన్ పెహల్వాన్‌కు స్థానిక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఎమ్మెల్యే అసీమ్ అహ్మద్‌ఖాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఆప్ సర్కారులో పర్యావరణ మంత్రి కూడా అయిన అసీమ్‌ను తక్షణం కేబినెట్ నుంచి సస్పెండ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ కేసులో నిందితులందరూ ఆప్ కార్యకర్తలని బీజేపీ అంటోంది.
నిందితుల అరెస్టులో జాప్యం చేయవలసిందిగా, కేసు బలహీనపడేలా ఎఫ్‌ఐఆర్ నమోదుచేయవలసిందిగా ఖాన్ ఢిల్లీ పోలీసులపై ఒత్తిడి తెచ్చారని బీజేపీ ఆరోపించింది. నిందితులందరినీ అరెస్టు చేసి పోలీసులు తమ పని పూర్తి చేశారని, ఇటువంటి అక్రమ కార్యకలాపాలను ప్రోత్సహించబోనని ఇచ్చిన హామీని ఆప్ ప్రభుత్వం మరచిపోయిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ చెప్పారు. ప్రతిపక్షంలో ఉంటూ ఆప్ ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించాలని తమ పార్టీ నిర్ణయించిందని ఆయన తెలిపారు.
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఆప్‌కు రెండు నెలల సమయం ఇచ్చామని చెప్పారు. అయితే ఈ విధంగా గూండాలకు కొమ్ముకాస్తే సహించబోమని ఉపాధ్యాయ హెచ్చరించారు.
తుర్క్‌మాన్ గేట్ రోడ్ రేజ్‌పై బీజేపీ ‘రేజ్’
Published Thu, Apr 9 2015 10:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement